
సాక్షి. న్యూఢిల్లీ : ఐదేళ్ల పాలనలో నూటికి నూరు శాతం దేశ ప్రజల కోసం పనిచేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చివరి లోక్‌సభ సమావేశాల ముగింపు సందర్భంగా బుధవారం మోదీ ప్రసంగించారు. స్పీకర్ సమిత్రా మహాజన్ నిర్వహంచిన తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
‘మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మా ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు కీలక మంత్రి పదవులు ఇచ్చాం. నేడు మన దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. ఈ ఐదేళ్లలో ప్రపంచంలో భారత్ గొప్పదనం పెరిగింది. మా పాలనలో బంగ్లాదేశ్‌తో భూసరిహద్దు వివాదం పరిష్కారమైంది. ప్రకృతి విపత్తులతో కష్టాలు ఎదుర్కొన్న దేశాలకు ఎంతో సాయం చేశాం. మానవతా దృక్పథంతో పలు దేశాలకు సాయం అందించాం. అవినీతి నిరోధానికి పలు చట్టాలు చేశాం. జీఎస్టీ బిల్లు తెచ్చి దేశ ఆర్థిక రంగ రూపురేఖలు మార్చాం. మా పాలనలో అన్నివర్గాలకు సామాజిక న్యాయం చేశాం. ప్రస్తుత లోక్‌సభలో అనేక సమావేశాలు మంచి ఫలితాలిచ్చాయి. సభలో ప్రస్తుతం ఉన్న సభ్యులంతా మళ్లీ సభకు రావాలని కోరుకుంటున్నాను’ అని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. కాగా మోదీ ప్రసంగం కంటే ముందు స్పీకర్ మహాజన్‌ను సభ్యులందరూ అభినందించారు.