ఎంపీగా గెలిచిన వెంటనే రాజీనామా!?

Prajwal Revanna Gets Emotional Over Deve Gowda Defeat - Sakshi

బెంగళూరు : తన కోసం సీటు త్యాగం చేసిన కారణంగా తాతయ్య ఓడిపోయారంటూ మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనను గెలిపించినందుకు పార్టీ శ్రేణులకు కృతఙ్ఞతలు చెప్పిన ఆయన.. దేవెగౌడ కోసం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. దేవెగౌడ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హసన్‌ నియోజకవర్గం నుంచి ప్రజ్వల్‌ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కమలం హవాను తట్టుకుని.. దాదాపు లక్షన్నర ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. అయితే హసన్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న దేవెగౌడ ఈ స్థానాన్ని మనవడి కోసం త్యాగం చేసి.. తుముకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి జీఎస్‌ బసవరాజ్‌ చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఆయన పరాజయం పాలయ్యారు.

ఈ నేపథ్యంలో తన తాతయ్య ఓటమిపై కలత చెందిన ప్రజ్వల్‌ రేవణ్ణ మీడియాతో మాట్లాడుతూ..‘ పార్టీ శ్రేణులు, సీనియర్‌ నాయకుల ఆశీస్సులతో గెలిచిన నేను.. రాజీనామా చేయాలని భావిస్తున్నాను. ఈ విషయంలో నాపై ఎవరి ఒత్తిడి లేదు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఈరోజు తాతయ్యతో మాట్లాడి ఎలాగైనా ఒప్పిస్తా. నా స్థానంలో ఆయన హసన్‌ నుంచి పోటీ చేస్తారు. నన్ను గెలిపించిన ప్రజలను అగౌరవ పరచాలని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. వారి తీర్పును నేను శిరసా వహిస్తున్నా. హసన్‌ ప్రజలకు రుణపడి ఉన్నాను. అయితే అందరూ ఒక విషయం గమనించాలి. నాది చిన్న వయస్సు(28). ఇప్పుడు కాకపోతే మరోసారైనా గెలిచి తీరతాను. కాని గౌడ గారు(87) నా కోసం సీటు త్యాగం చేశారు. అందుకు బదులుగా ప్రజలు నన్ను గెలిపించారు. సంతోషమే.. కానీ నా వల్లే తాతయ్య ఓడిపోయారన్న బాధ నన్ను వెంటాడుతోంది. అందుకే ఆయనను గెలిపించాలని హసన్‌ ప్రజలను కోరుతున్నా’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు.

కాగా జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ హసన్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ఆ పార్టీకి మంచి పట్టు ఉంది. గత ఆరు పర్యాయాలుగా(ఉప ఎన్నికలు సహా) హసన్‌లో జేడీఎస్‌ గెలుపు జెండా ఎగురవేస్తూనే ఉంది. ఇక్కడి నుంచే దేవెగౌడ ఎంపీగా హ్యాట్రిక్‌ కూడా కొట్టారు. ఈ నేపథ్యంలో ఆయన పెద్ద కొడుకు రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌.. తాతయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచే బరిలో నిలవాలని భావించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రజ్వల్‌ పార్టీ టికెట్‌ ఆశించగా.. అప్పుడు కుదరకపోవడంతో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడ అవకాశం కల్పించారు. ఈ క్రమంలో హసన్‌లో జేడీఎస్‌ మరోసారి విజయం సాధించింది. ఇక కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలకు గానూ 25 సీట్లు గెలుచుకున్న బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. దీంతో సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి షాక్‌ తగిలింది. ముఖ్యంగా సీఎం కుమారస్వామికి ఈ ఎన్నికలు చేదు ఫలితాన్ని మిగిల్చాయి. ఆయన కుమారుడు నిఖిల్‌ కుమారస్వామి... బీజేపీ మద్దతుతో పోటీ చేసిన స్వతం‍త్ర అభ్యర్థి సుమలత చేతిలో ఘోర పరాభవం పాలయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top