భారత్ బంద్‌: దిగొచ్చిన కేంద్రం!

SC/ST Atrocities Act, Centre seeks review - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నారంటూ దళిత సంఘాలు దేశ్యాప్తంగా భారత్ బంద్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పుపై రివ్యూకు వెళుతున్నట్టు స్పష్టం చేసింది.

‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై మేం సమగ్ర పిటిషన్‌ను దాఖలు చేశాం. ప్రభుత్వం తరఫున సీనియర్‌ లాయర్లు వాదనలు వినిపించనున్నారు’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సోమవారం మీడియాకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కులం ఆధారంగా అమాయకులను వేధించేందుకు ఉపయోగించరాదని పేర్కొంటూ.. ఈ చట్టం అమలు విషయంలో పలు మార్పులు సూచిస్తూ జస్టిస్‌ ఏకే గోయల్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గత నెల 20న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు తీర్పు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు సోమవారం దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల కారణంగా ఎస్సీ, ఎస్టీల అత్యాచారాల నిరోధక చట్టం బలహీనపడుతుందని కేంద్రం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ చట్టం–1989 ప్రకారం.. వేధింపుల ఘటనల్లో అరెస్టులు, కేసు నమోదు వెనువెంటనే జరగాల్సి ఉంటుంది. కానీ, తక్షణ అరెస్టులు, కేసుల నమోదు ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వు ఫలితంగా బలహీన వర్గాలకు రక్షణగా నిలిచేందుకు ఉద్దేశించిన ఈ చట్టం నిరుపయోగంగా మారుతుందనీ, ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు పెరుగుతాయని ప్రభుత్వం తన పిటిషన్‌లో సుప్రీంకోర్టుకు తెలుపింది. అంతేకాకుండా, దళితులు, షెడ్యూల్‌ తెగల వారికి న్యాయం అందించటంలో తాజా ఉత్తర్వు ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top