‘వచ్చే ఎన్నికలు ఏకపక్షమే’

People want KCR Leadership Said By KTR - Sakshi

ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘వచ్చే ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగానే ఉంటాయి. రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. మేం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. 2019లో సింగిల్‌గానే గెలిచి వస్తాం..’’అని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల్లో ఉండనని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని విలేకరులు ప్రస్తావించగా.. సీఎం కేసీఆర్‌ చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ‘‘ఎమ్మెల్యేలకు ఓట్లు వేసేది కేసీఆర్‌ను సీఎం చేయడానికే. వచ్చే ఎన్నికల్లో మా నినాదమే సీఎం కేసీఆర్‌. ఆయన చేసిన మంచి పనులే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి. ఎమ్మెల్యేలపై చిన్న చిన్న అసంతృప్తులున్నా ప్రజలు పట్టించుకోకుండా మాకు ఓట్లు వేస్తారు. ఎమ్మెల్యేల కదలికలపై ఏ రోజుకారోజు నివేదికలు వస్తున్నాయి. లోపాలను సరిదిద్దుకోవడానికి ఏడాది సమయం ఉంది..’’అని చెప్పారు. 

కేసీఆర్‌.. ఓ ఆధ్యాత్మిక వ్యక్తి.. 
బీజేపీ హిందూత్వ నినాదం తెలంగాణలో పనిచేయదని.. వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల కంటే ఎక్కువ ఆధ్మాత్మికత ఉన్న వ్యక్తి కేసీఆర్‌ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉండి కూడా తన ధార్మిక విశ్వాసాలను బహిరంగంగానే ప్రకటిస్తున్నారని.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు సైతం చేయని విధంగా ఆలయాలు నిర్మిస్తున్నారని, యాగాలు చేశారని చెప్పారు. రాష్ట్రంలో హిందూ–ముస్లిం పంచాయతీలు పెట్టే అవకాశం సైతం బీజేపీ వారికి లేదని.. అత్యంత పకడ్బందీగా శాంతి భద్రతలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే.. ‘బడితె ఉన్నోడిదే బర్రె’ అన్నట్టుగా ఉందని విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీలో బల నిరూపణకు అక్కడి గవర్నర్‌ బీజేపీకి 15 రోజులకు బదులు ఐదేళ్ల సమయమిచ్చి ఉండాల్సిందని ఎద్దేవా చేశారు. 

మేం ఎవరి కిందా పనిచేయడం లేదు.. 
బీజేపీతో టీఆర్‌ఎస్‌కు ఎలాంటి లోపాయికారీ ఒప్పందం ఉందన్న విమర్శలు అర్థరహితమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తమకు కేసీఆరే బాస్‌ అని.. నరేంద్ర మోదీయో, రాహుల్‌ గాంధీయో కాదని వ్యాఖ్యానించారు. ఏ ఒక్కరి కిందా ఉండాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇక తనకు సీఎం కావాలన్న ఆశ లేదని, మరో పది పదిహేనేళ్లు కేసీఆరే సీఎంగా ఉంటారని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆరోగ్యాన్ని చూస్తూంటే.. తాము ఆయనకంటే ముందే రిటైరవుతామని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రావడమే చాలని, అంతకంటే ఎక్కువ తాను కోరుకోలేదని చెప్పారు. మంత్రి పదవి రావడమే తనకు బోనస్‌ లాంటిదన్నారు. 

అసహనంతోనే అడ్డగోలు హామీలు! 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం నడుస్తోందంటూ కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శల్లో నిజముంటే.. ఆ పార్టీ నల్లగొండ, ఆలంపూర్‌ స్థానాల్లో ఎన్నికలకు ఎందుకు సిద్ధం కావడం లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కాంగ్రెస్‌ తప్పుడు హామీలిస్తోందని.. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో నిరుద్యోగుల లెక్కలు చూపాలని సవాల్‌ చేశారు. నిరుద్యోగులంటే 5వ తరగతి వరకే చదివినవారా, లేక పదో తరగతి వరకే చదివినవారా అని ప్రశ్నించారు. అసహనంతోనే ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. తాము నాలుగేళ్లలోనే టీఎస్‌పీఎస్సీ ద్వారా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. ఇతర సంస్థల ఆధ్వర్యంలో జరిపిన నియామకాలు దీనికి అదనమని కేటీఆర్‌ చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. తాము నిరుద్యోగ భృతి ఇవ్వడం కాదని.. నిరుద్యోగాన్ని తగ్గించే దిశగా, ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాల కల్పన దిశగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఫార్మాసిటీ ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. వెల్‌స్పన్‌ పరిశ్రమకు రాయితీల మంజూరులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను కేటీఆర్‌ ఖండించారు. ఉద్యోగావకాశాల కోసం అన్ని రాష్ట్రాలు భారీ పరిశ్రమలకు రాయితీలు ఇస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టకపోవడంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టినా, పెట్టకపోయినా పెద్దగా వచ్చే నష్టమేమీ లేదన్నారు. 

‘రైతుబంధు’తో రెండో హరిత విప్లవం 
రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకం అసాధారణ చరిత్రాత్మక నిర్ణయమని.. ఇది దేశంలో రెండో హరిత విప్లవానికి నాంది పలకనుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. తాను పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని.. ఇన్నేళ్లలో ‘రైతుబంధు’పథకం ద్వారా కలిగిన సంతృప్తి మరే కార్యక్రమం ద్వారా లభించలేదని చెప్పారు. ఈ పథకం కింద 58 లక్షల మందికి రూ.5,700 కోట్ల సాయం పంపిణీ చేస్తుండగా.. అందులో 98.3 శాతం మంది పదెకరాల్లోపు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. పదెకరాలకుపైన భూమి కలిగిన రైతులు 1.7 శాతమేనని, వారికి చెల్లించేది రూ.7.13 కోట్లు మాత్రమేనని చెప్పారు. ఇంత మంచి కార్యక్రమానికి ఆటంకం కలిగించాలనే విపక్షాలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతుబంధు ద్వారా ఐదెకరాలున్న ప్రతి రైతుకు ఐదేళ్లలో రూ.2 లక్షలు అందుతాయన్నారు. కౌలు రైతులకు రైతుబంధు వర్తింపజేయడం ఆచరణలో సాధ్యం కాదని స్పష్టం చేశారు. 

కేంద్రం చేతులెత్తేసింది.. 
ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని కేటీఆర్‌ చెప్పారు. దాంతో సీఎం కేసీఆర్‌ బుద్వేల్, మేడ్చెల్‌లలో ఐటీ క్లస్టర్ల ఏర్పాటును చేపట్టారని వెల్లడించారు. బయ్యారం కర్మాగారంలో సెయిల్, ఎన్‌ఎండీసీల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం నిరాకరించడంతో.. సింగరేణి నుంచి పెట్టుబడులు పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయించారని తెలిపారు. ఇక సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునరుద్ధరణకు బ్యాంకర్ల కన్సార్షియం అంగీకరించిందని.. దానిని జేకే పేపర్‌ కంపెనీ త్వరలోనే పునరుద్ధరించనుందని వెల్లడించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top