చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్సీలు.. కీలక భేటీకి డుమ్మా

TDP MlCs Skip To LP Meeting Chair By Chandrababu Naidu - Sakshi

టీడీపీ ఎల్పీ సమావేశాలకు ఆరుగురు ఎమ్మెల్సీలు డుమ్మా

 బాబుకు వరుస షాకులిస్తున్న సొంతపార్టీ నేతలు

వికేంద్రీకరణకు అడ్డుపడటమే కారణమా!

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి  సొంత పార్టీ ఎమ్మెల్సీల నుంచి ఊహించని షాక్‌ తగిలింది. చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో ఆదివారం టీడీపీఎల్పీ భేటీ అయ్యింది. అయితే ఈ సమావేశానికి ఆరుగురు మండలి సభ్యులు డుమ్మా కొట్టారు. వీరిలో గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ, శమంతకమణి ఉన్నారు. పార్టీ అధినేతకు కనీస సమాచారం లేకుండా గైర్హాజరు కావడంతో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన పలువురు సీనియర్లుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (టీడీపీ ఎమ్మెల్సీల్లో ఆందోళన.. అంతర్మథనం)

బహిరంగంగా ఎవరూ విమర్శ చేయనప్పటికీ.. స్థానిక ప్రజల నుంచి ఆగ్రహాలు వ్యక్తమవుతుండటంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోతుల సునీత, శివనాథ్‌రెడ్డిలు పార్టీ విధానాలపై బహిరంగంగానే విమర్శలకు దిగారు. మరో సీనియర్‌ సభ్యుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ మండలి పదవికి ఇప్పటికే రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. మరోవైపు శాసన మండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో చంద్రబాబును నమ్మి మోసపోయాయని, కొరివితో తలగొక్కున్నట్లైందని టీడీపీ సభ్యులు వాపోతున్నారు. (ఎమ్మెల్సీలకు బాబు బుజ్జగింపులు)

మండలిని రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడంతో టీడీపీ ఎమ్మెల్సీలు అంతర్మథనంలో పడ్డారు. తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడిందని.. అందుకు చంద్రబాబే కారణమని లోలోన రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీల్ని బుజ్జగించేందుకు చంద్రబాబు రెండ్రోజులుగా ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ నేటీ భేటీకి టీడీపీ ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు. దీంతో వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న చంద్రబాబుకు సొంత పార్టీ సభ్యలు షాక్‌ ఇచ్చినట్లయింది. తాజా పరిణామం టీడీపీ వర్గాల్లో తీవ్ర నిరాశకు గురిచేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top