
టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
సాక్షి, అమరావతి: ఉత్తరప్రదేశ్, బిహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ పరాజయంపై టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ దెబ్బ బీజేపీకి యూపీలో తగిలిందని టీడీపీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వ్యాఖ్యానించారు. తెలుగువాళ్ల ఓట్ల ప్రభావం వల్లే ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిందని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కర్ణాటకలోనూ తెలుగువారు ఉన్నారని, బీజేపీ నాయకులు జాగ్రత్త పడాలన్నారు. కర్ణాటకలో బీజేపీకి ఓటమి తప్పదని హెచ్చరించారు.
ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారో బీజేపీకి ఇప్పటికైనా అర్థమైవుండాలన్నారు. గోరఖ్‌పూర్‌లో తెలుగువాళ్లు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఉపఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయన్నారు. హామీలు నిలబెట్టుకోకపోవడం వల్లే యూపీ, బిహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూసిందని తెలిపారు. యూపీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సొంత నియోజకవర్గాల్లోనే బీజేపీ ఓటమి చవిచూసిందంటే బీజేపీ పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవాలని సూచించారు.