సినిమానా? రాజకీయమా?

Politics or films? Rajini, Kamal may have to make a choice - Sakshi

కమల్, రజనీలు తేల్చుకోవాల్సిన తరుణమిదే!

రెండు పడవలపై ప్రయాణంతో ఇబ్బందికర పరిస్థితి  

వెండితెరపై అద్భుతమైన ఇమేజ్‌ సొంతం చేసుకున్నందుకే సినీనటులు రాజకీయాల్లోకి వచ్చినా కాస్తో, కూస్తో మద్దతు దక్కుతుంది. భారత రాజకీయ చరిత్రలో సినీ యాక్టర్లకు అవకాశం రావడం వెనక స్టార్‌ ఇమేజ్‌ ప్రధాన కారణం. కానీ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాల్లోనూ నటిస్తామంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు. ఇటీవలే తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కమల్‌ హాసన్‌ (మక్కల్‌ నీది మయ్యమ్‌ అధ్యక్షుడు), రజనీకాంత్‌లకూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది.

ఈ ఇద్దరూ తమిళ్‌ బేస్‌ నటులే అయినా దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అయితే.. తమిళనాడు, కర్ణాటక మధ్య తరతరాలుగా అడ్డుగోడగా మారిన కావేరీ జల వివాదం మాత్రం సినిమా అభిమానాన్ని మించి ఇరురాష్ట్రాల్లో ప్రజాఉద్యమంగా మారింది. ఇన్నాళ్లూ ఇది కమల్, రజనీకాంత్‌లను పెద్దగా ఇబ్బందిపెట్టలేదు. కానీ వీరిద్దరూ రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటించడం.. తమిళనాడుకు కావేరీ జలాల విషయంలో న్యాయం జరగాలని నినదించడంతో అభిమానుల్లోనూ (తమిళ, కన్నడ) చీలిక వచ్చింది. రజనీ నటించిన కాలా చిత్రాన్ని కన్నడలో అడ్డుకునేందుకు కొన్ని స్థానిక సంఘాలు ఆందోళన చేపట్టడం, కన్నడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోమని చెప్పడమే దీనికి నిదర్శనం. 2004లో విరూమంది, 2013లో విశ్వరూపం చిత్రాల విడుదల సందర్భంగా కమల్‌ ఈ సమస్యను రుచిచూశారు.  

అలా కుదరదు!
రాజకీయాల్లో ఉండాలంటే స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించాలి. సినిమాలు రెండుచోట్లా ఆడాలంటే రాజకీయ ప్రకటనలు చేయడం కుదరదు. కానీ.. ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చాక రెండు పడవలపై కాలుపెట్టి ముందుకెళ్తామంటే ఇలా ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. 1970ల్లో డీఎంకేను వదిలిపెట్టాక ఎంజీఆర్‌ సొంతపార్టీ (నడిగర్‌ కచ్చి)ని ప్రారంభించారు. ఆయనకున్న సినీ అభిమానం దృష్ట్యా 1977లో సీఎం (ఏడీఎంకే) అయ్యేంతవరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు. రజనీకాంత్‌ రోబో 2.0 చిత్రం తర్వాత రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలిచ్చినా.. ఇంతవరకు తన పార్టీ పేరును ప్రకటించలేదు.

‘డీఎంకే నుంచి ఎంజీఆర్‌ బయటకు రావడం.. ఆ తర్వాత ఆయన సినిమాల విడుదలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవడం జరిగింది. ఎంజీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కానీ రజనీ, కమల్‌కు తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేదు’ అని తమిళ చిత్ర ప్రముఖ విమర్శకుడు సుధాంగన్‌ తెలిపారు. ‘రజనీ, కమల్‌లు ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్లు కాద’ని సహ నటుడు శరత్‌ కుమార్‌ పేర్కొన్నారు. జయలలితపై రజనీకాంత్‌ 1996లో వ్యతిరేక గళం విప్పినప్పటికీ.. జయ భారీ విజయాన్ని అడ్డుకోలేకపోయారని గుర్తుచేశారు.

నటనను వదులుకోలేరు!
సినీరంగంలోకి ఒకసారి ప్రవేశించాక తమ జీవితం నుంచి సినిమాలను వేరుగా చూడలేరని సినీనటి, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఖుష్బూ పేర్కొన్నారు. రెండు రంగాల్లో కొనసాగటం అంత సులువేం కాదని.. అందుకోసం చాలా నష్టపోతున్నామని ఆమె పేర్కొన్నారు. దేశంలో రాజకీయాల్లోకి వచ్చిన నటుల పరిస్థితి ఇంత తీవ్రంగా లేకపోయినా.. తమిళనాడు, కర్ణాటకల్లో మాత్రం కావేరీ వివాదంతో రజనీ, కమల్‌లకు ఇబ్బందికర పరిస్థితులు తప్పేట్లు లేవు. ఒక్కసారి రాజకీయ రంగప్రవేశం చేశాక.. తెరప్రవేశాన్ని పక్కన పెట్టడమే మంచిదని.. సినిమా విమర్శకులు సూచిస్తున్నారు.

– సాక్షి నేషనల్‌ డెస్క్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top