త్రిపుర సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

Tripura CM Biplab Deb Controversial Comments Now With Less Brain Remark - Sakshi

త్రిపుర సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా

న్యూఢిల్లీ: జాట్లు, పంజాబీలు శారీరకంగా బలవంతులే గానీ వారికి మెదడు ఎక్కువగా పనిచేయదంటూ త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలివితేటల్లో వారు బెంగాలీలతో పోటీ పడలేరంటూ వివాదానికి తెరతీశారు. ఓ కార్యక్రమంలో విప్లవ్‌ దేవ్‌ మాట్లాడుతూ.. ‘‘పంజాబీల గురించి మాట్లాడాల్సి వస్తే వారిని సర్దార్‌ అంటాం. వారికి తెలివి తక్కువగా ఉన్నా శారీరకంగా దృఢంగా ఉంటారు. కాబట్టి వారిని ప్రేమ, ఆప్యాయతలతో మాత్రమే గెలవగలం.

ఇక హర్యానాలో చాలా మంది జాట్లు ఉన్నారు. వారికి మెదడు సరిగా పనిచేయదు. అయితే ఆరోగ్యవంతులుగా ఉంటారు. తెలివితేటల్లో బెంగాలీలతో వారు సరితూగలేరు. బెంగాలీలు తెలివైనవారని భారతదేశమంతటా గుర్తింపు ఉంది’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా విప్లవ్‌ దేవ్‌, బీజేపీ తీరుపై మండిపడ్డారు. త్రిపుర సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటని ధ్వజమెత్తారు. బీజేపీ మైండ్‌సెట్‌ ఇదేనంటూ దుయ్యబట్టారు. హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ విప్లవ్‌ దేవ్‌ వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. (అసమర్థుడు.. పనికిరాని వాడు! )

ఈ మేరకు.. ‘‘దురదృష్టకరం, సిగ్గుచేటు. బీజేపీ ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ పంజాబ్‌లోని సిక్కు సోదరులను, హర్యానాలోని జాట్‌ సామాజిక వర్గాన్ని అవమానించారు. వారికి తెలివితేటలు లేవు అన్నారు. నిజానికి బీజేపీ అసలైన ఆలోచనా విధానం ఇదే. ఖట్టార్‌ జీ, దుష్యంత్‌ జీ ఎందుకు మౌనంగా ఉన్నారు. మోదీజీ, నడ్డాజీ ఎక్కడున్నారు? క్షమాపణ కోరాలి. చర్యలు తీసుకోవాలి’’అని రణ్‌దీప్‌ సూర్జేవాలా బీజేపీ అధినాయకత్వం, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.

అయితే ఈ వీడియో ఏ కార్యక్రమానికి సంబంధించినదీ, ఎప్పుడు జరిగిందీ తదితర వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా త్రిపుర సీఎం విప్లవ్‌ దేవ్‌కు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం కొత్తేమీ కాదు. మహాభారతంలో ఇంటర్నెట్‌ ఉంది.. మే డే రోజున ప్రభుత్వోద్యోగులకు సెలవు ఎందుకు?.. విద్యావంతులైన యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆవులను పెంచుకోవాలి.. లేదంటే పాన్‌షాప్‌ పెట్టుకోవాలి వంటి సూచనలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top