77.84 ప్రశాంతం 

Telangana ZPTC And MPTC Elections In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : మలి విడత పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.భానుడు భగభగ మండుతున్నా ఓటర్లు ఓపికతో క్యూలో నిల్చున్నారు. మొదటి విడత కన్నా రెండో విడతకు పోలింగ్‌ శాతం ఎక్కువ నమోదైంది.  జిల్లాలోని ఖానాపురం, నల్లబెల్లి, పరకాల, నడికూడ, శాయంపేట, రాయపర్తి మండలల్లో రెండో విడతలో పరిషత్‌ ఎన్నికలు శుక్రవారం జరిగాయి. 77.84శాతం పోలింగ్‌ నమోదైంది. ఆరు జెడ్పీటీసీ స్థానాలకు గాను 56 మంది, ఎంపీటీసీలు 63కు గాను 452 మంది బరిలో నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరిగింది. 367 పోలింగ్‌ కేంద్రాల్లో 6,445 మంది పోలింగ్‌ సిబ్బంది విధులు నిర్వర్తించారు.

గంట గంటకు పెరిగిన పోలింగ్‌ శాతం
ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ జరిగింది. గంట గంటకు పోలింగ్‌ శాతం పెరుగుతూ వచ్చింది.ఉదయం 9 గంటల వరకు 41,551 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 24.09శాతం, ఉదయం 11 గంటల వరకు  82, 505 ఓటు హక్కును వినియోగించుకోగా 47.84 శాతం, మధ్యాహ్నం 1 గంటల వరకు1,10,741 ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ ముగిసే వరకు 1,34, 257 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా 77.84 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరు మండలల్లో జరిగిన ఎన్నికల్లో పరకాల మండలంలో ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పరకాలలో 14,526  మంది ఓటర్లు ఉండగా 11876 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా 81.76 శాతం నమోదైంది. శాయంపేట మండలంలో 33, 743 ఓటర్లుండగా 25,252 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 74.34శాతం నమోదైంది. పోలింగ్‌ పూర్తయిన తర్వాత  ఎన్నికల సిబ్బంది బ్యాలెట్‌ బాక్స్‌లను స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న పెద్ది దంపతులు
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, సతీమణి నల్లబెల్లి జెడ్పీటీసీ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పెద్ది స్వప్నలు నల్లబెల్లి మండల కేంద్రంలోని 38వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం నల్లబెల్లి, ఖానాపురంలో మండలాల్లోని గ్రామాల్లోకి వెళ్లి ఓటింగ్‌ సరళిని తెలుసుకున్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో  పరిశీలించిన కలెక్టర్‌
జిల్లా కలెక్టర్‌ ముండ్రాతి హరిత రెండవ విడత ఎన్నికలు జరగుతున్న మండలాల్లోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్‌ సిబ్బందిని పోలింగ్‌ సరళి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరకాల మండలంలోని కంఠాత్మకూరు, నడికూడ, కామారెడ్డిపల్లెల్లోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

స్వల్ప ఘర్షణ
శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలిక పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్‌ కేంద్రం వద్ద  బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి కోడెపాక స్వరూప, టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ అభ్యర్థి గండ్ర జ్యోతిలు ఇద్దరు దుర్బాషలాడుకున్నారు. బీజెపీ నాయకులు, స్థానికులు గండ్ర జ్యోతిని అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రికత్తత చోటుచేసుకుంది. ఖానాపురం మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతలు ఘర్షణ పడ్డారు. పోలిసులు చేరుకుని శాంతింప చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top