బీకే గొప్పలు..జనం తిప్పలు

Penukonda MLA BK Parthasarathi Not Fulfilled Promises - Sakshi

పెనుకొండ..సమస్యల బండ 

ఐదేళ్లుగా నెరవేరని హామీలు 

కియా పేరుతో భారీ దోపిడీ 

సాక్షి, పెనుకొండ: అసమర్థ ప్రజాప్రతినిధి అరాచకంతో దశాబ్దకాలంగా ఎదుగూబొదుగూలేని నియోజకవర్గంగా పెనుకొండ మిగిలిపోయింది. ఎటు చూసినా బీడు భూములే.. తాగునీటి ఇబ్బందులే.. అందరూ వలసపోగా నిర్మానుష్యంగా ఉన్న పల్లెలే. అయినా స్థానిక ఎమ్మెల్యే మాత్రం అరచేతిలో అభివృద్ధి చూపుతున్నారు. అన్నీ తానే చేశానంటూ గొప్పలు చెబుతున్నారు. ఎన్నికల వేళ హామీల ముల్లె భూజాన వేసుకుని ఊరూవాడా తిరుగుతున్నారు.

రోడ్డులేదు.. నీరురాదు..ఇల్లు లేదు
2014 ఎన్నికల్లో పార్థసారథి పెనుకొండ పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. కానీ దర్గాపేటలో మాత్రం నాటుగైదు రోజులకు ఒకసారి నీరు వదలుతుంటే ఆ ప్రాంత ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. దీంతో ప్రజలు తరచూ ఆందోళనలు చేస్తున్నా...ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోవడం లేదు. పెన్నానదికి అడ్డంగా సబ్‌సర్ఫేస్‌ డ్యాం కట్టించి ఈ ప్రాంత ప్రజల సాగు, తాగునీటి సమస్య తీర్చుతానని బీకే పార్థసారథి హామీ ఇచ్చినా.. అది కాగితాలను పరిమితమైంది. ఇక నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లుకూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే నియోజకవర్గకేంద్రంలో గత ప్రభుత్వాలు పట్టాలివ్వగా...లబ్ధిదారులు ఇల్లు కట్టుకోకుండా ఎమ్మెల్యేనే అడ్డుపడ్డారు. ఇళ్లు నిర్మించుకునేందుకు వెళ్తున్న పేదలను పోలీసుల ద్వారా ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

రాయల ఉత్సవాలకూ మంగళం 
పురాతన కట్టడాలను అభివృద్ధి చేసి ఈప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే..తన మాట నిలుపుకోలేదు. అసలు పురాతన కట్టడాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక రాయల ఉత్సవాలను నిర్వహించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఇక పర్యాటక కేంద్రం అన్న అంశాన్నే అటకెక్కించారు.
 
విద్యాభివృద్ధికి చర్యలు లేవు 
ఇక్కడి బాలికల కోసం జూనియర్‌ కళాశాల ఏర్పాటుచేస్తానని చెప్పినా... నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. అలాగే పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుకు పూర్థిస్థాయిలో కృషి చేసి విద్యార్థులు టెక్నికల్‌ కోర్సులు చదివేలా చూస్తానన్న ఆయన హామీ గాల్లో కలిసిపోయింది. ఇక పరిగిలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తానని  చెప్పినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.

నీళ్లు కరువు..బీళ్లుగా పొలాలు 
గోరంట్ల మండలానికి హంద్రీనీవా నీళ్లు తీసుకువస్తానని గొప్పలు చెప్పిన బీకే..నేటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇక  గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని తీసుకువచ్చి హంద్రీనీవా కాలువ ద్వారా నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపుతానని ఆయన ఇచ్చిన హామీ...గాల్లో కలిసిపోయింది. దీంతో రిజర్వాయర్‌ కింద ఉన్న 10 వేల ఎకరాలు, పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం మండలాల పరిధిలోని 25 చెరువుల కింద ఉన్న 14 వేల ఎకరాలు బీడుగా మారిపోయింది. కళ్లముందే పారుతున్న కృష్ణా జలాలు పొలాల్లో పారక రైతులు అల్లాడిపోతున్నారు. ఇక పెనుకొండ మండలంలోని మునిమడుగు చెరువు తెగి ఏళ్ళు గడుస్తున్నా.. పట్టించుకోలేదు.
 
చేనేతలకు మొండిచేయి 
పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల, పరిగి మండలాల్లోని చేనేతల ఓట్ల కోసం బీకే పార్థసారథి ఎన్నికల వేళ అలవిగాని హామీలిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక కనీసం వారిని పలకరించిన పాపన పోలేదు. చేనేతల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కూడా అందక...అప్పుల పాలైన ఎందరో చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నా...ఆయన స్పందించలేదు. ఇవే కాకుండా రొద్దం డెయిరీని తెరిపించడం.. గోరంట్లలో హిందూశ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా నేటికీ నెరవేరలేదు. 

అవినీతి ఆరోపణలు  
ఎమ్మెల్యే బీకే పార్థ సారథి ఈ నాలుగున్నరేళ్లలో అవినీతి, ఆరోపణలకు కేంద్ర బిందువుగా నిలుచారు. అల్లుడు శశిని ప్రోత్సహించి సెంటిల్‌మెంట్లు, దందాలు సాగించారు. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు కోసం రూ.కోట్లు పర్సెంటేజ్‌ తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేద రైతుల భూములను తక్కువ ధరకు కోనుగోలు చేసి అనంతరం మూడు రెట్లు ఎక్కువకు ‘కియా’ యాజమాన్యానికి విక్రయించారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రైతులను బెదిరించి పరిశ్రమ సమీప ప్రాంతాల్లో రూ.కోట్ల విలువజేసే భూములు అక్రమంగా కొనుగోలు చేసినట్లు జనం చర్చించుకుంటున్నారు. ఇక పేటకుంట సమీపంలో ఓ సామాజిక సంస్థ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి రూ.కోట్ల రూపాయల లాభానికి విక్రయించారన్న విమర్శలున్నాయి. అలాగే పరిగి మండలం ఊటుకూరు చెరువులో కియా అనుబంధమైన  కేఐఎంఎల్‌ పరిశ్రమ ఏర్పాటులో ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించి రైతులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.   

ప్రజా సమస్యలు ఎమ్మెల్యేకు పట్టవు 
ఎమ్మెల్యే బీకే పార్థ సారథికి ప్రజా సమస్యలు పట్టవు. అందుకే ఇక్కడ అభివృద్ధి జరగలేదు. నియోజకవర్గ కేంద్రంలోని దర్గాపేటలో వందలాది మంది ఇళ్లులేక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య వేధిస్తోంది. ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేస్తున్నా...ఎమ్మెల్యేకు పట్టడం లేదు.

 
– యాసిన్,  పెనుకొండ 

వ్యవసాయం మానుకున్నాం 
చెరువుకు మరమ్మత్తులు చేయించి రైతులను ఆదు కుంటానని బీకే పార్థ సారథి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తీరా ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఇపు డు హడావుడిగా పనులు ప్రారంభించారు. చెరువు కు నీళ్లు చేరక..వ్యవసాయం చేయడమే మానేశాను.
 
– శేఖరప్ప, రైతు, మునిమడుగు, పెనుకొండ  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top