అక్రమం, అన్యాయం, అప్రజాస్వామికం...

TPCC Chief Utham Kumar Reddy Along With MLAs Protests Before Assembly In Hyderabad - Sakshi

సీఎల్పీ విలీన ప్రక్రియపై కాంగ్రెస్‌ ఆగ్రహం

12 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ కొనుగోలు చేసిందని ధ్వజం

జాతీయ పార్టీని విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదు

అసెంబ్లీ ముందు భట్టి, ఉత్తమ్, దుద్దిళ్ల, షబ్బీర్‌ ధర్నా

నిరసనకు దిగిన నేతల అరెస్ట్‌

సీఎం దిష్టిబొమ్మల దహనానికి టీపీసీసీ పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని అధికార టీఆర్‌ఎస్‌లో విలీనం ప్రక్రియపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. అప్రజా స్వామికంగా, అనైతికంగా, అక్రమ పద్ధతుల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాన్ని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోం దంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది. కాంగ్రెస్‌ తరఫున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు, తమ పార్టీ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటూ   స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలసి వినతిపత్రం ఇవ్వడంతో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్‌ నిరసనలకు దిగింది.

తమ పార్టీ ఇచ్చిన లేఖను ఆమోదించరాదని, ఇప్పటికే తాము పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన లేఖపై స్పందించాలని కోరేందుకు స్పీకర్‌ కార్యాలయాన్ని సంప్రదించినా బదులు రాకపోవడంతో సీనియర్‌ నేతలు అసెంబ్లీ సాక్షిగా నిరసనకు దిగారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని నినదించారు. పాదయాత్రగా ప్రగతి భవన్‌కు వెళ్లాలని నిర్ణయించడంతో పోలీసులు అసెంబ్లీ ముందు బైఠాయించిన నేతలను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

హైకోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా విలీనంపై నిర్ణయమా?
తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలసి కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసే ప్రక్రియ కోసం లేఖ ఇస్తున్నారని తెలిసిన వెంటనే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పీకర్‌ కార్యాలయానికి ఫోన్‌ చేశారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే స్పీకర్‌ అందుబాటులో లేరని సిబ్బంది తెలపడంతో ఉత్తమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ ఎక్కడ ఉన్నారో కనుక్కొని చెప్పాలని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు ఫోన్లో సూచించారు.

అలాగే ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ ఇచ్చిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరారు. అక్కడి నుంచి సమాధానం రాకపోవడంతో ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఫిరాయింపు ఎమ్మెలేలను స్పీకర్‌ ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలని మీడియా ముందు డిమాండ్‌ చేశారు. మమ్మల్ని కలిసేందుకు స్పీకర్‌ ఎందుకు సమయం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. హైకోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా విలీనంపై స్పీకర్‌ ఎలా నిర్ణయం తీసుకుంటారని అడిగారు. విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదన్నారు.

అసెంబ్లీ ముందు కాంగ్రెస్‌ నిరసన..
అప్రజాస్వామికంగా సీఎల్పీని విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రాహం ఎదుట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌ యాదవ్, మల్లు రవి నిరసనకు దిగారు. గాంధీజీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నల్ల రిబ్బన్లతో నిరసన తెలపాలని భట్టి భావించినా అధికారులు అందుకు అనుమతి నిరాకరించారు. దీంతో వారు అసెంబ్లీ గేటుకు ఎదురుగా రోడ్డుపై కూర్చొని నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. రెండు గంటలపాటు ధర్నా చేశారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ నినాదాలు చేశారు.

తమ పార్టీ గుర్తుపై గెలుపొంది సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని కోరుతున్న ఎమ్మెల్యేలందరిపైనా అనర్హత వేటు వేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. వారికి మరికొంత మంది కాంగ్రెస్‌ నేతలు జతకావడంతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆయా నేతలు సీఎం తీరును నిరసిస్తూ ప్రగతి భవన్‌కు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించారు. ఆ కసరత్తు జరుగుతుండగానే అప్రమత్తమైన పోలీసులు... ఉత్తమ్, భట్టి, షబ్బీర్, శ్రీధర్‌బాబు, మల్లు రవి, అంజన్, ఇతర నేతలను అరెస్టు చేసి పోలీసు వాహనాల్లో తప్పాచబుత్ర పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

జాతీయ పార్టీని ఎలా విలీనం చేస్తారు: ఉత్తమ్‌
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్‌ పార్టీనే రాష్ట్రంలో లేకుండా చేయాలని టీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీనే నిర్వీర్యం చేసేలా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌.. సోనియా గాంధీ కాళ్లు పట్టుకొని తెలంగాణ తెచ్చుకున్న విషయాన్ని మర్చిపోయి, జాతీయ పార్టీని విలీనం చేయాలనుకోవడం దుర్గార్గమని మండిపడ్డారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా ఎంఐఎంను నిలబెట్టేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల ఆశ చూపి, పదవులు ఎరవేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న పద్ధతులను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.

అత్యంత అప్రజాస్వామికంగా, అనైతికంగా సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి విపరీత చర్యల కారణంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే ప్రమాదం దాపురించిందన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, కేసీఆర్‌ ఆగడాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కావాలనే, ఉద్దేశపూర్వకంగానే స్పీకర్‌ చర్యలు తీసుకోవడం లేదని ఉత్తమ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

నిరసనలకు పీసీసీ పిలుపు...
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, విచ్చలవిడిగా రాజకీయ ఫిరాయింపులు చేస్తూ టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో రాజకీయ వ్యబిచారం చేస్తోందని టీపీసీసీ దుయ్యబట్టింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ దిగజారుడు రాజకీయాలను ఎక్కడికక్కడ నిలదీయాలని పార్టీ శ్రేణులను కోరింది. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని సూచించింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించాలని, అక్రమ అరెస్టులను ఖండించాలని కోరింది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ విచ్చలవిడితనంపై ప్రజాస్వామ్యవాదులు, మేధావులు స్పందించాలని విన్నవించింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top