ఢిల్లీ పీఠానికి ‘దక్షిణ’ ద్వారం

Special story to south indian politics in 2019 elections - Sakshi

ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాలే కీలకం

‘తూర్పు–దక్షిణం’ అరుదైన కలయిక చక్రం తిప్పుతుందా? 

ఎన్ని ఎత్తులు వేసినా దక్షిణాదిన పాగా వేయలేని బీజేపీ 

పని చేయని హిందూత్వ ఎజెండా..అంతోఇంతో కర్ణాటకలోనే పట్టు

లోక్‌సభ ఎన్నికలంటే అందరికీ గుర్తొచ్చే రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. ఢిల్లీ పీఠానికి దగ్గరి దారిగా దీనికి పేరుంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 80 స్థానాలున్న ఆ రాష్ట్రంపైనే అందరి కన్ను.. ఎందరో ప్రధానులు ఆ గడ్డపై నుంచి వచ్చిన వారే. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ దిగ్గజాలు పోటీ చేసేది ఆ రాష్ట్రం నుంచే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభ బరిలోకి దిగేది కూడా యూపీ నుంచే. హిందువులకు పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రాలుగా పరిగణించే కాశీ, అయోధ్య కూడా ఆ గడ్డపైనే ఉన్నాయి. కానీ 130 లోక్‌సభ స్థానాలున్న దక్షిణాది రాష్ట్రాల గురించి జాతీయ పార్టీలు ఎందుకు పట్టించుకోవు? 2009 ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 33 మంది ఎంపీలను గెలిపించి యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన విషయం జాతీయ స్థాయి నాయకులకు గుర్తుండదా? అవసరమైనప్పుడల్లా కాంగ్రెస్‌ అగ్ర నేతలు సేఫ్‌ సీటుగా భావించి దక్షిణాది రాష్ట్రాలకే వస్తారే మరి.. అయినా, ఈ రాష్ట్రాలు కేంద్రంలో ఎందుకు చక్రం తిప్పలేకపోతున్నాయి? బీజేపీకి కూడా దక్షిణాదిపై నిర్లక్ష్యం ఎందుకు? ఈసారి ఆ పరిస్థితి మారుతుందా?.. 

2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఏకంగా 71 స్థానాలు గెలుచుకొని విజయకేతనం ఎగురవేయడంతో అందరూ యూపీ జపం చేస్తున్నారు కానీ ఈసారి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలే కీలకంగా మారుతాయనే అంచనాలున్నాయి. ఎన్నికల సమయంలో ఉత్తర భారతంలో ఎక్కడ చూసినా యూపీపైనే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత బిహార్‌ రాష్ట్రం గురించి మాట్లాడతారు. సామాన్య జనాన్ని ఎవరిని కదిలించినా ఆ రాష్ట్రాల్లో పార్టీలు, నాయకులు, మతపరమైన విభజన రాజకీయాలపైనే చర్చలు సాగుతుంటాయి. కానీ ఈసారి ఎన్నికలు కాస్త భిన్నంగానే కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంపై కూడా ఉత్తరాదిన చర్చ జరుగుతోంది. అందుకు కారణం ఆ రాష్ట్రంలో దీదీని ఢీకొట్టే వ్యక్తి మోదీ తప్ప మరెవరూ లేరన్న ప్రచారమే. బీజేపీ క్షేత్రస్థాయిలో అక్కడ పట్టు పెంచుకోవడంతో సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు అందరూ ఆ రాష్ట్రం వైపే చూస్తున్నారు. 

 ‘దక్షిణాది’ రూటే సెపరేటు
దక్షిణాది రాష్ట్రాల్లో సహజంగానే ఓ వైవిధ్యం కనిపిస్తుంది. కేవలం భాషాపరమైన వైవిధ్యం మాత్రమే కాదు సాంస్కృతిక, సామాజిక, రాజకీయ పరమైన వైరుధ్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ప్రాపంచిక విషయాలపై అవగాహన ఎక్కువ. అభివృద్ధిలోనూ, ఆదాయంలోనూ ఈ రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. అందుకే ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. 2014 ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించారు కానీ ఇప్పటికీ కర్ణాటక, తమిళనాడులో ప్రత్యేక గళాలు అడపాదడపా వినిపిస్తూనే ఉంటాయి. ఈ వైవిధ్యానికి అనుగుణంగా రాజకీయ అడుగులు వేయడం బీజేపీకి సాధ్యం కావడం లేదు. పాకిస్తాన్‌కు సరిహద్దు ప్రాంతం కాకపోవడమో, సహజంగానే దేశభక్తి వంటి అంశాలకు దక్షిణాది ప్రజలు తక్కువ ప్రాధాన్యం ఇవ్వడమో కానీ పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల ప్రచారం అస్త్రంగా మారింది కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో అది జరగలేదు. ఇక రామ మందిర నిర్మాణం వంటి వివాదాస్పద అంశాలే ఎజెండాగా మార్చుకున్న బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ ఎజెండా అమలు చేయలేకపోయింది. పైపెచ్చు రాజకీయ దురంధరుడిగా పేరున్న కరుణానిధి ‘లంకకు వారధి నిర్మించడానికి ముందు రాముడు ఏ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుకున్నాడో చెప్పగలరా’ అంటూ బీజేపీని సూటిగా ప్రశ్నించి ఒకప్పుడు వార్తల్లోకెక్కారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకున్న తేడాను చెప్పడానికి.

 ‘హిందూత్వ’ ఇక్కడ ఎజెండా కాదు!
హిందూత్వ ఎజెండాను అమలు చేయలేక, దానిని పాటించడం లేదని ఇతర పక్షాలను విమర్శించనూ లేక బీజేపీ సతమతమవుతోంది. కేసీఆర్, దేవెగౌడ, కుమారస్వామి వంటి నాయకులు తరచూ దేవాలయాలు సందర్శిస్తూ, జాతక చక్రాలను నమ్ముతూ హిందూత్వ పంథాలోనే నడిచారు. కేసీఆర్‌ ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేశారు కానీ హిందూత్వను రాజకీయ ఎజెండాగా మలచుకోలేదు. ఇఫ్తార్‌ విందులకు హాజరయ్యారు. ముస్లింలకూ రిజర్వేషన్లు కల్పించారు. సెక్యులర్‌ వాదిగానే ప్రచారం చేసుకుంటూ తాను చేయదలచుకున్నది చేస్తున్నారు. శబరిమలలో మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చినప్పుడు జరిగిన రగడను ఒక్కో పార్టీ ఒక్కో దృక్కోణంలో చూశాయి. బీజేపీ మతపరంగా సమాజాన్ని విభజించే కోణంలోనే తన ఎజెండాను అమలు చేసింది. కానీ మత ఘర్షణగా ఈ వివాదం రూపుదాల్చలేదు. మత విశ్వాసం, సంప్రదాయం ఒకవైపు, కోర్టులు, చట్టాలు మరోవైపుగా హోరాహోరీ పోరు సాగింది. అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌ కోర్టు తీర్పుని యథాతథంగా అమలు చేస్తే, కాంగ్రెస్‌ పార్టీ మత విశ్వాసం వైపు నిలబడి రాజకీయంగా లబ్ధి పొందిందన్న విశ్లేషణలున్నాయి. మొత్తంగా చూస్తే కర్ణాటక మినహా మరే దక్షిణాది రాష్ట్రంలోనూ బీజేపీకి పట్టు లేదనే చెప్పాలి. అందుకే ఈ రాష్ట్రాల్లో ఆశలను వదిలేసుకున్న బీజేపీ తూర్పు రాష్ట్రాల్లో బలం పెంచుకోవడానికి కసరత్తు చేస్తోంది. 

అరుదైన కాంబినేషన్‌ తూర్పు–దక్షిణం
ఈ ఎన్నికల్లో తూర్పు రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల అరుదైన కలయికే కేంద్రంలో ప్రభుత్వాన్ని శాసిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో జేడీ (ఎస్‌) అధినేత హెచ్‌.డి.దేవెగౌడ ప్రస్తుత ఎన్నికల్లో యూపీఏ భాగస్వామిగానే ఉన్నప్పటికీ, తెరవెనుక ఆయన కేసీఆర్‌తో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూనే ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచన వైపే మొగ్గు చూపిస్తున్నారు. దీదీ ఎప్పటికీ మోదీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే ఉండదు. అందుకే ఈసారి ఎన్నికల్లో దక్షిణ–తూర్పు రాష్ట్రాల ఫలితాలే కేంద్రంలో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఒడిశాలో బీజేపీ అంతో ఇంతో బలం పుంజుకున్నప్పటికీ బిజూ జనతాదళ్‌ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌పై చేయి సాధిస్తారని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ‘వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, బీజేడీ.. ఈ మూడు పార్టీలకు కలిపి 45–50 సీట్ల వరకు వస్తాయి. ఆ 50 సీట్లతోనే కేంద్రంలో చక్రం తిప్పొచ్చు’ అని నవీన్‌ పట్నాయక్‌ సహచర నేతలతో వ్యాఖ్యానించినట్టు  సమాచారం. 

కులాల నిచ్చెన మీదుగా ‘కర్ణాటక’కు..

దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పట్టున్నది కర్ణాటకలో మాత్రమే. ఆ రాష్ట్రంలో మఠాలు, స్వామీజీలు ఎక్కువగా ఉండడంతో బీజేపీ తన జెండా ఎగుర వేయగలిగింది. అలాగని అక్కడ పూర్తిగా హిందూత్వ ఎజెండాతోనే బీజేపీ నెగ్గిందని చెప్పలేం. కులపరమైన సమీకరణలు కూడా కలిసి వచ్చాయి. లింగాయత్‌ జనాభా అధికంగా ఉన్న కర్ణాటకలో అదే సామాజిక వర్గానికి చెందిన బీఎస్‌ యడ్యూరప్ప కమలానికి అండదండగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌ కంటే యడ్యూరప్ప ఇమేజ్‌పైనే ఈ రాష్ట్రంలో పార్టీ ఆధారపడి ఉంది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ర్యాలీల్లో నరేంద్ర మోదీ పేరు ప్రస్తావించి హేళన చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థులంతా నెగ్గడం ఒక విశేషంగానే చెప్పుకోవాలి. లింగాయత్‌లకు పట్టున్న ఉత్తర కర్ణాటకలో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడంతో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించిందే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. యూపీఏతో పొత్తు కుదుర్చుకున్న జేడీ (ఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవెగౌడ 85 ఏళ్ల వయసులో తుమకూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారంటే కచ్చితంగా బీజేపీ హవాని అడ్డుకోవడానికే. అందుకే ఈ రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. సాంస్కృతికంగా, రాజకీయంగా ఎన్నో వైరుధ్యాలున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఒకే పార్టీ, ఒకే జాతి, ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే భాష వంటి బీజేపీ సిద్ధాంతాలకు రాజకీయంగా లాభం చేకూరడం లేదు. అందుకే ఈసారి కేంద్రంలో ఏ పార్టీకీ మెజారీటీ రాకపోతే దక్షిణాదే ఏ పార్టీకైనా దిక్కు. 

కేరళ, తమిళనాడులో యూపీఏ హవా?
కేరళలో ఎప్పటి నుంచో రెండు కూటములదే హవా. అయితే వామపక్షాల ఆధ్వర్యంలోని ఎల్‌డీఎఫ్‌ లేదంటే కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌. ఇప్పటివరకు బీజేపీ ఖాతా తెరిచిందే లేదు. ఈసారి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగడంతో పార్టీ కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహం వచ్చింది. హఠాత్తుగా యూడీఎఫ్‌ కూటమి బలం పెరిగినట్టయ్యింది. అలాగని ఇక్కడ ఎల్‌డీఎఫ్‌ని తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. బెంగాల్‌లో కమ్యూనిస్టులు రిటైర్‌ అయినట్టుగా భావిస్తుంటే, కేరళ కమ్యూనిస్టుల్లో పోరాట పటిమ ఎక్కువ. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో మొత్తం 20 లోక్‌సభ స్థానాలున్న కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు 14 నుంచి 16 సీట్ల వరకు వస్తాయని వివిధ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇక తమిళనాడులో జాతీయ పార్టీలకు స్థానమే లేదు. కొన్ని దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే రాష్ట్రాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. వాళ్లతో పొత్తు పెట్టుకోవడం మినహా కాంగ్రెస్, బీజేపీకి మరో మార్గం లేదు. తమిళ రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. కరుణానిధి వారసుడిగా స్టాలిన్‌ డీఎంకే పార్టీపై పట్టు సాధించారు. ఈ పార్టీ యూపీఏలో భాగస్వామిగా ఉంది. ఇక బీజేపీ అన్నాడీఎంకేతో పాటు ఎనిమిది పార్టీలున్న కూటమితో జతకట్టి కేవలం అయిదు స్థానాల్లోనే పోటీ చేస్తోంది. అన్నాడీఎంకే నాయకత్వ లేమితో, అంతర్గత పోరుతో సతమతమవుతోంది. అందుకే ఈసారి ఎన్నికల్లో 39 స్థానాలకు గాను యూపీఏ 31–33 స్థానాలు గెలుచుకోవచ్చునని సర్వేలు చెబుతున్నాయి.

నాడు యూపీఏను నిలబెట్టిన వైఎస్సార్‌ 
దక్షిణాది రాష్ట్రాల్లో 130 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. సంఖ్యాపరంగా చూస్తే వీటిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి దక్షిణాది అండదండ ఉండడంతోనే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. యూపీఏ–2 ప్రభుత్వం ఏర్పాటు వెనుక దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృషిని విస్మరించలేం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఎంగా అప్పట్లో వైఎస్‌ తనకున్న వ్యక్తిగత చరిష్మాతోనే 42 లోక్‌సభ స్థానాలకు గాను 33 స్థానాల్లో అభ్యర్థుల్ని గెలిపించారు. నాడు ఏపీ అండ లేకపోతే యూపీఏ–2 ప్రభుత్వం ఏర్పాటయ్యేది కాదనేది చరిత్ర చెప్పే నిజం. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు ఉంటుంది. 2009 ఎన్నికల్లో డీఎంకే 18 స్థానాలను గెలుచుకొని యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు తన వంతు సహకారాన్ని అందించింది. ్డ

దక్షిణాది రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలు 130
►2009 ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోటీ చేసిన లోక్‌సభ స్థానాలు. ఒక్కచోటా గెలవలేదు.
►2009లో కర్ణాటకలో బీజేపీ గెలిచిన లోక్‌సభ స్థానాలు - 20
►2014 ఎన్నికలు:దక్షిణాదిన బీజేపీ బలం
►3 ఏపీ, తెలంగాణలో గెలిచిన సీట్లు
►కర్ణాటకలో గెలిచిన లోక్‌సభ స్థానాలు -17  
►తమిళనాడులో గెలిచిన స్థానం - 1
►కేరళలో ఖాతా తెరవలేదు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top