టీడీపీకి పట్టిన మైల పోయింది!

TDP Controversial comments on Ravela Kishore Babu - Sakshi

రావెల రాజీనామాపై తెలుగుదేశం పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు

ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన వైనం

తామంటే ఇంత చిన్నచూపా అంటూ మండిపడుతున్న దళిత సంఘాలు

ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామాతో తమ పార్టీకి పట్టిన మైల పోయిందంటూ టీడీపీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్తిపాడులోని నిమ్మగడ్డవారిపాలెం కూడలిలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని శనివారం పసుపు నీళ్లతో కడిగి శుద్ధి చేసి.. క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్‌ కుడికాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ గుంటుపల్లి వీరభుజంగరాయలు, నాయకుడు మమ్మూ సాహెబ్‌ మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవి ఇచ్చామన్నారు.

అలాంటి వ్యక్తి నేడు టీడీపీకి రాజీనామా చేయడం దారుణమన్నారు. రావెల రాజీనామాతో పార్టీకి పట్టిన మైల పోయిందంటూ మండిపడ్డారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందునే.. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పసుపు నీళ్లతో కడిగి శుద్ధి చేశామని చెప్పారు. రావెల రాజీనామా వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదని టీడీపీ మండలాధ్యక్షుడు గింజుపల్లి శివరాంప్రసాద్, జెడ్పీటీసీ భాగ్యారావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.విజయ్‌బాబు తెలిపారు. ఆయన ఒంటరిగానే పార్టీని వీడారని చెప్పారు. కాగా, టీడీపీ నేతల తీరుపై దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. మేమంటే ఇంత చిన్నచూపా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంత దుర్మార్గమా?
దళిత ఎమ్మెల్యే అయిన రావెలను కించపరచడం దారుణం. దళితులుంటే టీడీపీకి మైల పడుతుందా? ఇదెక్కడి దుర్మార్గం. పసుపు నీళ్లతో శుద్ధి చేసి టీడీపీకి పట్టిన మైల పోయిందంటారా? ఇది దళితుల మనోభావాలు దెబ్బతీయడమే. 
– కోడిరెక్క కోటిరత్నం (మాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top