కాంగ్రెస్‌ జాబితా.. 30 సీట్లు ఓకే!

IS Telangana Congress Select 30 MLA Candidates For Elections - Sakshi

ఆ నియోజకవర్గాల్లో ఒక్కో పేరుతోనే కాంగ్రెస్‌ జాబితా

మిగిలిన స్థానాల్లో ఎక్కువగా మూడేసి పేర్ల పరిశీలన

ఖమ్మం, సిరిసిల్ల, ఇబ్రహీంపట్నం, అంబర్‌పేట స్థానాలపై వాగ్వాదం

నేడు స్క్రీనింగ్‌ కమిటీకి పంపనున్న ఎన్నికల కమిటీ

నాలుగు రోజుల పరిశీలన తర్వాత ఏఐసీసీకి జాబితా

మిత్రపక్షాలకు 20కి మించి సీట్లు ఇవ్వద్దని కమిటీ ఏకాభిప్రాయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయం రసకందాయంలో పడింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థుల జాబితా ఖరారు ప్రక్రియ తుదిదశకు చేరడంతో అటు కాంగ్రెస్‌ ముఖ్య నేతల్లోనూ, ఇటు ఆశావహుల్లోనూ టెన్షన్‌ నెలకొంది. అభ్యర్థుల జాబితాను వడపోసేందుకు మంగళవారం సాయంత్రం నగర శివార్లలోని గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. పలు నియోజకవర్గాల్లో ఆశావహుల పేర్ల చేర్పులు, తొలగింపుల అంశం అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో జరిగింది. మొత్తంమీద ఎన్నికల కమిటీని మూడు విభాగాలుగా చేసుకున్న కాంగ్రెస్‌ నేతలు... ఒక్కో సబ్‌కమిటీకి 40 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను వడపోసే బాధ్యతలు అప్పగించారు. ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాసకృష్ణన్‌ల నేతృత్వంలో ఈ కమిటీలు సమావేశమై తమ పరిధిలోకి వచ్చే 40 స్థానాలకు సంబంధించిన పేర్లను వడపోసి ఒకటి నుంచి 6 పేర్లను సూచిస్తూ జాబితా తయారు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌. సి. కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క, కోర్‌ కమిటీ సభ్యులు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి. హన్మంతరావులతోపాటు ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీగౌడ్‌ ఈ భేటీకి గైర్హాజరయ్యారు. 

ఒకటి... రెండు... మూడు..! 
ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ కసరత్తు అనంతరం ప్రతి స్థానానికీ ఒకటి నుంచి 6 పేర్లతో స్క్రీనింగ్‌ కమిటీకి ఆశావహుల జాబితా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో 30 స్థానాలకు ఒక్కో పేరే సూచించారని విశ్వసనీయ సమాచారం. మిగిలిన స్థానాల్లోని మెజారిటీ సీట్లలో మూడేసి పేర్లు చేర్చారని, ఆరేడు చోట్ల రెండు పేర్ల చొప్పున వచ్చాయని తెలుస్తోంది. దాదాపు 15 సీట్లలో 2 నుంచి ఆరుగురి పేర్లు ప్రతిపాదించారు. అభ్యర్థుల ఖరారులో విధేయతకు ప్రాధాన్యం ఇవ్వాలని, చివరి నమిషంలో చేరిన నేతలను పక్కన పెట్టాల్సిందేనని కమిటీ సభ్యులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. టికెట్లు ఆశిస్తున్న కొందరు డీసీసీ నేతలు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు ఈసారి అవకాశం కల్పించాలని కూడా కమిటీ నిర్ణయించింది. 

ఖమ్మంపై ‘రచ్చ’... 
ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను పరిశీలించే విషయంలో నాయకుల మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ఖమ్మం స్థానాన్ని ఆశిస్తున్న పొంగులేటి సుధాకర్‌రెడ్డితోపాటు మరో వ్యక్తి పేరును కూడా అభ్యర్థుల జాబితాలో చేర్చడంతో పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో రేణుకాచౌదరి మరో పేరు సూచించడంతో పొంగులేటి అంగీకరించలేదు. అయితే రేణుక పంతంతో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తి పేరు కూడా జాబితాలో కమిటీ చేర్చినట్టు తెలియవచ్చింది. అదేవిధంగా కొత్తగూడెం విషయంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పేరు ఒక్కటే సూచించగా రేణుక పట్టుపట్టి యడవల్లి కృష్ణ పేరునూ చేర్చినట్టు తెలుస్తోంది. భద్రాచలం విషయంలో ఎమ్మెల్సీ పొంగులేటి మరో పేరును జత చేయించారని సమాచారం. సిరిసిల్ల విషయంలో కటకం మృత్యుంజయం పేరును ప్రతిపాదించగా అక్కడ చివరి క్షణంలో కేకే మహేందర్‌రెడ్డి పేరును కూడా చేర్చారు. అంబర్‌పేట విషయంలో మాజీ ఎంపీ వి. హన్మంతరావు ముగ్గురి పేర్లను సూచించి వారి పేర్లనే జాబితాలో ఉంచాలని కోరారు. కానీ అక్కడ ఆరుగురు ఆశావహుల పేర్లను ఎన్నికల కమిటీ సూచించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో కుటుంబానికి ఒక టికెట్‌ చొప్పునే ఇవ్వాలని పార్టీ నిర్ణయించినప్పటికీ కొన్ని స్థానాల్లో ఆ నిబంధనను పక్కనపెట్టి ఒకటికన్నా ఎక్కువ పేర్లనే జాబితాలో చేర్చినట్లు తెలిసింది. 

పరకాలలోనే కొండా సురేఖ... 
ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి కొండా సురేఖ పేరు పరకాల నియోజకవర్గం నుంచి పరిశీలించాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. ఆమెతోపాటు వెంకట్రామిరెడ్డి అనే నాయకుడి పేరును కూడా చేర్చి స్క్రీనింగ్‌ కమిటీకి అందించనుంది. మంగళవారమే పార్టీలో చేరిన ఇబ్రహీం పేరును కూడా మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి సిఫారసు చేయడం గమనార్హం. కరీంనగర్‌ అసెంబ్లీ స్థానానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేరుతోపాటు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పేరునూ ప్రతిపాదించారు. ఇబ్రహీంపట్నం విషయంలో మెజారిటీ నేతలు క్యామ మల్లేశ్‌కు అవకాశమివ్వాలని సూచించారు. ఇక్కడ ఆయనతోపాటు మల్‌రెడ్డి రంగారెడ్డి పేరును కూడా పరిశీలించనున్నారు.
 
నేడు స్క్రీనింగ్‌ కమిటీ రాక... 
ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ రూపొందించిన షార్ట్‌లిస్ట్‌ జాబితాను లోతుగా పరిశీలించి ఏఐసీసీ కోర్‌కమిటీకి ఆశావహుల జాబితాను అందించేందుకు ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్‌ కమిటీ నేడు హైదరాబాద్‌ రానుంది. కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌తోపాటు సభ్యులు శర్మిష్ట ముఖర్జీ, జ్యోతిర్మణిలు బుధవారం ఉదయం 7:30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వారు ఉదయం 11:30 గంటలకు మరోమారు జరిగే ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశానికి కూడా హాజరవుతారని సమాచారం. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సూచించిన ఆశావహుల జాబితాను పరిశీలించి ఏఐసీసీ ఖరారు చేయాల్సిన తుది జాబితాను రూపొందించేందుకు 4 రోజులపాటు ఈ బృందం ఇక్కడే ఉంటుంది. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సూచించిన ఆశావహులు, టీపీసీసీ ముఖ్యులు, ఇతర నేతలతో ఈ బృందం ఈ నెల 13 వరకు సమావేశమై ఏఐసీసీకి తుది జాబితా సమర్పిస్తుంది. ఈ నెల 16న జరగనున్న ఏఐసీసీ కోర్‌కమిటీ ఈ జాబితాపై చర్చించి అభ్యర్థుల జాబితాను రూపొందించనుంది.
 
20కి మించొద్దు... 
కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖరారు మాట అటుంచితే మిత్రపక్షాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు అడుగుతోందనే విషయంపైనా కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. సీపీఐ 9 స్థానాలు, తెలంగాణ జనసమితి 18 స్థానాలు, తెలుగుదేశం 20 కంటే ఎక్కువ స్థానాలు కోరాయని టీపీసీసీ ముఖ్యులు వివరించగా ఎట్టిపరిస్థితుల్లోనూ మూడు మిత్రపక్ష పార్టీలకు కలిపి 20 స్థానాల కంటే ఎక్కువ ఇవ్వొద్దని, 99 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీనే పోటీ చేయాలనే ఏకాభిప్రాయం కమిటీలో వ్యక్తమైంది.
 
మీడియాకు చెప్పొద్దు... 
అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్‌ పార్టీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో జరిగిన సంఘటనలను, నిర్ణయాలను ఎట్టిపరిస్థితుల్లోనూ మీడియాకు వెల్లడించవద్దని సమావేశానికి హాజరైన సభ్యులను టీపీసీసీ ముఖ్య నేతలు ఆదేశించారు. కాగా, సమావేశానికి హాజరైన ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క బుధవారం నుంచి ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఉండటంతో ఆ పనులు చూసుకునేందుకు సమావేశం నుంచి తొందరగానే వెళ్లిపోయారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ సమావేశం నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపిక పకడ్బందీగా జరుగుతుందని చెప్పారు. సబ్‌కమిటీలు ఏర్పాటు చేసుకున్నామని, ఒక్కో స్థానానికి మూడు పేర్లతో స్క్రీనింగ్‌ కమిటీకి జాబితా ఇస్తామని చెప్పారు. 48 గంటల్లోగా పొత్తుల గురించి తేల్చాలని తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం ఇచ్చిన అల్టిమేటం గురించి ప్రశ్నించగా ఆ విషయం తన దృష్టికి రాలేదన్నారు.
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక్కో పేరుతో స్క్రీనింగ్‌ కమిటీ ఇవ్వనున్న అభ్యర్థుల జాబితా... 
కెప్టెన్‌. ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హజూర్‌నగర్‌), కె. జానారెడ్డి (నాగార్జున సాగర్‌), మల్లు భట్టి విక్రమార్క (మధిర), దామోదర రాజనర్సింహ (అందోల్‌), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ), డి. శ్రీధర్‌బాబు (మంథని), గీతారెడ్డి (జహీరాబాద్‌), డి. కె. అరుణ (గద్వాల), షబ్బీర్‌ అలీ (కామారెడ్డి), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), టి. జీవన్‌రెడ్డి (జగిత్యాల), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), సంపత్‌కుమార్‌ (అలంపూర్‌), వంశీచందర్‌రెడ్డి (కల్వకుర్తి), జి. చిన్నారెడ్డి (వనపర్తి), ఎ. రేవంత్‌రెడ్డి (కొడంగల్‌), దొంతి మాధవరెడ్డి (నర్సంపేట) ఎ. మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్‌), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), నాయిని రాజేందర్‌రెడ్డి (వరంగల్‌ వెస్ట్‌), సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్‌), రేగా కాంతారావు (పినపాక), ఆరేపల్లి మోహన్‌ (మానకొండూరు), మర్రి శశిధర్‌రెడ్డి (సనత్‌నగర్‌), భిక్షపతి యాదవ్‌ (శేరిలింగంపల్లి), సుధీర్‌రెడ్డి (ఎల్బీ నగర్‌), విష్ణువర్దన్‌రెడ్డి (జూబ్లీహిల్స్‌), ముఖేశ్‌గౌడ్‌ (గోషామహల్‌), ఫిరోజ్‌ఖాన్‌ (నాంపల్లి), సంభాని చంద్రశేఖర్‌ (సత్తుపల్లి).   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top