మోదీ ఆశీస్సులు కావాలి | Seek PM Modis blessings for smooth governance of Delhi | Sakshi
Sakshi News home page

మోదీ ఆశీస్సులు కావాలి

Feb 17 2020 3:44 AM | Updated on Feb 17 2020 7:49 AM

Seek PM Modis blessings for smooth governance of Delhi - Sakshi

వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న కేజ్రీవాల్, సిసోడియా

న్యూఢిల్లీ: ఢిల్లీ పాలన సజావుగా సాగేందుకు కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నా, ఇందుకు ప్రధాని మోదీ ఆశీస్సులు కావాలని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసినందున రాజకీయాలతోనూ ఇక పనిలేదని, ఎన్నికల సమయంలో తనపై అనేక విమర్శలు గుప్పించిన రాజకీయ ప్రత్యర్థులను క్షమించేశా నన్నారు. ఆదివారం ఉదయం చారిత్రక రాంలీలా మైదానంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో మూడోసారి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు.. మనీశ్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్, కైలాస్‌ గహ్లోత్, గోపాల్‌ రాయ్, రాజేంద్ర పాల్‌ గౌతమ్, ఇమ్రాన్‌ హుస్సేన్‌లతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) అనిల్‌ బైజల్‌ ప్రమాణం చేయించారు. అనంతరం కేజ్రీవాల్‌.. భారత్‌ మాతా కీ జై, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ ప్రారంభించి దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు.

తనను తాను ఢిల్లీ కొడుకునని చెప్పుకున్నారు. ఈ విజయం తనది కాదని, ప్రతి ఢిల్లీ పౌరుడిదని అన్నారు. గతంలో కేంద్రంతో పలు సందర్భాల్లో తలపడిన కేజ్రీవాల్‌ ఈసారి మాత్రం.. తన పాలన సజావుగా సాగాలంటే ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులు కావాలని, కేంద్రంతో కలిసి పని చేయాలనుకుంటున్నానని చెప్పారు. ప్రమాణ స్వీకారానికి ప్రధానికి కూడా ఆహ్వానం పంపామనీ, ఆయన బిజీగా ఉండి రాలేకపోయి ఉంటారని అన్నారు. ఎవరిపైనా సవతి తల్లి ప్రేమ చూపనని, వచ్చే ఐదేళ్లూ ఢిల్లీ ప్రజలందరి కోసం పనిచేస్తానని చెప్పారు. ‘తల్లి ప్రేమ, తండ్రి ఆశీర్వాదంతోపాటు ఈ ప్రపంచంలో ప్రకృతి ఇచ్చే విలువైన ప్రతిదీ ఉచితమే.   ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం పొందిన వారి నుంచి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారి నుంచి ఫీజులు వసూలు చేస్తే నేను సిగ్గుపడాలి’ అని అన్నారు.  ‘హమ్‌ హోంగే కామ్‌యాబ్‌..’ అంటూ కార్యక్రమానికి హాజరైన ప్రజలతో గొంతుకలిపి పాడి కేజ్రీవాల్‌ తన ప్రసంగాన్ని ముగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement