మోదీపై మండిపడ్డ ప్రియాంక

Priyanka Gandhi Exclusively to India Today And Slams Modi - Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. ప్రధాని నరేం‍ద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. భారతదేశ ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి ఆయనకు ఎటువంటి అవగాహన లేదని ఆరోపించారు. ఇండియా టుడేకిచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక గాంధీ పలు అంశాల గురించి ముచ్చటించారు. మోదీ జపాన్‌, పాక్‌ పర్యటనలను ఉద్దేశిస్తూ.. ఈ ప్రధానికి విదేశాలకు వెళ్లి డోలు వాయించడానికి.. బిర్యానీ తినడానికి సమయం ఉంటుంది కానీ దేశ ప్రజల సమస్యల గురించి వినడానికి మాత్రం తీరిక లేదని మండిపడ్డారు. అంతేకాక ఈ ప్రభుత్వం సమస్యల గురించి ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తుందని ఆరోపించారు. 

వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగమే ప్రస్తుతం ఎన్నికల్లో అసలైన సమస్యలని తెలిపారు ప్రియాంక. కాంగ్రెస్‌ ప్రకటించిన ‘న్యాయ్‌’ పథకం ప్రజలను చేరదంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అవును ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరగడం లేదన్నారు.  మోదీ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని జనాలు నమ్మారన్నారు. కానీ ఈ ప్రభుత్వం వారి నమ్మకాన్ని వమ్ము చేసిందని ప్రియాంక మండిపడ్డారు. ఐదేళ్ల పాటు రైతులను సంక్షోభంలో పడేసిన ప్రభుత్వం.. ఎన్నికలకు రెండు నెలల ముందు ఓ పథకాన్ని ప్రవేశపెట్టి.. ఓ రెండు వేల రూపాయలు ఇవ్వడం దారుణమన్నారు. కనీసం 2 శాతం జనాలకు కూడా ఆ సొమ్ము అందలేదన్నారు. మోదీ ప్రభుత్వం ప్రకటించే పథకాలు జనాల సమస్యలకు పరిష్కారం చూపడం లేదన్నారు  ప్రియాంక.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top