రైతు ఆత్మహత్యలకు కారణం ఆయనే..  | Puducherry CM Narayanasamy Fires on KCR | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలకు కారణం ఆయనే.. 

Nov 13 2018 2:49 AM | Updated on Mar 18 2019 9:02 PM

Puducherry CM Narayanasamy Fires on KCR - Sakshi

కేసీఆర్‌ కుటుంబంపై రూపొందించిన పోస్టర్‌ను చూపిస్తున్న పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 4,500 మంది రైతుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆరే కారణమని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఆరోపించారు. తమది చిన్న రాష్ట్రమే అయినా సొంత వనరులతో రైతులకు రుణమాఫీ చేశామని, తమ రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని చెప్పారు. కేసీఆర్‌కు రాష్ట్ర రైతాంగంపై ఎలాంటి శ్రద్ధ లేదని, అందుకే ఇంతమంది రైతులు చనిపోయారన్నారు. సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన రాజ్యసభ సభ్యుడు నాసిర్‌ హుస్సేన్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, అధికార ప్రతినిధి ఇందిరాశోభన్‌ తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్‌ ఏం చేశారో తనకన్నా ఇక్కడి ప్రజలకే బాగా తెలుసునని నారాయణస్వామి అన్నారు. కేవలం కేసీఆర్‌ కుటుంబం మాత్రమే రాష్ట్రాన్ని నడిపిస్తోందని ఆరోపించారు. అసలు ప్రజల సమస్యలు తెలుసుకోకుండా ఏ సీఎం అయినా వారి సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.  

మహారాజునని అనుకుంటున్నారు.. 
కేసీఆర్‌ సీఎం అయ్యాక ఆయన మనస్తత్వంలో మార్పు వచ్చిందని నారాయణస్వామి ఆరోపించారు. తనకు తాను మహారాజులా ఆయన భావిస్తున్నారని విమర్శించారు. అన్నీ కాంగ్రెస్‌ చేపట్టిన ప్రాజెక్టులనే కేసీఆర్‌ తనవిగా చెప్పుకుంటున్నారని, కేసీఆర్‌ తన పాలనలో గుర్తింపు పొందే పని ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీకి ‘బీ’టీంగా టీఆర్‌ఎస్‌ పనిచేస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ చేయమంటేనే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో జాతీయ నేతలను కలిసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ, కేసీఆర్‌లిద్దరూ ఒకటేనని చెప్పారు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ ఇచ్చిన సోనియాకు, కాంగ్రెస్‌కు ఇక్కడి ప్రజలు రుణపడి ఉంటారని, ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనను పేకాటలోని నాలుగు ‘కే’(రాజు)లతో పోలుస్తూ టీపీసీసీ రూపొందించిన ఓ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కుటుంబం, కేసీఆర్, కేటీఆర్, కవితలు నాలుగు ‘కే’లుగా పోస్టర్‌లో అభివర్ణించారు. 

హవ్వా... 300 కోట్లతో ఇల్లా! 
కేసీఆర్‌ రూ.300 కోట్లతో తన అధికారిక నివాసాన్ని కట్టుకున్నారన్న వార్తలు విని షాక్‌ అయ్యామని పుదుచ్చేరి సీఎం వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వ నివాసంలో కూడా ఉండటం లేదని, తన సొంత ఇంటిలోనే ఉంటున్నానని, కనీసం ప్రభుత్వ కారు వాడటం లేదన్నారు. సొంత ఫార్చ్యూనర్‌ కారులోనే తిరుగుతున్నానని, ల్యాండ్‌ క్రూయిజర్‌లో కాదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సింపుల్‌గా ఉంటేనే ప్రజలు ఇష్టపడతారని, తమ సమస్యలు చెప్పుకునేందుకు ముందుకొస్తారని అభిప్రాయపడ్డారు.  

ఇదేనా అభివృద్ధి నమూనా 
దేశంలోనే రైతులు ఎక్కువగా ఉన్న రెండో రాష్ట్రం తెలంగాణే అని.. అలాగే అవినీతిలో కూడా దేశంలో రెండోస్థానంలో ఉందని గణాంకాలు చెబుతున్నాయని నారాయణస్వామి అన్నారు. ఇదేనా అభివృద్ధి నమూనా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలనపై కాకుండా కేవలం కుటుంబంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. 9 నెలల ముందు ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేకపోవడం, కనీసం మహిళా కమిషన్‌ కూడా ఏర్పాటు చేయకపోవడం కేసీఆర్‌ పాలనలోని లింగ వివక్షకు నిదర్శనమని విమర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement