తెలంగాణలో ప్రతి వ్యక్తిపై రూ.60 వేల అప్పు: రాహుల్‌ గాంధీ

Rahul Gandhi Slams Cm Kcr In Kodangal Public Meeting - Sakshi

మోదీని ప్రధాని చేయడమే కేసీఆర్‌ లక్ష్యం

తెలంగాణలో మహాకూటమిదే అధికారం

కొండగల్‌ సభలో రాహుల్‌ గాంధీ

సాక్షి, కొడంగల్‌ : తెలంగాణలో ప్రతి వ్యక్తిపై రూ.60 వేల అప్పు ఉందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ టీఆర్‌ఎస్‌ పాలనపై ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసి భారీ బహిరంగసభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల క్రితం తెలంగాణ ప్రజలు తమ భవిష్యత్తు బంగారం అవుతుందని కలలు కన్నారని, కానీ కేసీఆర్‌ పాలనలో అవి నేరవేరలేదన్నారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని దుయ్యబట్టారు. రూ.17 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడిందని, కానీ కేసీఆర్‌ పాలన వల్ల నేడు రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల అప్పు అయిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలోని ప్రాజెక్టులను కేసీఆర్‌ ప్రభుత్వం రీడిజైన్‌ చేసిందని, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పేరిటనే రూ.40 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. నాలుగేళ్లలో యువతకు కేసీఆర్‌ ఎన్ని ఉద్యోగాల ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను కేసీఆర్‌ నాశనం చేశారని విమర్శించారు.

లోక్ సభ, రాజ్యసభల్లో ప్రధాని నరేంద్ర మోదీకి అవసరం వచ్చినప్పుడల్లా కేసీఆర్ పూర్తిగా మద్దతిచ్చారని రాహుల్ గాంధీ తెలిపారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని... దాని పేరు తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్ అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో ప్రతి బిల్లుకు మోదీకి ఎందుకు మద్దతు పలుకుతున్నారని తాను టీఆర్ఎస్ ఎంపీలను అడిగానని... కేసీఆర్ నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని, అందుకే మద్దతు పలుకుతున్నామని తనతో వారు చెప్పారని రాహుల్ అన్నారు. మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేయడమే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాబోతోందని... మీ ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చబోతోందని రాహుల్ చెప్పారు.  మీరు కలలుగన్న నీళ్లు, నిధులు, నియామకాలను కాంగ్రెస్ పార్టీ నిజం చేస్తుందన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top