టార్గెట్‌ వైఎస్సార్‌ సీపీ

TDP Leaders Target To YSRCP Leaders In Cricket Bettings - Sakshi

ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న వేధింపుల పర్వం

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు

నేడు ఎస్పీని కలవనున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి 

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసుల వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. గత ఏడాది నుంచి జిల్లాలో సాగుతున్న క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహరం తాజాగా కొత్త రంగు పులుముకుని సరికొత్త మలుపు తిరిగింది. నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రజాప్రతినిధిగా అధికార దుర్వినియోగానికి పాల్పడారనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేయడం జిల్లా రాజకీయ వర్గాల్లో హట్‌టాపిక్‌గా మారింది. దీనిపై కోటంరెడ్డి తీవ్రస్థాయిలో స్పందించి న్యాయపోరాటంతో ఎదుర్కొంటారని ప్రకటించారు. జిల్లాలో గతేడాది క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులు వందల సంఖ్యలో నమోదయ్యాయి. ఈ క్రమంలో క్రికెట్‌ బుకీలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నాయని  అధికార పార్టీ ఒత్తిళ్లలో పోలీసులు మొదటి నుంచి ఆ దిశగానే విచారణ నిర్వహించారు. వాస్తవానికి జిల్లాలో అధికార పార్టీ కీలక నేతలు, ప్రజాప్రతినిధులకు బుకీలతో మంచి సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ సత్యం.

కానీ ఆ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా అసత్య ప్రచారంతో ప్రతిపక్ష పార్టీని టార్గెట్‌ చేసే విధంగా జిల్లాకు చెందిన అధికార పార్టీ పెద్దలు రాజకీయంగా పోలీసులుపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలో నిజాయితీగా, ప్రజా సేవే పరమార్థంగా తన పని తాను చేసుకునిపోతున్న  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని టార్గెట్‌ చేశారు. రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణమాలు, పొలిటికల్‌ బీజీగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒక పర్యాయం నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత రాజ్యసభ అభ్యర్థి ఎన్నికల సమయంలో నోటీసులు ఇచ్చారు. దీనిపై ఫైర్‌ అయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి తాను బెయిల్‌ తెచ్చుకోకుండా న్యాయపోరాటం చేస్తానని గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి 366 రోజుల పాదయాత్ర ప్రారంభించిన సమయంలో కోర్టులో పోలీసులు చార్జీషీటు వేసి ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారు. ఈ నెల 14న కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. ఈ పరిణామాల క్రమంలో కేసు మళ్లీ అవినీతి నిరోధక శాఖకు అప్పగించటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఈ కేసు నివేదికను డీజీపీ మాలకొండయ్యకు పంపిన క్రమంలో ఆయన కేసును ఏసీబీకి కేటాయించి కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో  బుధవారం ఏసీబీ కేసు నమోదు చేసింది. 

నేడు ఎస్పీని కలవనున్న కోటంరెడ్డి
తాజా పరిణమాల క్రమంలో నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శుక్రవారం జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణను నేరుగానే కలవనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎస్పీ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top