ఆయనకు సేవ.. మా అదృష్టం...

Service to him our luck ...says aiims doctors - Sakshi

ఏయిమ్స్‌ డాక్టర్లు, నర్సుల జ్ఞాపకాల పుటల్లో వాజ్‌పేయి...

దేశవ్యాప్తంగా తన వాక్పటిమ, రాజనీతిజ్ఞతతో ఆకట్టుకున్న  మహానేతకు వారు  సేవలందించారు. వాజ్‌పేయికి అంతమ శ్వాసవరకు సేవ చేసే అవకాశం లభించడాన్ని ఢిల్లీలోని ఆల్‌ఇండియా ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఏయిమ్స్‌) డాక్టర్లు, నర్సులు తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఏయిమ్స్‌లో వాజ్‌పేయికి  9 వారాల పాటు  చికిత్స అందించిన సందర్భంగా తమకెదురైన  జ్థాపకాలను వారు పదిలం చేసుకుంటున్నారు. వృద్ధాప్యంతో పాటు  న్యూమోనియా, వివిధ అవయవాలు పనిచేయని కారణంగా గురువారం  సాయంత్రం ఆయన కన్నుమూశారు. వాజ్‌పేయి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో  గత కొన్నిరోజులుగా తాము తీవ్ర వత్తిడిలో పనిచేయాల్సి వచ్చిందని, అయినా అలాంటి నేతకు సేవలు చేయడంలో ఆ శ్రమ మరిచిపోయామని చెబుతున్నారు. ’ చిన్నప్పటి నుంచి ఏ నాయకుడి ఉపన్యాసాలు టీవీల్లో చూస్తూ పెరిగామో ఆ నేతే ఆసుపత్రి మంచంపై తీవ్ర అనారోగ్య స్థితిలో కనిపించడాన్ని వివరించడానికి కష్టంగా ఉంది. వాజ్‌పేయి లాహోర్‌ బస్సుయాత్రకు వెళ్లిన  దృశ్యాలు ఇంకా కళ్లకు కట్టినట్టుగా  ఇప్పటికీ నాకు కనిపిస్తున్నాయి’ అని ఓ నర్సు చెప్పారు.

మామూలు ఆరోగ్య పరీక్షల కోసం జూన్‌ 11న ఏయిమ్స్‌కు వచ్చిన సందర్భంగా  ముత్రాశయ ద్వారంలో ఇన్ఫెక్షన్‌తో పాటు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్,తక్కువ మోతాదులో మూత్రం విడుదల, ఛాతీ సమస్యలను డాక్టర్లు  గుర్తించారు. ఆయనకు అవసరమైన వైద్యం అందించేందుకు  ఆ వెంటనే ఏయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలో ఐదుగురు డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యపరిస్థితిని గురించి ప్రధాని కార్యాలయం ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఉండేదని అక్కడి డాక్టర్లు తెలిపారు.

గత శనివారం నుంచి వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించడం మొదలైందని, బుధవారం మరింత విశమించిందని వారు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నానానికి రెండు ఊపరితిత్తుల్లో  న్యూమోనియా తీవ్రస్థాయికి చేరుకుందని, ఆ వెంటనే ’ఎక్స్‌ట్రా మెంబ్రేన్‌ ఆక్సిజెనెషన్‌’ (ఈసీఎంఓ) సేవలు అందించారు. ఈ ప్రక్రియ  గుండెకు, శ్వాసక్రియకు సహాయకారిగా ఉండడంతో పాటు, కృత్రిమ గుండెగా, ఊపిరితిత్తులుగాను ఇది పనిచేస్తుంది. దిగజారుతున్న  వాజ్‌పేయి ఆరోగ్యాన్ని బాగు చేసేందుకు వైద్యసిబ్బంది ఓ వైపు తీవ్రంగా శ్రమిస్తుండగా, విశమిస్తున్న ఆరోగ్యం పట్ల దేశవ్యాప్తంగా ఆందోళన పెరిగింది. చివరకు ప్రధాని మోదీ ఏయిమ్స్‌ను సందర్శించాక, వాజ్‌పేయి మరణవార్తను ఏయిమ్స్‌ మీడియా, ప్రోటోకాల్‌ డివిజన్‌ చైర్‌పర్సన్‌ డా. ఆర్తి విజ్‌ ప్రకటించారు. వాజ్‌పేయి మరణం రూపంలో  ఎంతో నష్టం వాటిల్లిందని, దేశవ్యాప్తంగా పెల్లుబికుతున్న సంతాపంలో తాము కూడా భాగస్వాములం అవుతున్నామంటూ పేర్కొన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top