ప్రజ్ఞాసింగ్‌కు టిక్కెట్‌ ఇవ్వడంలో మతలబు?

Ticket to Pragya singh is a Dangerous Tendency - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌పై హత్య, నేరపూరిత కుట్ర, రెండు మతాల మధ్య విద్వేషాన్ని రగిలించడం తదితర అభియోగాలతో క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. భారత రాజకీయ నేతలపై ఇలాంటి అభియోగాలతో కేసులు దాఖలవడం కొత్తేమి కాదు. కానీ ప్రజ్ఞాసింగ్‌పై దాఖలైన కేసు చాలా భిన్నమైనది. అది టెర్రరిజం కేసు. అంతటి తీవ్రమైన కేసు ఉన్నప్పటికీ ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఖరారు చేయడం మామూలు విషయం కాదు. పైగా ఈ కేసులో ఆమె అనారోగ్య కారణాలతో బెయిల్‌పై ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న ఆమె ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటారు? సరే, ప్రస్తుతానికి అది వేరే విషయం.

మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో సంభవించిన మోటార్‌సైకిల్‌ బాంబు పేలుడులో ఆరుగురు మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. ఈ పేలుడు కుట్రదారుల్లో ప్రజ్ఞాసింగ్‌ ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇతర వ్యవస్థీకత నేరాలకు, టెర్రరిజమ్‌ నేరానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. డబ్బుకోసమో లేదా ఇతర ప్రయోజనాల కోసమో వ్యవస్థీకత నేరాలు జరుగుతాయి. టెర్రరిజమ్‌ బుర్రను తొలిచే ఓ సిద్ధాంతం నుంచి పుట్టుకువస్తుంది. టెర్రరిస్టులు తాము ద్వేషించే శక్తుల అంతానికి హింసకు దిగుతారు. మెజారిటీలను అణచివేసేందుకు మైనారిటీలు టెర్రరిజాన్ని ప్రయోగిస్తారని భారత లాంటి దేశాల్లో ఒక అపోహ ఉంది. వాస్తవానికి మైనారిటీలను మెజారిటీలు అణచివేసినప్పుడు అసహనం, అశక్తతతో మైనారిటీల నుంచి తిరుగుబాట్లతోపాటు వాటి వికతరూపమైన టెర్రరిజమ్‌ పుట్టుకొస్తుందని ప్రపంచ మేధావులు ఇప్పటికే తేల్చి చెప్పారు. టెర్రరిజమ్‌ ఏ రూపంలో ఉన్నా, ఆ శక్తులు ఏమైనా తీవ్రంగా అణచివేయాల్సిందే, సమూలంగా నిర్మూలించాల్సిందేనంటూ పలు అంతర్జాతీయ తీర్మానాలు అమల్లో ఉన్నాయి.

అలాంటప్పుడు ఓ టెర్రరిస్టు కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన ప్రజ్ఞాసింగ్‌కు బీజేపీ టిక్కెట్‌ ఇవ్వడంలో ఔచిత్యం ఉందా? ఇస్లాం టెర్రరిజమ్‌ నేరమయితే, దానికి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ హిందూ టెర్రరిజమ్‌ నేరం కాదా? మైనారిటీలు చేస్తేనే తప్పు, మెజారిటీ వర్గీయులు చేస్తే తప్పుకాదనుకోవడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందేమోగానీ సెక్కులరిజమ్‌ అనిపించుకోదు. భారత రాజ్యాంగంలోని సెక్యులరిజమ్‌ భావాలకు ఇది విరుద్ధం కాదా ? భిన్న మతాలు, భిన్న సంస్కతుల సమ్మిలిత బహుల సమాజం భారత దేశం. దీనికి భిన్నంగా మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు పెద్ద పీట వేయడం వల్ల సమాజంలో సంక్షోభాలు తలెత్తి అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడతాయని ‘ది డార్క్‌ సైడ్‌ ఆఫ్‌ ది డెమోక్రసీ’ పుస్తకంలో ప్రముఖ రాజకీయ, సామాజిక శాస్త్రవేత్త మైఖేల్‌ మాన్‌ హెచ్చరించారు. దుష్ట శక్తి అనేది నాగరికతకు సంబంధం లేకుండా రాదని, నాగరికత నుంచే అది పుడుతుందని, దుష్ట శక్తికి రాజకీయ ఆసరా లభించినట్లయితే అది నాగరికత అంతానికి కారణం అవుతుందని కూడా మైఖేల్‌ మాన్‌ హెచ్చరించారు.

ప్రజ్ఞాసింగ్‌పై కేవలం ఆరోపణలే కాదు, ఆమె బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు రెండు నెలల కాలంలోనే అప్పటి పోలీసు దర్యాప్తు అధికారి హేమంత్‌ ఖర్కరే కనుగొన్నారు. పేలుడు పదార్థాలు అమర్చిన బంగారు రంగు ‘ఎల్‌ఎంఎల్‌ ఫ్రీడమ్‌ మోటార్‌సైకిల్‌’ యజమానిని గుర్తించడం ద్వారా ఆయన మాలేగావ్‌ కేసు కూపీ లాగారు. అప్పటికి సైన్యంలో పనిచేస్తున్న లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌తోపాటు రిటైర్డ్‌ మేజర్‌ రమేశ్‌ ఉపాధ్యాయ్‌తోపాటు పలువురు సాధువులు, మహంతుల హస్తం ఉన్నట్లు కనుగొని వారిపై ఆయన కేసులు పెట్టారు.  దురదష్టవశాత్తు రెండు నెలల అనంతరం ఓ టెర్రరిస్టు కాల్పుల్లో ఆయన మరణించారు. తాను పెట్టిన శాపం పర్యవసానంగానే ఖర్కరే చచ్చాడని ప్రజ్ఞాసింగ్‌ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top