కాలుష్యానికి ఓట్లకు లింకేమిటీ?

Politicians Unlikely Much Tackle Air Pollution In Election Year - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటన్న విషయం తెల్సిందే. శీతాకాలంలో వచ్చే దీపావళి సందర్భంగా కాల్చే టపాసుల వల్ల నగర కాలుష్యం మరింత పెరుగుతుందన్న విషయమూ తెల్సిందే. అందుకనే తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే ‘గ్రీన్‌’గా పేర్కొన్న టపాసులే కాల్చాలని, అది ఆరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య కాల్చాలని సుప్రీం కోర్టు సూచించడం, ఆ సూచనలను నగర వాసులు పాటించకపోవడం, వారిపై నగర పోలీసులు చర్యలు తీసుకోకపోవడమూ తెల్సిందే. ఫలితంగా ఏం జరిగిందీ? దీపావళికి ముందు రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో నమోదైన కాలుష్యం 400, 500 మార్కు నుంచి దీపావళి మరుసటి రోజుకు 999 మార్కుకు చేరుకుంది.

కాలుష్యం కొలమానం సూచికలో కాలుష్యం 400 దాటితే ప్రమాదకరంగాను, 500 దాటితే అత్యంత ప్రమాదరకంగాను పేర్కొంటారు. అలాంటి దీపావళి మరుసటి రోజు నగరంలో పలు ప్రాంతాల్లో 999 మార్కును చేరుకుందంటే ఎంత ప్రమాదరకమో! ఊహించవచ్చు. అయినా ఈ విషయం పాలకులకుగానీ, ప్రజలకుగానీ అంతగా ఎందుకు పట్టడం లేదు? 2016లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం భారత్‌లో ప్రతి ఏటా ఇంటి లోపల, ఇంటి వెలుపల ఉండే వాయు కాలుష్యం వల్ల లక్ష మందికిపైగా ఐదేళ్ల పిల్లలు మరణిస్తున్నారు. ఏటా లక్ష మందిలో 66.6 శాతం పిల్లలు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. బాలికల విషయంలో ఇది మరింత ప్రమాదరకరంగా మారింది. ప్రతి లక్ష మంది బాలికల్లో 74. 3 శాతం మంది మృత్యువాత పడుతున్నారు.

పామాయిల్‌ ఫ్లాంటేషన్‌ కోసం అడవులను అడ్డంగా నరికి తగులబెడుతున్న ఇండోనేషియాలో కూడా కాలుష్యానికి ఇంత మంది బలవడం లేదు. ఆ దేశంలో ప్రతి ఏటా లక్ష మందిలో 35.6 శాతం ఐదేళ్లలోపు బాలికలు మరణిస్తుంటే ఐదేళ్లలోపు బాలలు 35.2 శాతం మంది మరణిస్తున్నారు. చైనాలో ప్రతి లక్ష మంది ఐదేళ్లలోపు బాలికల్లో 12.5 శాతం మరణిస్తుంటే 13.8 శాతం బాలలు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. ఇక ఐదేళ్ల నుంచి 14 ఏళ్ల బాలికల్లో భారత్‌లో ప్రతి లక్ష మందికి 3.4 శాతం మంది బాలకులు, 2.3 శాతం బాలలు మరణిస్తున్నారు. కాలుష్యం అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల జెనీవాలో నిర్వహించిన సదస్సులో భారత్‌కున్న ముప్పుపై తీవ్రంగా హెచ్చరించింది. పిల్లల్లో నిమోనియా, అస్తమా, క్యాన్సర్‌కు కూడా కాలుష్యమే కారణమవుతోందని చెప్పింది. రోగాల తర్వాత ఎక్కువ మంది కాలుష్యం కారణంగానే మరణిస్తున్నారని పేర్కొంది. గర్బిణీ స్త్రీలపై కూడా కాలుష్యం ఎంతో ప్రభావాన్ని చూపిస్తోంది.

కాలుష్యం రాజకీయ అంశం కాకపోవడం వల్ల దేశంలో ఏ ప్రభుత్వం కూడా కాలుష్యం నియంత్రణకు సరైన చర్యలు తీసుకోలేక పోతోంది. మరో విధంగా ఇది రాజకీయ అంశమేనని చెప్పవచ్చు. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు, ప్యాక్టరీ చిమ్నీల నుంచి వెలువడే పొగ, నిర్మాణా నుంచి వెలువడే దుమ్ము, వరి దుబ్బులను తగులబెట్టడంతో వెలువడే పొగ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి వాడుతున్న వంట చెరకు కాలుష్యానికి ప్రధాన కారకాలు. వీటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటే కాలుష్యానికి కారణమవుతున్న ఇన్ని వర్గాల ప్రజల ఓట్లు దూరం అవుతాయన్నది రాజకీయ పార్టీల బెంగ. అది ఒక విధంగా ఓట్ల రాజకీయమే గదా! 2019లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున అప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కాలుష్యం గురించి పెద్దగా మాట్లాడదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top