ఎన్సీపీ నేతలపై అవినీతి ఆరోపణలు...

Sharad Pawar, Ajit Pawar accused of corruption - Sakshi

రాత్రికి రాత్రి బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమలుపుకి కారణమైన అజిత్‌ పవార్‌ సహా ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌పైనా, ఇతర నేతలపైనా అనేక అవినీతి ఆరోపణలున్నాయి. అజిత్‌ పవార్‌ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలెదుర్కొంటున్నారు. ఎన్సీపీ నేతలపై మహారాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంకు కుంభకోణం మొదలుకొని పలు కేసులు దర్యాప్తులో ఉన్నాయి.  

అజిత్‌ పవార్, ఇరిగేషన్‌ స్కాం...
అజిత్‌ పవార్‌ ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్నప్పుడు 1999 నుంచి 2014 మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మనీ ల్యాండరింగ్‌కి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసుని మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుని బట్టి విదర్భ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ క్లియరెన్స్‌ లేకుండా 38 ప్రాజెక్టులకు అనుమతిచ్చినట్టు అజిత్‌ పవార్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే తన నిర్ణయాలన్నీ సెక్రటరీ స్థాయి అధికారుల సిఫార్సుల ఆధారంగా తీసుకున్నవేనని అజిత్‌ పవార్‌ ఆ తరువాత సమర్థించుకున్నారు. సెప్టెంబర్‌ 2012న అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగి, తిరిగి నియామకం అయ్యారు.  

శరద్‌ పవార్, అజిత్‌ పవార్‌లపై ఈడీ కేసు...
ఈ యేడాది సెప్టెంబర్‌లో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెలముందు ఎన్సీపీ నేత శరద్‌పవార్, అజిత్‌పవార్‌లపై ఇతర మనీ ల్యాండరింగ్‌ కేసులతో పాటు 25 వేల కోట్ల మహారాష్ట్ర స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకు కుంభకోణం కేసుని మోపారు. 2010 నవంబర్‌ 10 నుంచి 2014 సెప్టెంబర్‌ 26 వరకు అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఎటువంటి నిబంధనలను పాటించకుండా, ఆర్థిక బలాలను పరిగణనలోనికి తీసుకోకుండా చక్కెర ఫ్యాక్టరీలకు విచ్చలవిడిగా రుణాలివ్వడం ద్వారా జనవరి 1, 2007 నుంచి 2017 డిసెంబర్‌ 31 మధ్య కాలంలో ప్రభుత్వానికి 25 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఎంఎస్సీసీ బ్యాంకుల నుంచి కోఆపరేటివ్‌ చక్కెర ఫ్యాక్టరీలకు ఎటువంటి పూచీ లేకుండా రుణాలిచ్చి, ఆ తరువాత వాటిని ఖాయిలాపడ్డ పరిశ్రమలుగా చూపించారన్న ఆరోపణలున్నాయి.
వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎన్సీపీ, శివసేనల నేతలు దిలీప్‌రావ్‌ దేశ్‌ముఖ్, ఇషార్‌లాల్‌ జైన్, జయంతి పాటిల్, శివాజీ రావ్, ఆనంద్‌రావు. రాజేంద్ర షింఘేన్, మాధవ్‌ పాటిల్‌లపై ఈడీ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో బ్యాంకుల చట్టాలను, ఆర్బీఐ ఆదేశాలను ఉల్లంఘించిన విషయాన్ని నాబార్డ్‌ ఆడిట్‌ రిపోర్టు వెల్లడించింది.  

చగన్‌ భుజ్‌బల్‌పై ఈడీ కేసు...
మనీ ల్యాండరింగ్, నేరపూరిత దుష్ప్రవర్తన, కుట్ర, మోసపూరితంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఎన్‌సీపీ నాయకుడూ, మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి చగన్‌ భుజ్‌బల్‌ను 2016 మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ మంత్రిగా ఉండగా 2005లో ఎటువంటి టెండర్లను ఆహ్వానించకుండా, కె.ఎస్‌.చమాంకర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టారని భుజ్‌బల్‌పై ఆరోపణలున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top