చంద్రబాబుకు రావెల ఝలక్‌

Ravela Kishore Babu Resignation to TDP - Sakshi

టీడీపీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా 

రెండేళ్లుగా తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి 

సాక్షి, అమరావతి : మాజీ మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు టీడీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయానికి లేఖ పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెల్ల కాగితంపై రాసి చంద్రబాబుకు పంపారు. కొన్ని నెలలుగా టీడీపీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్న కిషోర్‌బాబు ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తూ చివరికి శనివారం జనసేన పార్టీలో చేరుతున్నారని ఆయన అనుచరులు చెప్పారు.

అనుక్షణం అవమానభారం 
2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల.. చంద్రబాబు మంత్రివర్గంలో మూడేళ్లు పనిచేశారు. తొలి రెండేళ్లు బాగానే ఉన్నా ఆ తర్వాత నుంచి పార్టీలో ప్రత్యర్థి వర్గం ఆయనపై పైచేయి సాధించి ఇబ్బందులకు గురిచేసింది. సొంత పార్టీ నేతలే వ్యతిరేకించడంతో జిల్లా రాజకీయాల్లో ఏకాకిగా మారారు. ఈ నేపథ్యంలో అవమానకరమైన రీతిలో 2017 మార్చిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు ఆయనకు ఉద్వాసన పలికారు. మంత్రి పదవిపోయాక పార్టీలో రావెల పరిస్థితి మరింత దిగజారింది. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో కలిసి నియోజకవర్గంలో సభ నిర్వహించిన రావెల.. చంద్రబాబుపై విమర్శలు చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకుంటున్నారని, మట్టి తరలింపులో ఆయన ప్రమేయం ఉందని ఆరోపణలు చేశారు.

ఆ తర్వాత నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ నేతలు ఆయన్ను గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. కొద్దిరోజుల కిందట వినాయక నిమజ్జనం ఉత్సవాల్లో పాల్గొనేందుకు వట్టిచెరుకూరు మండలం ముట్లూరు వెళ్లినప్పుడు స్థానిక టీడీపీ నేతలు దాడి చేశారు. ఆయన తలపై ఇసుకపోసి నానారభస సృష్టించారు. దీనిపై రావెల ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో రావెల జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా.. కమిషన్‌ సభ్యుడు నిజ నిర్ధారణ చేసుకుని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అయినా తూతూమంత్రపు చర్యలతో సరిపెట్టారు. పార్టీలో తనపై చూపుతున్న వివక్ష, మంత్రి పుల్లారావు వర్గీయుల వేధింపులపై చంద్రబాబుకు చెప్పేందుకు ప్రయత్నించినా రెండేళ్లుగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. రావెల రాజీనామాను స్పీకర్‌ కార్యాలయం ధ్రువీకరించ లేదు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top