సీఎం దీక్షలో మహిళ గెంటివేత

Police Harsh Behavior With Woman At CM Chandrababu Meeting - Sakshi

ఇల్లు కోల్పోయిన మహిళ తన కష్టం చెప్పుకోవాలని వస్తే దారుణం

మెడపట్టుకుని బయటకు లాక్కెళ్లిన ట్రైనీ ఎస్సై

శ్రీకాకుళం రూరల్‌: శ్రీకాకుళంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో కష్టం చెప్పుకోవాలని వచ్చిన ఓ మహిళను పోలీసులు మెడపట్టుకుని బయటకు గెంటేశారు. రెండున్నరేళ్ల కిందట ఇల్లు కాలిపోయిన తనకు ఇంతవరకు న్యాయం జరగలేదని సీఎంకి విన్నవించుకోవాలని వచ్చిన పోలమ్మ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. సీఎం గారూ.. నా  ఇల్లు కాలిపోయింది.. నాకు న్యాయం చేయండి.. అంటూ గట్టిగా కేకలు వేసిన ఆమెను అక్కడే ఉన్న మహిళా ట్రైనీ ఎస్సై డి.శ్యామల (సీతంపేట పీఎస్‌) మెడపట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చారు. అమ్మా నేను తీవ్రవాదిను కాదు.. నేనో సాధారణ మహిళను.. నన్ను సీఎం వద్దకు తీసుకెళ్లాలంటూ బతిమిలాడినా జుట్టుపట్టుకుని లాక్కొచ్చేశారు. ఆమె చేతుల్లోని కాగితాలను లాక్కున్నారు. ఇంతలో ఓ వ్యక్తి అడ్డుపడి సీఎం డౌన్‌డౌన్‌.. అంటూ నినాదాలు చేశాడు. అతడిపై టీడీపీ కార్యకర్తలు దాడిచేసి పిడుగుద్దులు గుద్దారు.

దీన్ని ఫొటోలు తీసిన విలేకరులను కూడా హెచ్చరించేలా ట్రైనీ ఎస్సై మాట్లాడారు. పోలమ్మ విలేకరుల వద్ద తన కష్టాన్ని వివరించింది. పొందూరు మండలం బొడ్డేపల్లిలో ఆమె ఇల్లు 2016 ఏప్రిల్‌లో విద్యుత్‌ షార్ట్‌షర్క్యూట్‌తో కాలిపోయింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు, ఎంపీకి, మంత్రికి పలుమార్లు వినతిపత్రాలు అందించినా న్యాయం జరగలేదు. గతంలో జరిగిన గ్రామదర్శినిలో ఆమె ఇంటికి రూ.2.7 లక్షలు ఇస్తామని ఎమ్మెల్యే రవికుమార్‌ చెప్పారు. తరువాత ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు. కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఇచ్చిన అర్జీని కూడా ఎవరూ పట్టించుకోలేదు. కుమార్తె పెళ్లికోసం చేసిన అప్పులు తీర్చేమార్గం కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జిల్లాకు రావడంతో తన కష్టాన్ని చెప్పుకోవాలని వచ్చింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top