టీడీపీలో గ్రూప్‌ వార్‌

TDP Group War In PSR Nellore - Sakshi

మంత్రి నారాయణ క్యాంప్‌ కార్యాలయంలో బీద వర్సెస్‌ ఆదాల

బీద తీరుతో అసంతృప్తితో వెనుదిరిగిన  ఆదాల

సీఎం పర్యటనతో మళ్లీ బయటపడుతున్న లుకలుకలు

నగరంలో ఒక సామాజికవర్గం ఫ్లెక్సీల హడావుడి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీరుతో మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. అది కూడా మంత్రి నారాయణ సమక్షంలో ఆయన క్యాంప్‌ కార్యాలయంలో ఈ వ్యవహారం జరగటంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి అపాయింట్‌మెంట్‌ ఆదాల కోరితే ఆయన కంటే ముందుగానే బీద రవిచంద్ర కుదరదని చెప్పటం, అది కూడా పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో చెప్పటం, దీనికి మంత్రి మౌనం వహించటంతో ఆదాల కినుకు వహించారు. వెంటనే పార్టీ రాష్ట్ర అ«ధ్యక్షునికి దీనిపై ఆదాల ఫిర్యాదు చేసినట్లు సమాచారం.  ఇది కూడా సీఎం పర్యటన నేపథ్యంలో జరగటంతో పార్టీలో హాట్‌ టాపిక్‌ అయింది.

మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఇద్దరు గురుశిష్యులు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. కొంత కాలంగా పార్లమెంట్‌ పరిధిలో కార్యక్రమాల్లో పార్లమెంట్‌ ఇన్‌చార్జి హోదాలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శనివారం నగరంలో తెలుగుదేశం పార్టీ దళిత తేజం బహిరంగ సభ కార్యక్రమం జరగనుంది. ఈ సభకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లు, ఆర్థిక వ్యవహారాలు, ఇతర అంశాలపై చర్చించటానికి మంత్రి పి.నారాయణ క్యాంప్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో పాటు నగర నేతలు పలువురు పాల్గొన్నారు.

సమావేశం ముగిశాక  మాజీ మంత్రి ఆదాల నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని ములుమూడిలో అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి నారాయణను ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా కోరారు. గడిచిన నాలుగేళ్లలో రూరల్‌ నియోజకవర్గంలో కార్యక్రమాలకు పెద్దగా రాలేదు. తప్పనిసరిగా రావాలని కోరారు. దీనికి మంత్రి నారాయణ బదులివ్వటానికి ముందే ఎమ్మెల్సీ బీద రవిచంద్ర జోక్యం చేసుకోని మంత్రి నారాయణ ఎలా వస్తారు. సీఎం కార్యక్రమంహడావుడిలో ఉంటారు. పొద్దునే ఏర్పాట్లు చూసుకోవాలి. ఆయన రావటం కుదరదని ఖరాఖండిగా చెప్పాడు. అది నగర నేతలు, డివిజన్‌ కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తల సమక్షంలో చెప్పటంతో ఆదాల తీవ్ర అసంతృప్తికి లోనై అక్కడి నుంచి వెంటనే వెనుదిరిగారు. మంత్రి నారాయణ కనీసం ఒక్కమాటకు కూడా మాట్లాడలేదు. దీంతో పార్టీలో తనకి ప్రాధాన్యం ఇవ్వటం లేదని, తాను కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నా నేతలు తీరు సరిగాలేదని ఆదాల తన అనుచరుల వద్ద ఆక్రోశం వెళ్లగక్కారు. మరోవైపు వెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ఫోన్‌ చేసి బీద రవిచంద్ర తీరుపై ఫిర్యాదు చేశారు.

నగరంలో ఫ్లైక్సీల హడావుడి
శనివారం నగరంలో జరిగే దళిత తేజం కార్యక్రమం ఫైక్సీల హడావుడి కూడా పార్టీలో తీవ్ర చర్చకు దారీతీసింది. కొందరు దళిత నేతలు కూడా దీనిపై పార్టీ ముఖ్యుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నగరం అంతా దళిత తేజం ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు కానీ దానికి భిన్నంగా ఒక సామాజికవర్గం నేతలు ఫ్లెక్సీలు హడావుడి చేయటం అందులోనూ దళిత నేతలకు చోట లేకపోవటం గమనార్హం. ముఖ్యంగా గత 15 రోజులుగా దళిత తేజం విజయవంతం చేయండని పార్టీ దళిత నేతలుగా ఉన్న ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్, మాజీ మంత్రులు బల్లి దుర్గాప్రసాద్, పరసా రత్నం, పార్టీ నేతలు నెలవల సుబ్రమణ్యం, జోత్స్నలత తదితరులు అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో నగరంలో భారీగా ఏర్పాటు చేసిన ఫ్లైక్సీల్లో దళిత నేతలు కల్పించలేదు. దీనికి భిన్నంగా నగరంలో ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభి, తాళ్లపాక అనురాధ తదితర నేతలు భారీగా ఫ్లైక్సీలు ఏర్పాటు చేయటం పార్టీ అలంకరణ కమిటీకి తలనొప్పిగా మారింది.

పరసా హడావుడి
మరోవైపు సీఎం పర్యటన పేరుతో పరసా రత్నం హడావుడి చేశారు. శుక్రవారం పెళ్లకూరులో సమావేశం నిర్వహించి జనసమీకరణ బాధ్యత అధికారులకు అప్పగించారు. ఏపీఎం పద్మ, ఉఫాధి హామీ ఏపీఓ జ్ఞాన ప్రకాష్‌తో కలిసి ఆయన సమావేశం నిర్వహించి పొదుపు సంఘాల మహిళలు, ఉపాధి హమీ కూలీలతో మాట్లాడి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసీ జనాలను తరలించాలని ఆదేశాలు జారీ చేయటం చర్చనీయాంశం అయింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top