జైకా రుణంతో తమ్ముళ్లకు జీవనోపాధి!

TDP Leaders Taking Commission From irrigation works - Sakshi

రూ.2 వేల కోట్లతో నీటిపారుదల అభివృద్ధి పథకం పనులు

ఎన్నికలకు ముందు ఆగమేఘాలపై టెండర్లు

టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు సూచించిన వారికే పనులు

కమీషన్లు దండుకుని ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా వెదజల్లే వ్యూహం!

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల జీవనోపాధుల అభివృద్ధి పథకం కాస్తా అధికార పార్టీ నేతలకు జీవనోపాధి కార్యక్రమంగా మారుతోంది. ఎన్నికలకు రెండు నెలల ముందు రూ.2 వేల కోట్ల వ్యయంతో మధ్య, చిన్న తరహా నీటివనరుల అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాలపై టెండర్‌ నోటిఫికేషన్లు జారీ చేయిస్తున్నారు. అధిక అంచనా వ్యయంతో కూడిన ఈ పనులను అస్మదీయులకు కట్టబెట్టి, భారీ ఎత్తున కమీషన్లు దండుకుని.. ఆ డబ్బును ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా వ్యయం చేసేందుకు భారీ స్కెచ్‌ వేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రాష్ట్రంలో మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల కింద ఆయకట్టులో రైతుల జీవనోపాధి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల జీవనోపాధుల అభివృద్ధి పథకం (ఏపీఐఎల్‌ఐపీ ) రెండో దశను ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) రూ.1,700 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. మిగతా రూ.300 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది. రెండో దశ అమలును పర్యవేక్షించడానికి జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సన్నిహితునికి చెందిన నిప్పాన్‌ కోయి సంస్థను ఎంపిక చేశారు. కన్సల్టెన్సీ ఫీజు కింద ఏకంగా రూ.61.29 కోట్లను ఆ సంస్థకు కట్టబెట్టారు. తాజాగా నీటివనరుల అభివృద్ధి, ఆధునికీకరణ పనులను కూడా అస్మదీయులకే కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకునే వెసులుబాటును టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జిలకు ప్రభుత్వ పెద్దలు కల్పించారు. ఇదే అదనుగా టెండర్లలో టీడీపీ ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు.

  • శ్రీకాకుళం జిల్లాలో బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట కుడి కాలువ(50 కిమీ)లు కింద 18,362 ఎకరాలు, ఎడమ కాలువ, ఎడమ హైలెవ్‌ కాలువ (54.60 కిమీ) కింద 18,691 ఎకరాలు వెరసి 37,053 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి.. రూ.91.12 కోట్లతో టెండర్లు పిలిచారు. నారాయణపురం ఆనకట్ట, ఎడమ కాలువ ఆధునికీకరణ పనుల(ప్యాకేజీ–ఎ)కు రూ.49.41 కోట్లతో, కుడి కాలువ ఆధునికీకరణ పనుల(బీ ప్యాకేజీ)కు రూ.41.71 కోట్లతో లంప్సమ్‌(ఎల్‌ఎస్‌) ఓపెన్‌ విధానంలో టెండర్లు పిలిచారు. వీటి నిబంధనలను అడ్డుపెట్టుకుని టీడీపీ ప్రజాప్రతినిధి సూచించిన వారికే పనులు అప్పగించారు. ఈ వ్యవహారంలో రూ.18 కోట్లకుపైగా కమీషన్లు చేతులు మారినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
  • కృష్ణా జిల్లాలో మున్నేరు బ్యారేజీ కింద 10,500 ఎకరాల ఆయకట్టు ఉంది. మున్నేరు బ్యారేజీ ఆధునికీకరణ పనులకు రూ.49.64 కోట్లతో టెండర్లు పిలిచి.. కీలక మంత్రి సూచించిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించారు. ఈ వ్యవహారంలో రూ.8 కోట్లకుపైగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి.
  • అనంతపురం జిల్లాలో పెన్నార్‌–కుముద్వతి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు రూ.16.83 కోట్లతో నిర్వహించిన టెండర్లలోనూ టీడీపీ ఎమ్మెల్యే సూచించిన వారికే పనులు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో రూ.3.2 కోట్లకుపైగా కమీషన్లు ముట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇదే జిల్లాలో అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు రూ.18.94 కోట్లతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఫిబ్రవరి 4న ఈ పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం ద్వారా రూ.3.50 కోట్లకుపైగా కమీషన్ల రూపంలో దండుకునేందుకు కీలక మంత్రి పావులు కదుపుతున్నారు.
  • సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లాలో కృష్ణాపురం రిజర్వాయర్‌ ఆధునికీకరణ పనులకు రూ.25.75 కోట్లతోను.. అరణియార్‌ రిజర్వాయర్‌ ఆధునికీకరణ పనులకు రూ.30.65 కోట్లతోనూ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు ఫిబ్రవరి 4న కట్టబెట్టి.. రూ.11 కోట్లకుపైగా ముడుపులు వసూలు చేసుకోవడానికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జికి ప్రభుత్వ పెద్దలు అవకాశం కల్పించారు.

కమీషన్లు ఇచ్చిన వారికే టెండర్లు!
శ్రీకాకుళం జిల్లాలో నారాయణపురం ఆనకట్ట, కృష్ణా జిల్లాలో మున్నేరు బ్యారేజీ ఆధునికీకరణ, చిత్తూరు జిల్లాలో అరణియార్, కృష్ణాపురం జలాశయాలు, అనంతపురం జిల్లాలో ఎగువ పెన్నార్, పెన్నార్‌–కుముద్వతి తదితర చిన్న మధ్య తరహా ప్రాజెక్టులకు నిర్వహిస్తున్న టెండర్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి.

అంచనాల్లో వంచన
నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనుల్లో ప్యాకేజీ–ఎ కింద ఎం–15 కాంక్రీట్‌ పనులకు క్యూబిక్‌ మీటర్‌కు రూ.4,407.60 వంతున వ్యయం అవుతుందని లెక్కకట్టిన జలవనరుల శాఖ అధికారులు, పాకేజీ–బి పనుల్లో అదే రకమైన పనులకు క్యూబిక్‌ మీటర్‌కు రూ.5,184.90 చొప్పున ఖర్చు అవుతుందని తేల్చారు. మున్నేరు బ్యారేజీ ఆధునికీకరణ పనుల్లో కాంక్రీట్‌ పనుల వ్యయం కూడా క్యూబిక్‌ మీటర్‌కు రూ.5,883.50కు (2018–19 ఎస్‌ఎస్‌ఆర్‌ మేరకు క్యూబిక్‌ మీటర్‌కు ఖర్చుయ్యేది రూ.3,900లే కావడం గమనార్హం) పెంచేశారు. అరణియార్, కృష్ణాపురం రిజర్వాయర్లు, పెన్నార్‌–కుముద్వతి ప్రాజెక్టు, ఎగువ పెన్నార్‌ జలాశయం తదితర ప్రాజెక్టుల ఆధునికీకరణ పనుల్లోనూ ఇదే ఎత్తున తప్పుడు అంచనాలతో వ్యయాన్ని పెంచేయడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top