చిన్న మెదడు చిట్లింది

Roja Slams Chandrababu In Thirupathi - Sakshi

సాక్షి, తిరుమల: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. గురువారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. బాబుకు చిన్నమెదడు చిట్లిపోయిందని, అందుకే అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై యూటర్న్‌ తీసుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలోనే ఎవరికీ ఇవ్వని ప్యాకేజీ ఏపీకి ఇచ్చారని అసెంబ్లీలో తీర్మానం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలుగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోరాటం, వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామా తర్వాత బాబు యూటర్న్‌ తీసుకోవడం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

కాంట్రాక్టుల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను మోదీ పాదాల దగ్గర చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అక్రమాస్తుల కేసు మాత్రమే వైఎస్‌ జగన్‌పై ఉందని, అక్రమాస్తులు చంద్రబాబు దగ్గరే ఉన్నాయని అన్నారు. దేశంలోనే అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రిగా ఉన్న మీ ఆస్తులు ఎందుకు మోదీ జప్తు చేయలేదని ప్రశ్నించారు. రూ.250 కోట్లతో హైదరాబాద్‌లో రహస్యంగా ఇల్లు కడితే ఆ ఇంట్లోకి ఒక్క టీడీపీ నాయకుడిని కూడా ఎందుకు ఆహ్వానించలేదో సమాధానం చెప్పాలన్నారు. అవినీతి సొమ్ముతో నిర్మించారు కాబట్టే ఎవరినీ ఆహ్వానించలేదని ఆరోపించారు. అధికారంలో వచ్చావు..రాయలసీమ ప్రజలకు కరువు తెచ్చావని ఎద్దేవా చేశారు.

ఓటుకు నోటు కేసులో కేసీఆర్‌, చంద్రబాబు నాయుడిని రాజీ చేశాం అని పార్లమెంటులో ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నీ స్వార్థం కోసం ప్రజల భవిష్యత్‌ తాకట్టు పెట్టి హైదరాబాద్‌ నుంచి ఆగమేఘాల మీద పారిపోయి వచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బుందేళ్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇవ్వకుండా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని సూటిగా అడిగారు. ఏపీ సీఎం చంద్రబాబును వెంటనే ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్‌మెంట్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వేయి కాళ్ల మండపాన్ని టీటీడీ పునఃనిర్మించాలని ఈఓకు వినతి పత్రం అందజేసినట్లు వెల్లడించారు. టీటీడీని ఆర్టీఐ యాక్ట్‌ కింద తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top