ఓట్ల వెల్లువ

Telangana MPTC And ZPTC Second Phase Elections Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మలి విడత పోరులో గ్రామీణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. అధిక సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం రెండో విడత పరిషత్‌ ఎన్నికలు జరిగిన 8 మండలాల్లో సగటున 82.49 శాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం. తొలి విడత కంటే దాదాపు మూడు శాతం అదనం. ఒక మండలం మినహా ఏడు మండలాల్లో పోలింగ్‌ 80 శాతం దాటింది. అత్యధికంగా కొత్తూరు మండలంలో 86.28 శాతం, అత్యల్పంగా చౌదరిగూడ మండలంలో 78.41 శాతం నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.

ఎండ తీవ్రత పెరగక ముందే ఓటు వేయాలన్న ఉద్దేశంతో ఓటర్లు ఉదయం పూటే పోలింగ్‌ కేంద్రాల్లో కిక్కిరిశారు. ఈ క్రమంలో ఉదయం 11 గంటల వరకే 45.37 శాతం పోలింగ్‌ పూర్తయింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 64.29 శాతం మంది ఓటేశారు. ఎండ తీవ్రతతో మధ్యాహ్నం పోలింగ్‌ మందకొడిగా సాగింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాలుగు గంటల వ్యవధిలో కేవలం 18.17 శాతం మందే ఓటేశారు. షాద్‌నగర్, కందుకూరు మండలాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలకు బ్యాలెట్‌ బాక్సులను చేర్చి భద్రపరిచా రు. ఓట్ల లెక్కింపు ఈ కేంద్రాల్లోనే జరుగుతుంది.
  
పురుషులే అధిక శాతం.. 
ఎనిమిది మండలాల పరిధిలో 89 ఎంపీటీసీ, 8 జెడ్పీటీసీలకు పోలింగ్‌ సజావుగా, ప్రశాతంగా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అటు పోలీసులు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 468 పోలింగ్‌ కేంద్రాల్లో 2.06 లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. మహిళల కంటే పురుషులే అధిక శాతం పోలింగ్‌లో పాల్గొన్నారు. మహిళలు 81.49 శాతం మంది ఓటేయగా.. పురుషులు 83.47 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కొన్నిచోట్ల వెలవెలబోయిన పోలింగ్‌ కేంద్రాలు  
కొత్తూరు మండలంలోని ఎస్‌బీపల్లి, మల్లాపూర్, కొడిచర్ల, పెంజర్ల గ్రామాల్లో ఓటర్లు లేక కేంద్రాలు వెలవెలబోయాయి. ఉదయం 11:30 గంటలకే కేంద్రాల వద్ద ఓటర్లు కనిపించలేదు. ఎండల తీవ్రత, దానికి తోడు వివాహలు ఎక్కువగా ఉండడంతో ఉదయమే కొంతమంది ఓటుహక్కును వినియోగించుకోగా.. సాయంత్రం మరికొంత మంది ఓట్లు వేశారు. 

అక్కడక్కడ అసౌకర్యాలు 
కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు మౌలిక వసతులు బాగానే కల్పించారు. మరికొన్ని చోట్ల ఓటర్లు తీవ్ర అసౌకర్యానికి గురికావాల్సి వచ్చింది. నందిగామ మండల కేంద్రంలోని 28, 29 పోలింగ్‌బూత్‌ల వద్ద టెంట్‌లు ఏర్పాటు చేయని కారణంగా ఓటర్లు ఎండలోనే నిలబడాల్సి వచ్చిం ది. అలాగే వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్‌ కేంద్రాల వద్ద ర్యాంపు నిర్మించాలి. అయితే ఈ విషయాన్ని అధికారులు కొన్ని చోట్ల తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటో కొన్ని చోట్ల ఓటరు స్లిప్పులు ఓటర్లకు అందలేదు. పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఓటర్లకు వీటిని పంపిణీ చేయాల్సి ఉన్నా పూర్తిస్థాయిలో దృష్టి సారించడంలో అధికారులు విఫలమయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top