అన్ని జిల్లాల జెడ్పీ పీఠాలే లక్ష్యం: కేటీఆర్‌

TRS Focus on MPTC, ZPTC elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మరోసారి ఘనవిజయం సాధిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మొత్తం 32 జిల్లాలకు 32 జెడ్పీ ఛైర్మన్ పీఠాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. దీంతో పాటు ఎన్నికలు జరుగనున్న సుమారు 530పైగా మండల పరిషత్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు రానున్న ఎన్నికల్లోనూ నిరాశ తప్పదన్నరు. ఈ మేరకు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేటీఆర్‌ శనివారం తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ఎన్నికల కమిషన్‌ను కోరిన నేపథ్యంలో రానున్న వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలన్నరు. ఈ సమావేశంలో జిల్లాల వారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కేటీఆర్ ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. గత నెల రోజులుగా పార్లమెంట్ అభ్యర్థుల గెలుపుకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించామని, ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మరోసారి బ్రహ్మరథం పట్టనున్నారని కేటీఆర్ తెలిపారు. 

ఇదే తరహాలో వచ్చే స్థానికసంస్థల ఎన్నికల్లో పనిచేయాలన్నరు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకుల సేవలను వినియోగించుకొనేలా ముందుకు పోతామన్నరు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేస్తారని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు హాజరవుతారని కేటీఆర్ తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top