ప్రథమ దోషి చంద్రబాబే: వైఎస్ఆర్‌సీపీ

Parthasarathy And Botsa Satyanarayana Fired On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: కేంద్రం ప్యాకేజీ ప్రకటించగానే స్వాగతించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తానేదో చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధులు బొత్స సత్యనారాయణ, పార్థసారధి విమర్శించారు. హోదా రాకపోవడంలో ప్రథమ దోషి చంద్రబాబేనంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 29సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసినప్పుడు ఇచ్చిన విజ్ఞప్తులను బహిర్గతం చేయాలని చంద్రబాబును పార్థసారధి డిమాండ్ చేశారు. ఇప్పటికీ అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నారు తప్ప.. రాష్ట్రం అభివృద్ధి చెందాలని మాత్రం కోరుకోవడం లేదన్నారు. పోలవరం నిధుల విషయంలో కేంద్రంతో ఏనాడు మాట్లాడని చంద్రబాబు.. కాంట్రాక్టర్లను మార్చేందుకు మాత్రం నాగ్‌పూర్‌కు 10 సార్లు వెళ్లారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

చివరగా ఈ జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ప్యాకేజీ గురించే చంద్రబాబు మాట్లాడారని ఆరోపించారు. గతంలో రాజీనామాలు చేసి చాలా మంది, చాలా ప్రాంతాల్లో డిమాండ్లు సాధించకున్నారని, మరి చంద్రబాబు రాజీనామాలపై ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. మోదీపై ఎంత పోరాటం చేయాలో అంతకంటే ఎక్కువ చంద్రబాబుపై చేయాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి సిగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారని, అందులో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టి నీచ రాజకీయాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ రిలే దీక్షలు చేపట్టాలని, ప్రజలు మేధావులు, విద్యార్థులు, యువకులు మాతో కలిసి పోరాటంలో భాగస్వాములు కావాలని పార్థసారధి పిలుపునిచ్చారు.

టీడీపీని ప్రజలు క్షమించరు: బొత్స సత్యనారాయణ
సాక్షి, విజయవాడ: ఏపీకి హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, ఎంపీలతో రాజీనామాలు, ఆపై ఆమరణ నిరాహారదీక్షకు వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు. హోదా అనేది మన బతుకు సమస్య అని, అదే మనకు సంజీవని అని బొత్స పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలు మాతో కలిసి రావాలని, అందరూ రాజీనామా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హోదా విషయంలో చిత్తశుద్ధి ఉంటే తన ఎంపీలతో చంద్రబాబు రాజీనామా చేయించాలన్నారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తేనే కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందని, లేకుంటే టీడీపీని ప్రజలు క్షమించరని.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెప్తారంటూ హెచ్చరించారు.

నాలుగేళ్లుగా అహింసాయుతంగా పోరాడుతున్నామని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎన్నో ఉద్యమాలు చేశామన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో ప్రజలు, విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. హోదాతోనే విద్యార్థులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని, ఏపీలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో పెట్టిన కేసులన్నింటిని చంద్రబాబు సర్కార్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అందరం కలిసికట్టుగా పోరాడి హోదాను సాధించుకోవాలని, మా పోరాటానికి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి సహకరించాలని బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top