చీరల ఎర.. గొడుగుల గాలం!

TDP Leaders Distributing Umbrellas And Sarees in Visakhapatnam - Sakshi

నర్సీపట్నంలో అప్పుడే ఎన్నికల ప్రలోభాలు

మంత్రి అయ్యన్న తరఫున రంగంలోకి సతీమణి, కుమారుడు

చీరలు ఇస్తూ.. మా ఆయన్ను గెలిపించాలని మహిళలకు పద్మావతి వినతి

మరోవైపు టీడీపీ రంగుల గొడుగులతో విజయ్‌బాబు హల్‌చల్‌

ఎంత లేదన్నా వీటి విలువ రూ.2 కోట్లపైమాటే..

ఈ సొమ్మంతా ఎక్కడి నుంచి వచ్చినట్లు..?!

ఇప్పుడే ఇంత ఖర్చు చేస్తే.. ఎన్నికల్లో ఇంకెంత చేస్తారో..??

ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టునమేస్తుందా?.. అనేది అందరికీ తెలిసిన సామెతే.. నర్సీపట్నంలో ఇప్పుడు ఈ సామెత తరహాలోనే తతంగం సాగుతోంది. రాష్ట్రస్థాయిలో సీఎం చంద్రబాబు ఎడాపెడా ఎన్నికల తాయిలాలు ప్రకటించేస్తుంటే.. తానేం తక్కువ తిన్నాననుకున్నారో లేక అధినేతను అనుసరించాలని నిర్ణయించుకున్నారో గానీ.. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు ఉండగానే సాక్షాత్తు మంత్రి అయ్యన్నపాత్రుడు కుటుంబం ఎన్నికల ప్రలోభాలకు తెర తీసింది.

నాలుగున్నరేళ్లపాటు ఇచ్చిన హామీలను డీప్‌ ప్రీజ్‌లో పెట్టేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలు సమీపించడంతో పోపుల డబ్బా నుంచి ఒక్కో దినుసు తీసి తాలింపు వేసినట్లు.. ఎన్నికల తాయిలలు విసిరేస్తుంటే.. ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పనుపున రంగంలోకి దిగిన ఆయన సతీమణి మహిళలపై చీరల ఎర వేస్తుంటే.. పుత్రరత్నం గొడుగులతో గాలం వేస్తున్నారు.ప్రభుత్వం ఇస్తున్న ‘పసుపు–కుంకుమ’కు తోడు ఇది మా సాయం అని వారు బాహటంగా ప్రకటిస్తూ ఎన్నికల్లో అయ్యన్నను మరోసారి గెలిపించాలని కోరుతున్నారు. ఇలా నియోజకవర్గం మొత్తం మీద చీరలు, గొడుగులకు వారు చేస్తున్న వ్యయం రూ.2 కోట్లుగా లెక్క తేలుతోంది.

ఎన్నికల కోడ్‌ అమల్లో లేనందున ఇప్పుడు వారు ఎంత ఖర్చు చేస్తే మనకేంటి అనుకుందామనుకున్నా.. నాలుగున్నరేళ్లలో ప్రజలపై కనిపించని ప్రేమ.. ఉన్న పళంగా ఎందుకు పుట్టుకొచ్చిందన్నది ఆలోచించాల్సిన అంశం. మరోవైపు ఎన్నికలకు మూడు నెలల ముందే కోట్లకు కోట్లు విసిరేస్తుంటే.. ఇక ఎన్నికల సమయంలో ఎన్ని కోట్లు నీళ్లలా ఖర్చు చేస్తారోనన్నది చర్చనీయాంశం.సొంత నిధులే ఈ బహుమతులకు వెచ్చిస్తున్నారనుకుంటే.. ఇన్ని కోట్ల రూపాయలుఎక్కడినుంచివచ్చాయన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి..

సాక్షి, విశాఖపట్నం : చింతకాయల అయ్యన్న పాత్రుడు.. ఒకే నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. ఐదుసార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి.. అలాంటి నాయకుడు సైతం రానున్న ఎన్నికల్లో మరోసారి గెలుపు కోసం ఇప్పటి నుంచే ఫీట్లు చేయడం మొదలుపెట్టారు. పైకి ఈసారి తాను పోటీ చేయనంటూనే పోటీకి సై అంటున్నారు. అధినేత మాదిరిగానే ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే ఎన్నికల గిమ్మిక్కులు చేస్తున్నారు. ఓవైపు కుమారుడు ఇంటింట తెలుగుదేశం అంటూ తన తండ్రి కోసం ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ఈసారి కూడా తన భర్తకే ఓట్లు వేయాలంటూ అయ్యన్న సతీమణి చీరల పంపిణీలో బిజీబిజీగా ఉన్నారు.

ముందుగానే చక్కబెట్టేస్తున్నారు..
సార్వత్రిక ఎన్నికలకు ఎంత లేదనుకున్నా రెండు నెలలకు పైగానే సమయం పడుతుంది. ఇంకా నోటిఫికేషన్‌ రాలేదు.. కనీసం షెడ్యూల్‌ కూడా ఇంకా విడుదల కాలేదు.. కానీ అప్పుడే అధికార పార్టీ నేతలు ఓటర్లకు ఎర వేయడం మొదలు పెట్టారు. గడిచిన నాలుగున్నరేళ్లలో సంపాదించిన అవినీతి సంపాదనతో ఇప్పటికే ఒక్కో నియోజకవర్గంలో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు సిద్ధం చేశారన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గంలో లేటరైట్‌ ముసుగులో సాగుతున్న బాక్సైట్‌ దోపిడీ ద్వారా వచ్చే అవినీతి సంపాదనతో ఈసారి ఓట్ల కొనుగోలుకు స్కెచ్‌లు వేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

మాకవరపాలెం మండలంలో డ్వాక్రా సంఘ అధ్యక్షులకు చీరలు పంపిణీ చేస్తున్నమంత్రి అయ్యన్న సతీమణి పద్మావతి
సీఎం బాటలో..
ఓపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముంగిట డ్వాక్రా సంఘాలకు సెల్‌ఫోన్లు, పసుకు కుంకుమ–2 పేరిట రూ.10 వేల విలువైన చెల్లని చెక్కులు పంపిణీ చేస్తున్నారు. అలాగే బీసీలకు.. కులానీకో కార్పొరేషన్లు, రైతులకు రూ.10 వేల పెట్టుబడి సాయం అంటూ ఎన్నికల గిమ్మిక్కులు చేస్తున్న విషయం తెలిసిందే. తామేమీ తీసిపోలేదన్నట్టుగా ఆయన కేబినెట్‌లోని సీనియర్‌ మంత్రి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు ఎన్నికలకు రెండు నెలలు ఉండగానే ఓటర్లకు ముందస్తు తాయిలాల పంపిణీకి తెరతీశారు. ఇప్పటికే ఆరుసార్లు పోటీ చేశా.. ఐదుసార్లు మంత్రిగా పనిచేశా.. నాకంటే సీనియర్‌ ఇంకెవరూ లేరంటూ గొప్పలు చెప్పుకునే అయ్యన్న ఈసారి తన రాజకీయ వారసుడ్ని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం మరోసారి అయ్యన్న వైపే మొగ్గు చూపుతోంది. దీంతో మరోసారి ఎన్నికల గోదాలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్న అయ్యన్న తరపున ఆయన భార్య, కుమారుడు అప్పుడే రంగంలోకి దిగారు.

ఇంటింట తెలుగుదేశం అంటూ తిరుగుతున్న విజయ్‌ తన తండ్రి గెలుపు కోసం గొడుగులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే నర్సీపట్నం అర్బన్, రూరల్‌ మండల పరిధిలోని గ్రామాల్లో గొడుగుల పంపిణీ పూర్తి చేశారు. మరోవైపు తాజాగా భర్త విజయం కోసం అయ్యన్న భార్య పద్మావతి డ్వాక్రా సంఘాలను టార్గెట్‌ చేసి చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మెప్మా సిబ్బంది సహకారంతో ప్రతి గ్రామంలో సంఘాల వారీగా వివరాలు తీసుకుని మరీ పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చీర అందేలా లెక్కగట్టి మరీ ఇస్తున్నారు. పసుపు కుంకుమ కింద తమ ప్రభుత్వం రెండో విడత రూ.10 వేలు ఇస్తోంది కదా.. తమ వంతుగా చీరలు పంపిణీ చేస్తున్నామంటూ పదావతి బాహాటంగానే చెబుతున్నారు. ఈసారి కూడా తన భర్తనే గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఒక్కొక్క చీర రూ.300ల విలువ ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన నియోజకవర్గంలోని 5,782 సంఘాల పరిధిలో 63 వేల 779మంది డ్వాక్రా సభ్యులకు రూ.1.92 కోట్ల విలువైన చీరలను పంపిణీ చేస్తున్నారు.

డ్వాక్రా సంఘాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు కూడా చీరలు అందిస్తున్నారు. చీరలు, గొడుగులు కలిపి తాయిలాల విలువ సుమారు రూ.2.25 కోట్ల వరకు ఉంటుంది. ఈసారి ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఓటమి తప్పదన్న ఆందోళన అధికార పార్టీ నేతల్లో నెలకొంది. ఈ కారణంగానే ఓటర్లను లోబర్చుకునేందుకు ముందస్తు తాయిలాలు పంపిణీ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నోటిఫికేషన్‌ వెలువడకుండానే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక వెలువడిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కనీసం ఎంత లేదనుకున్నా ఓటర్లకు గేలం వేసేందుకు ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలోనే అధికార పార్టీ నేతలు రూ.25 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఈసారి ఎన్ని గిమ్మిక్కులు చేసినా మంత్రి అయ్యన్నకు ఓటమి తప్పదంటున్నారు.

మహిళలను ప్రలోభపెట్టేందుకే...
మహిళలకు వల విసిరి రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మంత్రి సతీమణి పద్మావతి చీరలు పంపిణీ చేస్తున్నారు. ఐదేళ్లుగా మంత్రి కుటుంబానికి మహిళలు గుర్తుకు రాలేదు. రెండు ఎన్నికల్లో జరగనుండడంతో మహిళలను ప్రలోభపెడుతున్నారు. ఎన్ని వేషాలు వేసినా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు.–పెట్ల ఉమాశంకర్‌ గణేష్, వైఎస్సార్‌సీపీ నర్సీపట్నం కన్వీనర్‌

ఎన్నికల్లో లబ్ధి పొందడానికే...
వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మంత్రి అయ్యన్నపాత్రుడు సతీమణి చీరలు పంపిణీతో ప్రలోభపెడుతున్నారు. సీఎం చంద్రబాబు పసుపు–కుంకంతో మహిళలను బుట్టలో వేసే యత్నం చేస్తుంటే...స్థానికంగా మంత్రి సతీమణి పద్మావతి చీరలు పంచి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. మహిళలు అంత అమాయకులు కాదు.. తగిన గుణపాఠం చెబుతారు–బాలేపల్లి వెంకటరమణ, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top