కేంద్రంపై తమిళనాడు కన్నెర్ర

Protests rage in Tamil Nadu for Cauvery Management Board, activists - Sakshi

కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు కోరుతూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

9న ధిక్కార కేసు విచారణ

సాక్షి ప్రతినిధి, చెన్నై: సుప్రీంకోర్టు తీర్పుననుసరించి కావేరీ నదీజలాల మేనేజ్‌మెంట్‌ బోర్డును వెంటనే ఏర్పాటుచేయాలన్న డిమాండ్లు తమిళనాడులో వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, ప్రధాని దిష్టిబొమ్మల దహనంతో తమిళనాడు ప్రజలు కేంద్రంపై తమ ఆగ్రహాన్ని చూపించారు. అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మార్చి 30న ముగిసినా కేంద్రం స్పందించకపోవడంతో అన్నాడీఎంకే, ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టాయి. చెన్నై, తిరువయ్యూరు, మదురై సహా తమిళనాడువ్యాప్తంగా 600 చోట్ల రాస్తారోకోలు నిర్వహించారు.

కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, పడుకొట్టాయ్‌సహా చాలాచోట్ల రైల్‌రోకో చేపట్టారు. కోయంబత్తూరులో ఇద్దరు డీఎంకే కార్యకర్తలు కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించారు. తమిళనాడు విరుదునగర్‌ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు కోర్టు ప్రాంగణంలో లాయర్లు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పోలీసులు దాదాపు 1,000 మందిని అదుపులోకి తీసుకుని గొడవలు సద్దుమణిగాక వదిలేశారు.  మంగళవారం రాష్ట్రబంద్‌కు రైతు సంఘాలు, వాణిజ్య సంఘాలు పిలుపునిచ్చాయి. కాగా, డీఎంకే నేతృత్వంలోని విపక్షపార్టీలు ఏప్రిల్‌ 5న బంద్‌ నిర్వహించనున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి తేకుండా అన్నాడీఎంకే ప్రభుత్వం తమిళుల హక్కులను కాలరాస్తోందని డీఎంకే ఆరోపించింది.  

అన్నాడీఎంకే ఎంపీ రాజీనామా, ఉససంహరణ
కావేరీ అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటులో కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులు ముత్తుకరుప్పన్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. అయితే, సీఎం పళనిస్వామి ఆదేశాలతో తన రాజీనామాను ముత్తుకరుప్పన్‌ ఉపసంహరించుకున్నారు. మరోవైపు, కావేరీ వాటర్‌ బోర్డు త్వరగా ఏర్పాటుచేయాలని కోరుతూ పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కావేరి అంశంపై మంగళవారం అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్త నిరాహారదీక్షలు చేపట్టనుంది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, మంత్రులు ఈ దీక్షల్లో పాల్గొననున్నారు.

కోర్టు ధిక్కార కేసు వింటాం: సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించని కేంద్రంపై తమిళనాడు దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏప్రిల్‌ 9న ఈ కేసు విచారణకు రానుంది. నిరసనల నేపథ్యంలో తమిళనాడు గవర్నర్‌ పురోహిత్‌ ఢిల్లీకి వెళ్లారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top