లాక్‌డౌన్‌ విఫలం: ప్లాన్‌ బి ఏంటి..!

Rahul Gandhi: India Lockdown Has Failed Ask Centre Whats Plan B - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్‌లో వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ విఫలమైందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో విజృంభిస్తున్న కరోనాను అరికట్టేందుకు ప్లాన్‌ బి ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించారు. గత రెండు నెలలుగా లాక్‌డౌన్‌ అమలవుతున్నప్పటికీ దేశంలో కరోనా కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ట్విటర్‌ ద్వారా ఏర్పాటు చేసిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో రాహుల్‌ లైవ్‌లో మాట్లాడారు. నాలుగు విడతలుగా విధించిన లాక్‌డౌన్‌ ప్రధాని మోదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని మండిపడ్డారు. (రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: వైఎస్‌ జగన్‌)

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని మోదీ, అతని సలహా సిబ్బంది అబద్దపు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి అలా జరగడం లేదని రాహుల్‌ గాంధీ   దుయ్యబట్టారు. ఒక్క సోమవారం రోజున దాదాపు 7000 కొత్త కేసులు నమోదయ్యాయని, ఒక్క రోజులో  అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని అన్నారు. మంగళవారం నాటికి దేశంలో 1.45 లక్షల కేసులు దాటాయని, వైరస్‌ బారిన పడి 4167 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. (25 ఏళ్లుగా సాధ్యం కానిది.. కరోనాతో)

‘ఇప్పుడు లాక్‌డౌన్‌ విఫలమవ్వడంతో ప్రభుత్వ వ్యూహం ఏంటో తెలుసుకోవాలి. కేంద్రం తన ‘ప్లాన్‌ బి’ ని తెలియజేయాలి. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కరోనా సంక్షోభంలో పేద ప్రజలను ఆదుకునేందుకు నేరుగా వారికి నగదు అందిస్తున్నాము. ఆ రాష్ట్రంలో మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందించడం లేదు. ఇప్పుడు కేంద్ర సహాయం లేకుండా ప్రభుత్వాన్ని నడపడం కష్టమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు, వలసదారులకు మద్దతు ఇస్తునప్పటికీ, మన రాష్ట్రాలకు కేంద్రం నుంచి మాత్రం మద్దతు లభించడం లేదు' అని రాహుల్‌ గాంధీ మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. (ఇదీ ముంబై కేఈఎం హాస్పిటల్ : షాకింగ్ ట్వీట్ )

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top