ఆ మాట ఏపీలోనూ చెప్పండి బాబూ.. 

RK Roja Comments On Chandrababu and Pawan Kalyan - Sakshi

ఫిరాయింపుదారులను చిత్తుగా ఓడించాలని తెలంగాణలో పిలుపునిస్తున్నారు.. 

ఏపీలో సంతలో పశువుల్లా కొన్న ఎమ్మెల్యేలను ఓడించాలని చెప్పగలరా? 

ఆ మాటలను మీ చానళ్లలో ప్రసారం చేయగలరా? 

పొత్తుల కోసం తాపత్రయపడిన మీరు జగన్‌ కుమ్మక్కయ్యాడని ఎందుకు అంటున్నారు

కేసీఆర్‌తో పొత్తుకు ప్రయత్నించింది మీరు కాదా?

ఆయన ఒప్పుకోకపోతేనే కదా కాంగ్రెస్‌తో జతకట్టింది

బాబు మాటలు వింటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోతుంది

అసెంబ్లీని భ్రష్టుపట్టించిన కోడెలను ప్రశ్నించే దమ్ము పవన్‌కు లేదు.. కోడెల వియ్యంకుడి ఇంటిలోనే పవన్‌ పార్టీ కార్యాలయం

సాక్షి, అమరావతి: పార్టీలు మారిన ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడించాలంటూ తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ మాటలనే ఆయన ఏపీ ఎన్నికల సమయంలో కూడా చెప్పాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తాను చేసిన తప్పులు మరిచిపోయి చంద్రబాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘చంద్రబాబూ, మీరే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నారే. వాళ్లను కూడా ఓడించాలా? ఏపీ ఎన్నికల సమయంలో మీరు ఇదే పిలుపునివ్వగలరా? ఆ మాటలను మీ చానళ్లు ప్రసారం చేయగలవా. హత్య చేసిన వాడిది ఎంత తప్పో, చేయించిన వాడిది అంతే తప్పు. అమ్ముడు పోయిన వారిది ఎంత తప్పో, కొనుక్కున్న వారిది కూడా అంతే తప్పు. అమ్ముడుపోయిన వారికి డబ్బు, కాంట్రాక్టులు, మంత్రి పదవుల ఆశ చూపి కొనుకున్న మిమ్మల్ని, మీ పార్టీని కూడా ఓడించాలా? వద్దా? చెప్పండి. తెలంగాణను, హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకొంటున్న మీరు, తెలంగాణలో ఇతర పార్టీలతో పొత్తు కోసం దేహి అంటూ ఎందుకు తాపత్రయపడ్డారు. అన్ని పార్టీలతో పొత్తుల కోసం తాపత్రయపడిన మీరు, కేసీఆర్‌తో జగన్‌ కుమ్మక్కు, మోదీతో జగన్‌ కుమ్మక్కు అయ్యారని ఎందుకంటున్నారు. చంద్రబాబు మాట్లాడే మాటలు వింటుంటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోయేలా ఉంది. అంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. హరికృష్ణ చనిపోతే, ఆయన శవాన్ని పెట్టుకొని టీఆర్‌ఎస్‌ పోత్తు కోసం ప్రయత్నం చేసింది మీరు కాదా? వాళ్లు ఒప్పుకోకపోతేనే కదా కాంగ్రెస్‌ పార్టీతో జతకలసింది.. ఇది నిజం కాదా?.  

కోడెల వియ్యంకుడి ఇంటిలో పవన్‌ పార్టీ ఆఫీసు.. 
ప్రజాస్వామాన్ని తుంగలోకి తొక్కి 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా చంద్రబాబు కొనుక్కొని పోతున్నా కనీసం మాట్లాడని పవన్‌కళ్యాణ్‌ రాజకీయాలను మారుస్తానంటే నమ్మడానికి ఏపీలో ఎవరూ చెవిలో పూలు పెట్టుకొని లేరు. దేశంలో ఏ స్పీకర్‌ కూడా కోడెల శివప్రసాదరావు మాదిరి దిగజారిపోయి ఉండరు. ప్రతి పార్టీ కార్యక్రమానికీ పచ్చ కండువా వేసుకొచ్చి పచ్చిగా అబద్ధాలు చెప్పుకుంటూ ఆయన రాజ్యాంగ పదవికి మచ్చ తెస్తున్నారు. ఇలాంటి వ్యక్తి గురించి పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడరు. 23 మంది ఎమ్మెల్యేలను కొంటే, దానిని ప్రోత్సహించిన కోడెలను పవన్‌ ప్రశ్నించరు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసి.. అసెంబ్లీకి గౌరవం లేకుండా చేస్తుంటే.. అలాంటి అసెంబ్లీకి మేం వెళ్లబోమని చెబితే మాకు ధైర్యం లేదంటారా? ప్రజాక్షేత్రంలో ఉన్న మేం ధైర్యంలేని వాళ్లమైతే, ఫిరాయింపులపై మీరెందుకు ప్రశ్నించడం లేదు. విజయవాడలో కోడెల శివప్రసాద్‌ వియ్యంకుడి ఇంటి నుంచి మీ పార్టీ నడుపు™తున్నారు కాబట్టి మీ నోరు పెగలడంలేదా? జగన్‌ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. జగన్‌ ధైర్యం గురించి తెలుసుకోవాలంటే, సోనియాను అడగండి. చంద్రబాబును అడగండి. 

పదవులు కొడుక్కి, ప్రచారానికి నందమూరి ఫ్యామిలీనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు పప్పు అయినా ఆ కొడుక్కే పదవులిచ్చుకుంటారు కానీ, నందమూరి కుటుంబ సభ్యులు ఆ పార్టీ కోసం ఎంత కష్టపడినా పదవులు మాత్రం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటారా? బాలయ్య అసెంబ్లీకి రారు, ఆయన నియోజకవర్గమైన హిందూపురం వెళ్లరు, కానీ, తెలంగాణలో మాత్రం ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. నందమూరి సుహాసినిని తీసుకొచ్చి చంద్రబాబు రాజకీయంగా బలి చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి కూడా తెలియకుండా బాలకృష్ణ తిరుగుతున్నారు. బతికున్నంత కాలం హరికృష్ణను అవమానించారు, వేధించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక చిన్న పదవైనా హరికృష్ణకు ఇవ్వలేదు. హరికృష్ణ కుటుంబంపై ప్రేమే ఉంటే.. జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లను మంత్రులను చేయొచ్చుకదా? పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా అవకాశం ఉన్నా చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు కోసం అక్కడ నుంచి పారిపోయి వచ్చిన విషయాన్ని తెలంగాణలో సీమాంధ్ర ప్రజలు ఆలోచించాలి. ఏపీలో ఏమీ చేయలేకపోయావ్, ఇక్కడ ఏం పని.. ముందు ఏపీలో ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చండని తరిమికొట్టండి అని తెలంగాణ వాళ్లను కోరుతున్నా. కేసులో దొరికినా వదిలేస్తే చంద్రబాబు ఎలా నెత్తికెక్కుతాడో కేసీఆర్‌కు ఇప్పటికైనా తెలిసి ఉంటుంది’’ అని రోజా చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top