నివేదన స్థలిలోనే ‘ప్రజాగ్రహం’

A public meeting on November 11 - Sakshi

నవంబర్‌ 11న బహిరంగసభ నిర్వహిస్తామన్న మంద కృష్ణ మాదిగ

సోనియా, మీరాకుమార్, ఇతర పార్టీల నేతలను రప్పిస్తాం  

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ చేసిన మోసాలు, వైఫల్యాలను ప్రజాగ్రహసభలో జనాలకు తెలియజేస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. కొంగర కలాన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన ప్రగతినివేదన స్థలంలోనే నవంబర్‌ 11న ప్రజాగ్రహ సభ నిర్వహిస్తామని తెలిపారు. సభాస్థలాన్ని నాయకులతో కలసి ఆయన ఆదివారం పరిశీలించారు. టీఆర్‌ఎస్‌ సభకు వచ్చిన జనం కంటే రెట్టింపుస్థాయిలో తరలిస్తామన్నారు. కేసీఆర్‌ తప్పుల చిట్టాకు ప్రజాకోర్టులో చార్జిషీటు వేస్తామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, బిల్లు పాస్‌ చేసిన అప్పటి లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్, అప్పటి హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, బిల్లుకు మద్దతు ఇచ్చిన వివిధ రాజకీయ పార్టీల నేతలను సభకు ఆహ్వానిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలతో కలసి పనిచేస్తామన్నారు. 

ఎస్సీ వర్గీకణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పి దళితులను మోసం చేశారన్నారు. దళిత, గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి పంపిణీ ఏమైందని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్,   బ్రహ్మయ్య మాదిగ, రాగటి సత్యం మాదిగ, బీఎన్‌ రమేశ్‌ మాదిగ, లతా మాదిగ,  కొండ్రు ప్రవీణ్, ప్రశాంత్‌ మాదిగ ఉన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top