
న్యూఢిల్లీ : ‘మిషన్ శక్తి’ పేరిట దేశ భద్రత కోసం అభివృద్ధి చేసిన యాంటీ శాంటిలైట్ క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఫలితంగా భారత్ స్పేస్ సూపర్ పవర్‌గా మారిందంటూ మోదీ తెలిపారు. అయితే దీనిపై విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఓట్ల కోసం మోదీ చేస్తున్న ఎన్నికల జిమ్మిక్కుల్లో ఇది కూడా ఒకటని ఆరోపిస్తున్నాయి. ‘మిషన్ శక్తి’ విజయవంతమైన సందర్భంగా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు అభినందనలతో పాటు మోదీకి చురకలంటిచారు.
ఈ సందర్భంగా రాహుల్ ‘డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు సాధించిన విజయానికి గాను వారికి అభినందనలు తెల్పుతున్నాను. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. అలానే మోదీకి ‘ప్రపంచ నాటకరంగ దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. కేవలం రాహుల్ మాత్రమే కాక సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ‘ఈ ఘనత సాధించిన ఇస్రో, డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలతో పాటు ఈ విజయయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు. దేశాన్ని భద్రంగా మార్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలం’టూ ట్వీట్ చేశారు.
Well done DRDO, extremely proud of your work.
— Rahul Gandhi (@RahulGandhi) March 27, 2019
I would also like to wish the PM a very happy World Theatre Day.
అంతేకాక ‘డీఆర్‌డీవో సాధించిన విజయంతో ఈ రోజు మోదీ ఓ గంట పాటు టీవీని ఉచితంగా ఆక్రమించి.. దేశాన్ని పక్కతోవ పట్టించేందుకు తీవ్రంగా కృషి చేశారు. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, గ్రామీణ పేదరికం, మహిళలకు రక్షణ కరువు వంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటి నుంచి జనాల దృష్టిని మరల్చడానికి మోదీ ‘మిషన్ శక్తి’ని వాడుకున్నాడు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కే’ అంటూ అఖిలేష్ ట్వీట్ చేశారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మోదీ ఎన్నికల నియామవళిని ఉల్లంఘించాడని.. ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.