
నీటికీ, కన్నీటికీ రంగు ఉంటుందా? చెట్టుకీ అది పంచే గాలికీ కులముం టుందా? ఇవన్నీ ప్రతి ఒక్కరికీ బతుకునిచ్చేందుకు కాక మరెందుకు అంటారు కబీర్ కవితలనూ, గీతాలనూ, భజనలరూపంలో దేశవిదేశాల్లో ప్రదర్శిస్తూ సంగీతానికి సరిహద్దుల్లేవని చాటిచెప్పిన ప్రహ్లద్.
మధ్యప్రదేశ్ దేవాస్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న ప్రహ్లాద్ సింగ్ తిపానియా మధ్యప్రదేశ్ ప్రజలకు సుపరిచితుడు. కబీర్ కవిత్వాన్ని విభిన్న గొంతుకలతో వినిపిస్తోన్న జానపదగాయకుడు ప్రహ్లాద్ సంగీతంతో ప్రజలమదిని మెప్పించినా తాజాగా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కబీర్ గానంతో సంగీత సామ్రాజ్యంలో తనదైన స్థానాన్ని నిలుపుకున్న ప్రహ్లాద్‌ని కాంగ్రెస్ పార్టీ దేవాస్‌ని నిలబెట్టడంతో సంగీతాభిలాషుల దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. దేవాస్‌లో గత (2014) ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోహర్ ఉంత్‌వాల్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సజ్జన్ సింగ్ వర్మపై 2,60,313 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ ఈ సీటుని కైవసం చేసుకుంది. అయితే ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని నిలబెట్టుకుకోవాలని బీజేపీ యత్నిస్తోన్న తరుణంలో కబీర్ గానాన్ని దశదిశలా వ్యాపింపజేస్తోన్న సం గీతకారుడు ప్రహ్లాద్‌సింగ్ సంగీతాన్ని విజ యపాచికగా వేసింది. దీంతో ఇక్కడి ప్రజలు కళాకారుడికి పట్టంకడతారా లేక తిరిగి బీజేపీకే పవర్ ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
మాల్వ ప్రాంతంలో 1954 సెప్టెంబర్ 7న బలాయీ దళిత కుటుంబంలో జన్మించిన ప్రహ్లాద్ మాల్వి జానపద శైలి రేడియో శ్రోతలకు సుపరిచితం. ఇండోర్, భోపాల్, జబల్‌పూర్, పట్నా, లక్నోవాంద్, కాన్పూర్ ఆకాశవాణి స్టేషన్లలో ప్రహ్లాద్ కబీర్ గానాలాపనకు చెవికోసుకోని వారుండరు. సాంప్రదాయక వాయిద్యాలైన తంబూర, ఖార్తాల్, మంజీర, ఢోలక్, హార్మోనియం, తిమ్కీ, వయోలిన్‌లతో ప్రహ్లాద్ భిన్నమైన జానపద కంఠంతో సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. అమెరికా కబీర్ యాత్ర పేరుతో సంగీత యాత్రను నిర్వహించిన ప్రహ్లాద్ తిపానియా అమెరికా, కెనడా, పాకిస్తాన్, లండన్ తదితర దేశాల్లో ప్రహ్లాద్ విస్తృతంగా కబీర్ కవితాగానం చేశారు. తొలుత సాధారణ స్కూల్ టీచర్‌గా ఉన్న ప్రహ్లాద్ క్రమేణా కబీర్ ప్రపంచంలో తలమునకలయ్యారు. జానపద సాహిత్యంలో భాగమైన కబీర్ కవితాగానాన్ని ఒడిసిపట్టుకున్న ప్రహ్లాద్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేయడం ఇటు సంగీత ప్రపంచంలోనూ, అటు సినీ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. 2011లో పద్మశ్రీ అవార్డుతో సహా ప్రముఖ అవార్డులెన్నింటినో సొంతం చేసుకున్న కబీర్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని లూన్యఖేది అనే కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఆత్మారామ్‌జీ, సంపత్‌బాయిల సంతానమైన ప్రహ్లాద్ తన సంగీతానికి సంబంధించి బీజేపీ నుంచి విమర్శలెదుర్కొంటున్నారు. అయితే గాలికీ, నీటికీ లేని కులం, మతం సంగీతానికెందుకని సున్నితంగా సమాధానమిస్తున్నారు ప్రహ్లాద్.