
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. సోమవారం ఆయన విలేరులతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు పనిచేస్తున్నామని, సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ తమ నినాదమన్నారు. సంఖ్యా బలం లేదని విపక్షాలు బాధ పడొద్దని, ప్రతిపక్ష పాత్రను తాము గౌరవిస్తామన్నారు. స్వపక్షం విపక్షం అనే మాటలను పక్కన పెట్టి ప్రజల కోసం కలిసి నిష్పక్షపాతంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చామని, మరోసారి సేవ చేసే అవకాశం తమకు ప్రజలు కల్పించారని చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాల్సిన అవసరముందన్నారు. కొత్త ఆశలు, స్వప్నాలతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, లోక్‌సభకు ఈసారి ఎక్కువ మంది మహిళలు ఎన్నికయ్యారని అన్నారు. అనేక అంశాలపై చర్చ జరగాల్సి ఉందని, ప్రతిపక్షం చురుగ్గా చర్చల్లో పాల్గొనాలని ప్రధాని ఆకాంక్షించారు.
కాగా, లోక్‌సభ ప్రోటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు.