క్యాంప్‌లు షురూ

Telangana ZPTC And MPTC Candidates Camps - Sakshi

ప్రాదేశిక ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రలోభ పర్వానికి తెరలేచింది. మండల పరిషత్‌ పీఠాలే లక్ష్యంగా రాజకీయాలు ఊపందుకున్నాయి. టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం అయినప్పటికీ.. కాంగ్రెస్‌ సైతం పట్టవదలకుండా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో అటు కారు, ఇటు హస్తం నేతలు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ సభ్యులను క్యాంప్‌లకు తరలించారు. అంతేకాదు.. పలు మండలాల్లో ఎంపీపీ పీఠంపై టీఆర్‌ఎస్‌లో ద్విముఖ పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఎవరికి వారు వేర్వేరుగా క్యాంప్‌ రాజకీయాలకు తెరలేపినట్లు సమాచారం.ప్రధానంగా నర్సాపూర్, నార్సింగి, తూప్రాన్, వెల్దుర్తి మండలాలకు సంబంధించి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం.. స్వతంత్రులే కీలకం కావడంతో అందరి దృష్టి వీటిపైనే కేంద్రీకృతమైంది.

సాక్షి, మెదక్‌ : జిల్లాలో 20 ఎంపీపీ స్థానాలు ఉండగా.. మెజార్టీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థులే గెలుపొందారు. అల్లాదుర్గం, చిలప్‌చెడ్, హవేళి ఘణాపూర్, కౌడిపల్లి, కొల్చారం, మనో హరాబాద్, మెదక్, నిజాంపేట, పాపన్నపేట, రామాయంపేట, పెద్దశంకరంపేట, శివ్వంపేట పరిధిలో ‘కారు’కే స్పష్టమైన ఆధిక్యత లభిం చింది. ఈ 12 మండలాల్లో ఎంపీపీ స్థానాలు టీఆర్‌ఎస్‌కే దక్కుతాయనేది సుస్పష్టం. చేగుంట మండలానికి సంబంధించి మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులునలుగురు, స్వతంత్ర అభ్యర్థులు తొమ్మిదిమంది గెలుపొందారు. స్వతంత్రులంతాటీఆర్‌ఎస్‌ రెబల్స్‌ కావడం విశేషం. ఈ లెక్కన చేగుంట ఎంపీపీ పీఠం టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరే అవకాశం ఉంది. రేగోడు, చిన్న శంకరంపేట, టేక్మాల్‌ మండలాల పరిధిలో కాంగ్రెస్‌కే అధిక సంఖ్యలో ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. ఈ మూడు మండలాల్లో అనూహ్య  పరిణామాలు చోటుచేసుకోకుంటే ఎంపీపీ స్థానాలు కాంగ్రెస్‌వే.
 
రసకందాయంలో నాలుగు పీఠాలు
నర్సాపూర్, నార్సింగి, తూప్రాన్, వెల్దుర్తి మండలాల్లో ఎంపీపీ పీఠాలపై అస్పష్టత నెలకొంది. పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ నాలుగు పీఠాలు రసకందాయంలో పడ్డాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతలు ఎవరికి వారు తీవ్రంగా యత్నిస్తుండడంతో నాటకీయ పరిణా మాలు చోటుచేసుకుంటున్నాయి. నార్సింగికి సంబంధించి మొత్తం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్‌ఎస్‌ రెండు, కాంగ్రెస్‌ ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలుపొందారు. స్వతంత్రులు ఎటు మొగ్గు చూపితే వారే ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోనున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తూప్రాన్‌లో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌ రెండు, టీఆర్‌ఎస్‌ ఒకటి, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. ఇక్కడ స్వతంత్రులు కీలకం కానున్నారు. వెల్దుర్తిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌ ఐదు, టీఆర్‌ఎస్‌ నాలుగు, స్వతంత్రులు ముగ్గురు విజయం సాధించారు. ఇండిపెండెంట్లు ముగ్గురు మూకుమ్మడిగా ఎటు మొగ్గు చూపుతారో.. వారే ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోనున్నారు.
 
ఎంపీపీ పీఠాలు ఇలా.. 

  • మెదక్‌ నియోజకవర్గ పరిధిలోని మెదక్‌ ఎంపీపీ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. దీని పరిధిలో మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఐదింటిలో టీఆర్‌ఎస్, రెండింటిలో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం రాగా.. ఎంపీపీకి ప్రధానంగా ర్యాలమడుగు నుంచి పోటీ చేసిన యమున జయరాంరెడ్డి పేరు వినపడుతోంది. ఈ మేరకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని కలిసి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 
  • హవేళిఘనాపూర్‌ ఎంపీపీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. దీని పరిధిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 11 స్థానాల్లో టీఆర్‌ఎస్‌.. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. టీఆర్‌ఎస్‌కే ఆధిక్యం ఉండగా.. ఆ పార్టీ నుంచి ప్రధానంగా ఇద్దరు ఎంపీపీ పీఠానికి పోటీపడుతున్నారు. కూచన్‌పల్లికి చెందిన శేరి నారాయణరెడ్డి, తొగిటకు చెందిన మాణిక్‌రెడ్డి మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. శేరి నారాయణరెడ్డి స్వయానా ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన శేరి సుభాష్‌రెడ్డి సోదరుడు కాగా.. మాణిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు, రాజకీయ అనుభవం ఉంది. ఈ క్రమంలో ఎంపీపీ పీఠం కోసం ఎవరికి వారు ముమ్మరంగా యత్నిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు టీఆర్‌ఎస్‌కే చెందినప్పటికీ ఈ పదవి ఎవరిని వర్తిస్తుందనే అంశం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
  • శివ్వంపేట ఎంపీపీ స్థానం ఓసీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. దీని పరిధిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్‌ఎస్‌ పది, స్వతంత్రులు ఇద్దరు విజయం సాధించారు. శివ్వంపేట నుంచి ఎంపీటీసీగా విజయం సాధించిన తాజామాజీ ఎంపీపీ కల్లూరు హరికృష్ణ మరోసారి పీఠాన్ని అధిరోహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈయనకు పార్టీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఎంపీటీసీ సభ్యులను క్యాంప్‌నకు తరలిలించినట్లు తెలిసింది. మరోవైపు కొత్తపేట, పాంబండ ఎంపీటీసీ సభ్యులు సత్తిరెడ్డి, రమాకాంత్‌రెడ్డి సైతం ఎంపీపీ పదవిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. 
  • కొల్చారం ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. 10 ఎంపీటీసీ స్థానాలో ఏడు టీఆర్‌ఎస్‌.. ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌కే ఆధిక్యం ఉండగా.. ఎవరూ క్యాంప్‌నకు వెళ్లలేదు. ఎనగండ్ల, రంగంపేట్, రాంపూర్‌ ఎంపీటీసీ సభ్యులు ఎవరికి వారు ఎంపీపీ పదవికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 
  • మనోహరబాద్‌ ఎంపీపీ బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. దీని పరిధిలో ఎంపీటీసీ స్థానాలు ఏడు కాగా.. టీఆర్‌ఎస్‌–5, స్వతంత్రులు ఇద్దరు (టీఆర్‌ఎస్‌ రెబెల్స్‌) గెలుపొందారు. వీరిలో కల్లకళ్‌–2 అభ్యర్థి పురం నవనీత తరఫున కుచారం, రంగాయిపల్లి, లింగారెడ్డి పేట్‌కు చెందిన ఎంపీటీసీ సభ్యులు ఎలక్షన్‌రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపునకు వెళ్లినట్లు సమాచారం. మనోహరబాద్‌ అభ్యర్థి పొట్లోళ లత తరఫున పర్కిబందా, కల్లకళ్‌–1 ఎంపీటీసీ సభ్యులు జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మహిపాల్‌ రెడ్డి తరçఫున వేరే క్యాంప్‌నకు వెళ్లారు. 
  • నిజాంపేట ఎంపీపీ బీసీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. దీని పరిధిలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఆరింటిలో టీఆర్‌ఎస్, ఒకరు చొప్పున కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. రిజర్వేషన్‌ ప్రకారం నçష్కల్‌ నుంచి గెలిచిన దేశెట్టి సిద్ధరాములుకు మాత్రమే అవకాశం ఉండగా.. ఎంపీటీసీ అభ్యర్థులను క్యాంప్‌నకు తరలించినట్లు  తెలుస్తోంది. 
  • రామాయంపేట ఎంపీపీ ఎస్సీకి రిజర్వ్‌ అయింది. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి స్వగ్రామమైన కోనాపూర్‌ నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన భిక్షపతిని ఇదివరకే ఎంపీపీగా ప్రకటించినట్లు సమాచారం. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను క్యాంపునకు తరలించినట్లు తెలిసింది.
  • చేగుంట ఎంపీపీ స్థానం ఓసీ జనరల్‌కు రిజర్‌ కాగా.. దీని పరిధిలో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గెలిచిన తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులకు ఎనిమిది మంది క్యాంపులో ఉన్నారు. వీరిలో చందాయిపేట్, చేగుంట, రెడ్డిపల్లి ఎంపీటీసీ సభ్యులు రామచంద్రం, మసుల శ్రీనివాస్, శంభుని రవి ఎంపీపీ కోసం పోటీ పడుతున్నారు.
  • నార్సింగి ఎంపీపీ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా.. దీని పరిధిలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గెలుపొందిన వారిలో ఇద్దరు స్వతంత్రులు. ఒక కాంగ్రెస్‌ అభ్యర్థి క్యాంపునకు తరలి వెళ్లారు. నార్సింగి ఎంపీటీసీ ఆకుల సుజాతను ఎంపీపీగా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.  
  • రేగోడ్‌ ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయింది. దీని పరిధిలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌ నాలుగింట గెలుపొందింది. గజ్వాడకు చెందిన ఎంపీటీసీ సభ్యురాలు సరోజన ఎంపీపీ అయ్యే అవకాశం ఉంది. అయినా.. కాం గ్రెస్‌ సభ్యులు క్యాంపునకు వెళ్లినట్లు తెలిసింది. 
  • నర్సాపూర్‌ ఎంపీపీ పదవిని ఎస్టీ మహిళకు రిజర్వ్‌ చేశారు. దీని పరిధిలో పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ ఐదు చొప్పున గెలుపొందాయి. టీఆర్‌ఎస్‌కు చెందిన చిప్పలుతుర్తి ఎంపీటీసీ సంధ్యారాణి.. కాంగ్రెస్‌కు చెందిన అహ్మద్‌నగర్‌ ఎంపీటీసీ జ్యోతిలో ఎవరోఒకరు పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ యాదగిరిగుట్టలో క్యాంప్‌ పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నాయకులు హైదరాబాద్‌కు వెళ్తున్నారు. అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
  • కౌడిపల్లి ఎంపీపీ పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. దీని పరిధిలో పది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ తొమ్మిది.. కాంగ్రెస్‌ ఒక స్థానంలో గెలుపొందింది. సలబతపూర్‌ ఎంíపీటీసీ సభ్యుడు రాజు, మహమ్మద్‌ నగర్‌ ఎంపీటీసీ సభ్యురాలు సునీత ఎంపీపీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. 
  • వెల్దుర్తిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌ ఐదు, టీఆర్‌ఎస్‌ నాలుగు, స్వతంత్రులు ముగ్గురు (టీఆర్‌ఎస్‌ రెబల్స్‌) గెలుపొందారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ తమతమ సభ్యులను క్యాంప్‌లకు తరలించగా.. స్వతంత్రులు ముగ్గురూ ఎటూ వెళ్లలేదు. దీంతో ఈ పీఠంపై అనిశ్చితి నెలకొంది. 
  • తూప్రాన్‌లో ఎంపీపీ పీఠం కాంగ్రెస్‌కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎంపీపీ రిజర్వేషన్‌ బీసీ మహిళ కాగా.. రెండు చొప్పున కాంగ్రెస్, స్వతంత్ర.. ఒకరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందారు.  స్వతంత్ర అభ్యర్థిని బీసీ మహిళ గడ్డి స్వప్న కాంగ్రెస్‌లో చేరడంతో ఆమే ఎంపీపీ కానున్నట్లు తెలుస్తోంది.  
  • పెద్దశంకరంపేటలో శ్రీనివాస్, అల్లాదుర్గంలో అనిల్‌రెడ్డి ఎంపీపీలుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. పాపన్నపేటకు చెందిన ఎంపీటీసీలు తీర్థయాత్రకు.. చిన్నశంకరంపేట, టేక్మాల్‌ ఎంపీటీసీ సభ్యులు క్యాంప్‌లకు తరలివెళ్లినట్లు తెలిసింది.

 తొలి జెడ్పీ పీఠం మనోహరాబాద్‌కే..
జిల్లా పరిషత్‌ తొలి పీఠంతోపాటు ఎంపీపీ పదవులు ఎవరిని వర్తిస్తాయనే దానిపై జిల్లావ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. జిల్లా పరిషత్‌ పీఠం బీసీ మహిళకు రిజర్వ్‌ కాగా.. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని మెదక్‌ జిల్లాకు చెందిన మనోహరాబాద్‌కు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన హేమలతా శేఖర్‌గౌడ్‌ 5,579 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌పై విజయం సాధించారు. ఆమెకే జిల్లా పరిషత్‌ తొలి పీఠం దక్కుతుందని స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు సైతం పూర్తి విశ్వాసంతో ఉండడం విశేషం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top