చింతమనేని దాడికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన

A Protest Against Chinthamaneni Attack - Sakshi

సాక్షి, ఏలూరు : దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ దాడికి వ్యతిరేకంగా దెందులూరు హనుమాన్ జంక్షన్‌ లో ప్రజలు బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజల నిరసనకు వైఎస్సార్సీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, కటారి రామచంద్రరావు మద్ధతు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..గరికపాటి నాగేశ్వరరావు పై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.

రోజు రోజుకూ చింతమనేని అరాచకాలు పెరిగిపోతున్నాయని, చంద్రబాబు, లోకేష్ అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నారని విమర్శించారు. దాడులు చేయడం చింతమనేనికి అలవాటుగా మారిందని, కోర్టులు చింతమనేనికి శిక్షలు వేసినా బుద్ది రాలేదని మండిపడ్డారు. గతంలో చింతమనేని, తహశీల్దార్‌ వనజాక్షిపై దాడి చేశారని చెప్పారు. చింతమనేని దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని, దాడికి పాల్పడ్డ చింతమనేనిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు.

కాగా వివాదాస్పద ప్రవర్తనతో తరుచూ వార్తల్లో నిలిచే ఎమ్మెల్యే చింతమనేని ఆర్టీసీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. బస్సుపై ఉన్న చంద్రబాబు ఫొటో ఎందుకు చిరిగిందంటూ డ్రైవర్, కండక్టర్‌లను నడిరోడ్డుపైనే దుర్భాషలాడుతూ చిందులు వేశారు. ఇదేమిటని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై దాడి చేశారు. దీంతో కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో నిన్న తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వివరాల్లోకి వెళఙతే.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని మంగళవారం స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చారు. అదే సమయంలో నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్‌ సెంటర్‌ నుంచి గుడివాడ వైపు వెళుతోంది.

అయితే ఆ బస్సుపై అతికించిన ప్రభుత్వ ప్రచార పోస్టర్‌లోని సీఎం ఫొటో కాస్త చిరిగి ఉండటంతో చింతమనేని వెంటనే తన మనుషులను పంపించి బస్సును అడ్డగించారు. డ్రైవర్‌ వడ్డి శేఖర్, కండక్టర్‌ తోట వాసుబాబును కిందకు దించి.. వారిపై చింతమనేని పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ సొమ్ము తింటూ సీఎం ఫొటో చిరిగినా పట్టించుకోరా.. అంటూ తిట్లపురాణం అందుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికుడు గరికపాటి నాగేశ్వరరావు(చంటి) ప్రభుత్వ ఉద్యోగులతో ఇదేం వైఖరి అంటూ చింతమనేనిని ప్రశ్నించాడు. దీంతో ఆయన మరింత రెచ్చిపోయి.. నాగేశ్వరరావుపై ఏడాపెడా చేయి చేసుకోవడంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు.

విచిత్రమేమిటంటే ప్రభుత్వ విప్ చింతమనేని దాడి చేశారని  ఫిర్యాదు చేసిన నాగేశ్వరరావు మీద హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేని దాడికి నిరసనగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేసినందుకు బాధితుడు నాగేశ్వర రావు సహా వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ నేతలు 30 మందిపై కేసు నమోదు చేయడంతో ఆశ్చర్య పోవడం ప్రజల వంతైంది. పోలీసుల తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top