
ఆహార పదార్థంలో టీడీపీ నేతలు మట్టి పోసిన దృశ్యం, టీడీపీ నేతలు కూల్చేసిన టెంట్‌లు
అమరావతి (పెదకూరపాడు): అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.. అలాంటి అన్నంలో టీడీపీ నాయకులు మట్టిపోశారు. అంతేకాదు వైఎస్సార్‌సీపీ కార్యక్రమానికి వెసిన టెంట్‌లు కూల్చివేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. అమరావతిలోని ముస్లిం బజారులో కొందరు ముస్లిం యువకులు పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు సమక్షంలో పార్టీలో చేరటానికి ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులకు భోజనం పెట్టటానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యం చేశారు.
వండిన ఆహార పదార్ధాలు అన్నంలో మట్టి, బూడిద, నీరు పోశారు. ఈ కార్యక్రమానికి వేసిన టెంట్‌లను సైతం కూల్చివేశారు. దీనిపై సమాచారం అందుకున్న సీఐ ప్రభాకరరావు సిబ్బందితో వచ్చి మసీదు సెంటరులో ఉన్న టీడీపీ నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం నంబూరు శంకరరావు కూడా అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి టీడీపీ కార్యకర్తల చర్యలకు భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అందరికీ తాను అండగా ఉంటానని అభయమిచ్చారు. టీడీపీ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని అందుకే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఘటనపై వైఎస్సార్‌సీపీ నాయకులు అమరావతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శంకరరావుతోపాటు మంగిశెట్టి శ్రీనివాసరావు, మంగిశెట్టి కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, మేకల హనుమంతరావు, హనుమంతరావు, విన్నకోట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.