కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో పొత్తుండదు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో పొత్తుండదు

Published Thu, Feb 15 2018 4:28 AM

thammineni veerabhadram says congress, trs not Political alliance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలయిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. గత 25 ఏళ్లుగా పలు రాజకీయ పక్షాలతో పొత్తులు పెట్టుకున్న తాము రాజకీయంగా బలహీనపడ్డామని, ఈ పరిస్థితుల్లో వామపక్ష ప్రజాతంత్ర ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు. బుధవారం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కాకుండా, ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ద్వారా ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజల్లోకి తీసుకెళ్తామని, అందులో భాగంగానే 28 రాజకీయ పక్షాలతో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌)ను ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ ప్రజలు బాగుపడాలంటే ఈ రెండు పార్టీలతో సాధ్యం కాదని, అందుకే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. సీపీఐ కూడా తమతో కలసి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కోదండరాం పెట్టే పార్టీ విధానాలు తమకు నచ్చితే కలుపుకుపోతామని చెప్పారు.  

20, 25 తేదీల్లో బీఎల్‌ఎఫ్‌ భేటీలు
ఈనెల 20న ఉమ్మడి మెదక్‌ జిల్లా బీఎల్‌ఎఫ్‌ సదస్సును సంగారెడ్డిలో, 25న ఉమ్మడి పాలమూరు జిల్లా సదస్సు మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్నామని తమ్మినేని చెప్పారు. ఈ సదస్సుల్లో బీఎల్‌ఎఫ్‌ భాగస్వామ్య పక్షాల సభ్యులే కాకుండా స్వతంత్రులు, రాబోయే ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న వారెవరు వచ్చినా స్వాగతిస్తామని తెలిపారు.  

కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం..
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కేసీఆర్‌ ఈ విషయంలో కనీస ఆగ్రహాన్ని కూడా వెలిబుచ్చలేదని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్‌ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, బి.వెంకట్, టి.జ్యోతిలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement