ఇట్లు.. మీ విధేయులు

TRS Leaders Who Contested In 2014 Elections Have No Ticket - Sakshi

జెండా మోసినా అండదండలు లేవు.. టికెట్లు రాలేదు.. పదవీ ఇవ్వలేదు

పార్టీలో గుర్తింపు దక్కడం లేదు

టికెట్లు రాలేదు.. పదవీ ఇవ్వలేదు

నిరాశలో టీఆర్‌ఎస్‌ విధేయులు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఉద్యమ ప్రస్థానంలో, అధికారం చేపట్టడంలో కీలకంగా వ్యవహరించిన నేతల్లో కొందరు ఇప్పటికీ ఎలాంటి గుర్తింపునకు నోచుకోవడం లేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలోనూ ఎలాంటి పదవులు పొందని వారు ప్రతి జిల్లాలో ఉన్నారు. నాలుగేళ్లు ఎదురు చూసినా పదవీ ఇవ్వలేదు.. టికెట్లూ రాలేదు. గత ఎన్నికల్లో ఓడిన వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఏదో ఓ పదవి వస్తుందని నాలుగేళ్లు ఎదురు చూసినా నిరాశే మిగిలింది. దీనికితోడు ఆ పార్టీ తాజాగా ప్రకటించిన జాబితాలో చోటు కూడా దక్కలేదు. ఇక పార్టీ సీనియర్‌ నేతల పరిస్థితి మరీ దయనీయం. ఉద్యమ సమయంలో పార్టీలో కీలకంగా వ్యవహరించి, గత ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన వారిని గెలిపించేందుకు పని చేసిన వారిలో కొందరు ఎలాంటి పదవులు లేకుండానే మిగిలిపోయారు.  

కీలకంగా పని చేసినా.. 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగిన జిల్లాలో కీలకంగా పని చేసి గుర్తింపునకు నోచుకోని నేతలు చాలా మందే ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో గుడిమల్ల రవికుమార్, జన్ను జకార్య, తక్కళ్లపల్లి రవీందర్‌రావు.. టీఆర్‌ఎస్‌ ప్రయాణంలో కీలకంగా పని చేశారు. వీరికి ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంగానీ.. నామినేటెడ్‌ పోస్టులుగానీ దక్కలేదు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కీలక నేతగా ఉన్న పోశెట్టికీ ఇంకా గుర్తింపు రాలేదు. ఆర్మూరుకు చెందిన వినయ్‌కుమార్‌రెడ్డి, ఆరెంజ్‌ ట్రావెల్స్‌ సునీల్‌రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న ఓరుగంటి రమణారావుకూ నిరాశే మిగిలింది. రమణారావు 2001 నుంచి గత ఎన్నికల వరకు జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన బాలూరి గోవర్దన్‌రెడ్డికి కూడా ఎలాంటి పదవి     దక్కలేదు.

ఉమ్మడి మెదక్‌లోనూ..
ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనూ గుర్తింపునకు నోచుకోని నేతలున్నారు. గత ఎన్నికల వరకు పటాన్‌చెరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించిన గాలి అనిల్‌కుమార్, నర్సాపూర్‌ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించిన దేవేందర్‌రెడ్డికి ఇంకా పదవులు రాలేదు. టీఆర్‌ఎస్‌ మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన విఠల్‌రావు ఆర్యదీ ఇదే పరిస్థితి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమ సమయంలో కీలకంగా పని చేసిన నేతలకూ పదవులు రాలేదు. నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న బొల్లేపల్లి శ్రీనివాసరాజు, మిర్యాలగూడ సెగ్మెంట్‌లో కీలక నేత అన్నభీమోజు నాగార్జునచారి, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నేత సామల శివారెడ్డిలకు నిరాశే మిగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు మొదటి నుంచి కాస్త పట్టున్న కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీ కీలక నేతగా వ్యవహరించిన కంచర్ల చంద్రశేఖరరావుకు కూడా ఎదురు చూపులు తప్పడం లేదు.  

చేరిన వారికే చాన్స్‌ 
2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 63 స్థానాల్లో విజయం సాధించింది. తర్వాత జరిగిన పాలేరు, నారాయణఖేడ్‌ ఉప ఎన్నికల్లోనూ గెలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌ సీపీ, బీఎస్పీ, సీపీఐ పార్టీల నుంచి 25 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజా ఎన్నికల్లోనూ వీరికి టీఆర్‌ఎస్‌ తాజా అభ్యర్థుల జాబితాలో చోటు దక్కింది. కానీ ఆయా నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేసి ఓడిన నేతల్లో ఎక్కువ మందికి మాత్రం టికెట్‌ రాలేదు, నామినేటెడ్‌ పదవులూ రాలేదు. ఎం.సహోదర్‌రెడ్డి (పరకాల), ఎన్‌.సుధాకర్‌రావు (పాలకుర్తి), సత్యవతి రాథోడ్‌ (డోర్నకల్‌), శ్రీహరిరావు (నిర్మల్‌), కావేటి సమ్మయ్య (సిర్పూర్‌), దుబ్బాక నర్సింహారెడ్డి (నల్లగొండ), ఎ.అమరేందర్‌రెడ్డి (మిర్యాలగూడ), కొత్త మనోహర్‌రెడ్డి (మహేశ్వరం), కంచర్ల శేఖర్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), కొలను హన్మంతరెడ్డి(కుత్బుల్లాపూర్‌), గొట్టిముక్కుల పద్మారావు (కూకట్‌పల్లి), కె.శంకర్‌గౌడ్‌ (శేరిలింగంపల్లి), స్వర్ణలత (రాజేంద్రనగర్‌), మురళీగౌడ్‌ (జూబ్లీహిల్స్‌), దండె విఠల్‌ (సనత్‌నగర్‌), గజ్జెల నగేశ్‌ (కంటోన్మెంట్‌), మందా శ్రీనాథ్‌ (అలంపూర్‌), బొమ్మెర రామ్మూర్తి (మధిర), ఊకె అబ్బయ్య (ఇల్లెందు), శంకర్‌నాయక్‌ (పినపాక), ఆదినారాయణ (అశ్వారావుపేట)లకు తాజాగా టికెట్‌ రాలేదు. పార్టీ పరంగానూ పదవులు దక్కలేదు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top