ప్రియాంక గాంధీ అరెస్ట్‌!

Priyanka Gandhi continues dharna against UP authorities - Sakshi

ఘోరావల్‌కు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

విడుదల చేయాలి: వాద్రా

లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌(యూపీ)లోని సోన్‌భద్ర జిల్లాలో జరిగిన కాల్పుల ఘటన బాధితులను పరామర్శించేందుకు శుక్రవారం ఘోరావల్‌ వెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. తనను ముందుకు వెళ్లనివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆమె రోడ్డుపైనే కూర్చోవడంతో పోలీసులు ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక తొలుత వారణాసిలోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆమె ఘోరావల్‌కు వెళ్తుండగా, వారణాసి–మీర్జాపూర్‌ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో ఆమె రోడ్డుపై కూర్చుని నిరసన తెలపడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని దగ్గర్లోని ప్రభుత్వ అతిథి గృహానికి తరలించారు. శుక్రవారం సాయంత్రానికి ఆమె ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు.   బాధితులను కలవకుండా వెనక్కు వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్న ప్రియాంక, అతిథి గృహం నుంచి తాను తిరిగి వెళ్లేందుకు సమర్పించాల్సిన వ్యక్తిగత బాండును ఇచ్చేందుకు నిరాకరించారు. శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయాకా ఆమె అక్కడే ఉన్నారు.

ప్రియాంక వద్దే ఉన్న యూపీ కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత అజయ్‌ మాట్లాడుతూ ఘోరావల్‌కు వెళ్లేందుకే ప్రియాంక నిశ్చయించుకున్నారనీ, అలా కుదరని పక్షంలో జైలుకు వెళ్లేందుకు సిద్ధమని అన్నారు. ఉభా గ్రామంలో గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న 36 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోడానికి ఆ గ్రామ పెద్ద యజ్ఞాదత్‌ బుధవారం ప్రయత్నించగా, గిరిజనులకు, యజ్ఞాదత్‌ మనుషులకు మధ్య ఘర్షణ జరగడం తెలిసిందే. ఈ ఘర్షణలో యజ్ఞా దత్‌ మనుషులు కాల్పులు జరపగా 10 మంది గిరిజనులు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఒక సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్, నలుగురు పోలీసు సిబ్బంది సహా మొత్తం ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేశామనీ, ప్రధాన నిందితుడు యజ్ఞా దత్‌సహా 29 మందిని అరెస్టు చేశామని సీఎం చెప్పారు.

అరెస్ట్‌ అక్రమం: రాహుల్‌
రాహుల్‌ ఓ ట్వీట్‌ చేస్తూ ‘ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంకను అక్రమంగా అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అధికారాన్ని బీజేపీ నిరంకుశ ధోరణిలో ఉపయోగిస్తోంది. ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న అభద్రతా భావానికి ఇదే నిదర్శనం’ అని అన్నారు. ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా ఈ అంశంపై స్పదిస్తూ, ప్రజాస్వామ్యాన్ని యూపీ ప్రభుత్వం నియంతృత్వంగా మార్చకూడదనీ, ప్రియాంకను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top