క్షణక్షణం టెన్షన్‌..టెన్షన్‌

Tension Environment While Counting AP Assembly 2019 V otes Of PSR Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగర కౌంటింగ్‌ ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరి రౌండ్‌ వరకూ ఇరువురి మధ్య విజయం దోబూచులాడింది. రౌండ్‌  .. రౌండ్‌కూ ఇరు పార్టీలకు స్వల్ప మెజార్టీలు రావడంతో విజయం ఎవర్ని వరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం 16 రౌండ్ల లెక్కింపునకు గానూ చివరికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపే విజయం మొగ్గు చూపింది. తొలి రౌండ్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌కు స్వల్ప మెజార్టీ వచ్చింది.

పది రౌండ్లకు గానూ మూడు నుంచి నాలుగు వేల మధ్యే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ ఉంది. ఆపై రెండు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి నారాయణకు కొంత మెజార్టీ రావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ తగ్గుతూ వచ్చింది. 14వ రౌండ్‌ పూర్తయ్యే సరికి పదుల సంఖ్యలో ఓట్లు మాత్రమే మెజార్టీ ఉండటంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. 15వ రౌండ్‌లో దాదాపు వెయ్యి మెజార్టీ రావడంతో ఇక గెలుపు ఖాయమని తేలింది. 16వ రౌండ్‌లో పెద్దగా తేడా లేకపోవడంతో పాటు పోస్టట్‌ బ్యాలెట్‌లో కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే మెజార్టీ ఉండటంతో చివరికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ను విజయం వరించింది.  

ధనం ప్రవహించినా..
నారాయణ విద్యాసంస్థల అధినేతగా అపర కుబేరుడైన మంత్రి నారాయణ సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. గతేడాది నుంచి నెల్లూరు నగరాన్ని టార్గెట్‌ చేసి ఎన్నికల నిర్వహణ చేసుకున్నారు. వివిధ ప్రార్థన మందిరాల నిర్మాణాలకు రూ.లక్షల్లో విరాళాలిచ్చి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళిక చేసుకున్నారు. విద్యాసంస్థల అధినేతగా నెల్లూరు నగరానికి ఏమీ చేయని నారాయణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ నిధులను అభివృద్ధి పేరుతో అస్మదీయులకు కట్టబెట్టి దోచుకుతినేలా చేశారు. ఎన్నికల సమయంలో విద్యాసంస్థల ఉద్యోగులతో ఓటుకు రూ.రెండు వేలను పంపిణీ చేయించారు. నేతలకు ప్యాకేజీలను ప్రకటించి ప్రలోభాలకు గురిచేశారు. ఇంతా చేసినా కూడా నెల్లూరు నగర ఓటర్లు మాత్రం ఎలాంటి అవినీతి మచ్చలేని నేతగా ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌కే మళ్లీ పట్టం కట్టారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top