‘క్యాబ్‌’పై పీకే వ్యతిరేకతకు కారణం ఇదే !

This is the Reason Why the JDU Supports the Citizenship Amendment Bill - Sakshi

పాట్నా : పౌరసత్వ సవరణ చట్టంపై జేడీయూ వైఖరితో బీహార్‌ రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు లాలూ ప్రసాద్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష ఆర్జేడీ బిల్లును వ్యతిరేకించగా, మొదట్లో వ్యతిరేకించినా అనంతర పరిణామాలతో అధికార జేడీయూ రెండు సభల్లోనూ బిల్లుకు మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ వైఖరిలో మార్పు పట్ల జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ నిర్ణయాన్ని బహింరంగంగా వ్యతిరేకించడం ప్రాధాన్యత సంతరించుకొంది. పార్టీ సమావేశంలో ముందుగా తీసుకున్న నిర్ణయానికి ఎందుకు వ్యతిరేకంగా వెళ్లారని పీకేతో పాటు రవివర్మ ప్రశ్నించగా, తాజాగా పార్టీ ఎంపీలు రాంచందర్‌ సింగ్‌ స్పందిస్తూ పార్టీలో నితీష్‌కుమార్‌ నిర్ణయమే ఫైనల్‌ అని నచ్చనివాళ్లు పార్టీని వదిలి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు. మరో ఎంపీ రాజీవ్‌ రంజన్‌ అధినేత తీసుకున్న నిర్ణయాలను ధిక్కరించే అధికారం పార్టీలో ఎవరికీ లేదని పీకేనుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఈ పరిణామం పట్ల విశ్లేషకులు మరో భాష్యాన్ని చెప్తున్నారు.

ప్రశాంత్‌ కిషోర్‌ భార్య అస్సామీ. ఈ బిల్లు వల్ల ఆ రాష్ట్రం అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీకే బిల్లును వ్యతిరేకిస్తున్నారని భావిస్తున్నారు.​ మరోవైపు నితీష్‌ కుమార్‌ బిల్లుకు మద్దతివ్వడంపై మరో కోణాన్ని తెలుపుతున్నారు. ఇటీవల బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ప్రతిపక్ష ఆర్జేడీకే పడ్డాయని, ఆర్జేడీ ముస్లింలకు ఎప్పుడు కూడా ప్రథమ ప్రాధాన్యంగా ఉంటుందని నితీష్‌ పసిగట్టారు. వచ్చే ఏడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనునక్నాయి. ఈ నేపథ్యంలో పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తే అటు ముస్లింల ఓట్లు పడకపోగా, ఇటు బలమైన హిందూ ఓటు బ్యాంకు కూడా దూరమైపోతుందని నితీష్‌ గ్రహించారు. అందుకే యూటర్న్‌ తీసుకొని బిల్లుకు మద్దతిచ్చారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల్లో తమ పార్టీ దెబ్బతింటుందని నితీష్‌కు తెలుసు. అయినా కూడా బీహార్‌లో హిందూ ఓట్లను కోల్పోకూడదనే ఉద్దేశంతో మద్దతిచ్చారని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై జేడీయూ సీనియర్‌ నాయకుడు నీరజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘ముస్లింలకు ఎంతో చేసినప్పటికీ వారి నుంచి మాకు పడే ఓట్ల శాతంలో పెద్ద తేడాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంపై మాకు ఎవరి సలహా అక్కర్లేద’ని పీకేనుద్దేశించి వ్యాఖ్యానించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top