ప్రజాందోళనలతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

State Govt did Rs 2 extra VAT deductions on Petrol and diesel - Sakshi

పెట్రోల్, డీజిల్‌పై రూ.2 అదనపు వ్యాట్‌ తగ్గింపు 

నేటి ఉదయం నుంచి తగ్గింపు ధరలు అమల్లోకి

శాసనసభలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు 

కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ, ఆదాయపు పన్ను తగ్గించాలని తీర్మానం

సంబంధం లేకుండా సభలో వైఎస్‌ జగన్‌పై ఆరోపణలు 

బీజేపీతో లింకుపెట్టి సవాల్‌ విసిరిన చంద్రబాబు  

సాక్షి, అమరావతి: ప్రజాందోళన వెల్లువెత్తుతుండడం, ప్రతిపక్షాల ఆందోళనలు తీవ్రమవడంతో పెట్రోల్, డీజిల్‌ ధరలపై అదనంగా వసూలు చేస్తున్న వ్యాట్‌ పన్ను రూ.4లో రెండు రూపాయలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ తగ్గింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శాసనసభలో ప్రకటన చేశారు. గత సంవత్సరం అక్టోబర్‌లో కేంద్రం పెట్రో ధరలపై రెండు శాతం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించి, రాష్ట్రాలు కూడా తమ పరిధిలో పన్నులు తగ్గించాలని కోరగా చంద్రబాబు అప్పట్లో స్పందించలేదు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోతుందనే కారణం చూపి చంద్రబాబు వ్యతిరేకించారు. అయితే ప్రస్తుతం పెట్రో ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్, ఆందోళనలు కొనసాగుతుండడం, ప్రజల్లో సైతం ధరలపై వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆయన రూటు మార్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు వ్యాట్‌ కొంత తగ్గించాలని నిర్ణయించారు.   పెట్రోల్, డీజిల్‌పై అదనపు వ్యాట్‌ పన్నును తాము రెండు రూపాయలు తగ్గించామని, కేంద్రం కూడా ఎక్సైజ్‌ డ్యూటీ, ఆదాయపు పన్ను, డివిడెండ్‌ను తగ్గించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయించారు.  

కేంద్రం బాధ్యతారాహిత్యం: సీఎం
ఈ సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం బాధ్యతారాహిత్యం వల్లే ధరలు పెరిగిపోయాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు రోజురోజుకు పెట్రోల్, డీజిల్‌ ధరలను అదుపు లేకుండా పెంచుతుండడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికుతోందని, సోమవారం ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన బంద్‌కు ప్రజల నుండి వచ్చిన విశేష స్పందన వచ్చిందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరగిందని, వీటిని తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారని కానీ అది వాస్తవం కాదన్నారు. 2013–14 సంవత్సరంలో క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 105.52 డాలర్లు ఉండగా ప్రస్తుతం 72.23 డాలర్లుగా ఉందని తెలిపారు. 2014లో లీటరు పెట్రోల్‌ ధర రూ.62.98 ఉండగా ఇప్పుడు రూ.86.71కు, డీజిల్‌ ధర రూ.49.60 నుంచి రూ.79.98కి పెరిగిందన్నారు.

గతంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు తగ్గినా కేంద్రం పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించలేదని పైగా అదనపు పన్నులు, సెస్‌ల పేరుతో ధరలు పెంచిందని విమర్శించారు. ఇప్పుడు మాత్రం క్రూడాయిల్‌ ధరలు పెరిగాయనే నెపంతో ధరలను పెంచుతోందన్నారు. 2014 జూన్‌ నెలలో డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ లీటరుపై రూ.3.56 ఉండగా, 2017 సెప్టెంబర్‌ నాటికి అది రూ.17.33కి పెరిగిందని, 2014లో లీటరు పెట్రోల్‌పై రూ.9.48 ఉన్న కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ 2018 నాటికి రూ.19.48కి పెరిగిందన్నారు. ఇదికాకుండా, మౌలిక సదుపాయాల సెస్‌ పేరుతో లీటరుకు పెట్రోల్‌కు రూ.7, డీజిల్‌కు రూ.8ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆందోళను గుర్తించి కేంద్రం వెంటనే ఎక్సైజ్‌ డ్యూటీ, సెస్‌లను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. 

సంబంధం లేకుండా జగన్‌పై ఆరోపణలు 
దీనిపై బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతుండగా చంద్రబాబు సహా పలువురు పదేపదే అడ్డుతగిలారు. సంబంధం లేకుండా ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పేరును ప్రస్తావించి ఆరోపణలు చేశారు. విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ డీజిల్, పెట్రోల్‌ ధరలు రూ.2కి తగ్గించడం అభినందనీయమని కానీ ఆ ధరలపై గుజరాత్‌లో 16 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 18 శాతం, కర్నాటకలో 20 శాతం, తెలంగాణలో 22 శాతం వ్యాట్‌ పన్ను ఉండగా ఏపీలో మాత్రం 24 శాతం ఉందని, దాన్ని ఇంకా తగ్గించాలని కోరారు. 

రూ.60 వేల కోట్లతో 25 లక్షల ఇళ్ల నిర్మాణం
రాష్ట్రంలో రూ.60 వేల కోట్లతో 25 లక్షల ఇళ్లు మంజూరు చేశామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. లబ్ధిదారులతో అక్టోబరు 2, జనవరిలో గృహ ప్రవేశాలు నిర్వహిస్తామన్నారు. మంజూరు చేసిన 25 లక్షల ఇళ్లలో ఎన్నికలు వచ్చేలోగా 15 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సోమవారం శాసనసభలో గృహ నిర్మాణం అంశంపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 20.95 లక్షల మందికి పక్కా ఇళ్లు లేవని సర్వే చేసి కేంద్రానికి పంపామని, పీఎంఏవై కింద ఇళ్లు మంజూరు చేయాలని కోరితే, కేంద్రం ఇప్పటివరకు 1.20 లక్షల మందికి మాత్రమే మంజూరు చేసిందన్నారు. గృహ నిర్మాణానికి కేంద్రం అసలు సహకరించడం లేదన్నారు.  లబ్ధిదారులకు ఇంటి జాగా కోసం భూ సేకరణ చేపడుతున్నామని, బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించామన్నారు.  

గృహ నిర్మాణాల తీరుపై కమిటీ వేద్దామా?
ఈ చర్చలో బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ లబ్ధిదారులు 20 ఏళ్ల పాటు కిస్తీలు చెల్లించాలని, ఇది వారికి భారమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన గృహ నిర్మాణం ఎలా ఉంది? ఏపీలో జరిగిన గృహ నిర్మాణం ఎలా ఉందనే అంశంపై కమిటీ వేద్దామా? అని సవాల్‌ విసిరారు. శాసనసభలో గృహ నిర్మాణంపై జరిగిన చర్చలో రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top