ఎన్సీపీలోనే ఉన్నా.. శరద్‌ మా నేత!

Sharad Pawar my leader, BJP-NCP alliance will provide stable govt - Sakshi

‘బీజేపీ– ఎన్సీపీ’ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అజిత్‌ ట్వీట్‌

ఖండించిన శరద్‌ పవార్‌; బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టీకరణ

మెజారిటీ తమదే అంటున్న ఇరుపక్షాలు..

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని, తన నేత శరద్‌పవారేనని స్పష్టం చేశారు. బీజేపీ–ఎన్సీపీ సంకీర్ణం మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఐదేళ్లు కొనసాగుతుందని ట్వీట్‌ చేశారు.

దీనిపై ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ స్పందిస్తూ.. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని  తేల్చిచెప్పారు. ‘శివసేన, కాంగ్రెస్‌లతో కూటమి ఏర్పాటు చేయాలనేది ఎన్సీపీ ఏకగ్రీవ నిర్ణయం’ అని శరద్‌ పవార్‌ ట్వీట్‌ చేశారు. ‘అజిత్‌ పవార్‌ ప్రకటన అబద్ధం. గందరగోళం సృష్టించే ఉద్దేశంతో ఇచ్చినట్లుగా ఉంది’ అని పేర్కొన్నారు. అలాగే, ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్‌ పవార్‌ను తొలగించి, ఆ స్థానంలో సీనియర్‌ నేత జయంత్‌ పాటిల్‌ను నియమించామని గవర్నర్‌కు ఎన్సీపీ సమాచారమిచ్చింది.

సంబంధిత లేఖతో ఎన్సీపీ నేత జయంత్‌ పాటిల్‌ గవర్నర్‌ నివాసం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌ అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బందికి ఆ సమాచారం అందజేశారు. ఆ తరువాత ఆయన నేరుగా అజిత్‌ పవార్‌ నివాసానికి వెళ్లడం విశేషం. తప్పు దిద్దుకుని, బీజేపీ నుంచి తిరిగి వెనక్కు రావాల్సిందిగా పవార్‌ను కోరేందుకే తాను వెళ్లానని ఆ తరువాతమీడియాకు చెప్పారు. కాగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి అజిత్‌ పవార్‌ కృతజ్ఙతలు తెలిపారు.  

ఇంటికి తిరిగొచ్చిన అజిత్‌ పవార్‌
శనివారం తన సోదరుడి ఇంట్లో గడిపిన అజిత్‌ పవార్‌ ఆదివారం  చర్చ్‌గేట్‌ దగ్గర్లోని తన నివాసానికి తిరిగి వచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, నేతలను కలుసుకున్నారు.  

మాకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు
తమకు 170కి పైగా ఎమ్మెల్యేల మద్దతుందని, సునాయాసంగా విశ్వాస పరీక్షను నెగ్గుతామని బీజేపీ తెలిపింది. విశ్వాస పరీక్షకు గవర్నర్‌ నవంబర్‌ 30 వరకు సమయమిచ్చారని బీజేపీ నేత ఆశిశ్‌ షెలర్‌ తెలిపారు.  బీజేపీకి మద్దతిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యేలతో త్వరలో భేటీ అవుతామన్నారు.  ఎన్సీపీ శాసనసభా పక్ష నేత కాబట్టి.. అజిత్‌ పవార్‌ విప్‌ జారీ చేస్తే.. ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా ఆ విప్‌కు బద్ధులై ఉండాల్సిందేనన్నారు.

శరద్‌ పవార్, ఉద్ధవ్‌ ఠాక్రే భేటీ
ఎన్సీపీ ఎమ్మెల్యేలున్న రినాయిజన్స్‌ హోటల్లో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ ఆదివారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉద్ధవ్‌ కుమారుడు, పార్టీ నేత ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు.  ఎన్సీపీ ఎమ్మెల్యేలున్న హోటల్లోకి సివిల్‌ దుస్తుల్లో పోలీసులు రావడంపై ఎన్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యేల బస మారింది
బీజేపీ నుంచి బేరసారాలకు వీలు లేకుండా, తమ ఎమ్మెల్యేలకు కాపాడుకునేందుకు శివసేన, ఎన్సీపీ ఆదివారం రాత్రి వారిని మొదట బస చేసిన హోటల్‌ నుంచి మార్చి వేరే హోటల్‌కు మార్చాయి. మొదట, ఎన్సీపీ ఎమ్మెల్యేలను రినాయిజెన్స్‌ రిసార్ట్‌లో ఉంచగా, ముందు జాగ్రత్తగా ఆదివారం రాత్రి వారిని మరో హోటల్‌కు మార్చారు. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు మొదట అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర్లోని లలిత్‌ హోటల్లో బస చేశారు. ఆదివారం రాత్రి వారిని కూడా వేరే రహస్య ప్రాంతానికి తరలించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాత్రం జుహూలోని జేడబ్ల్యూ మేరియట్‌ హోటల్లోనే ఉన్నారు.
ఫడ్నవీస్‌ను అభినందిస్తున్న చంద్రకాంత్‌ పాటిల్‌
ముంబైలోని తన నివాసానికి వస్తున్న అజిత్‌పవార్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top