పరిటాల శ్రీరామ్‌ అనుచరుల వీరంగం

Paritala Sriram Followers Attack On Ysrcp Leaders - Sakshi

వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి

నలుగురికి గాయాలు  

చెన్నేకొత్తపల్లి: అనంతపురం జిల్లాలో రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. నాగసముద్రం గేటు వద్ద శుక్రవారం మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ అనుచరులు వైఎస్సార్‌సీపీ నేతలపై విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడికి దిగారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోకపోవడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.  మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల యూత్‌ కన్వీనర్‌ ఓబిలేసు,నాయకులు చింతకాయల పోతన్న, నాగేంద్ర, మేడాపురం రాజు, ముత్యాలు శుక్రవారం ఎన్‌.ఎస్‌.గేటులోని ఒక కూల్‌డ్రింక్‌ షాపు వద్ద నిలబడి ఉన్నా రు.

ఆ సమయంలో అక్కడికి వచ్చిన  పరిటాల శ్రీరామ్‌ అనుచరులు మహేష్, పవన్‌కుమార్‌రెడ్డి, పోతలయ్య, సురేష్, రమణాచారి, ఫిరోజ్‌ వారితో గొడవకు దిగారు. ‘ఈ ప్రాంతం పరిటాల శ్రీరామ్‌ అడ్డా.. ఇక్కడ వైఎస్సార్‌సీపీ నాయకులు ఎవ్వరూ తిరగకూడదు’ అంటూ చిందులు తొక్కారు. వారిని అడ్డుకోబోయిన ఓబిలేసుతోపాటు మరో నలుగురిపై మారణాయుధాలు, కట్టెలతో దాడి చేసి గాయపరిచారు. వైఎస్సార్‌సీపీ నేతలు నేరుగా చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. 

రోడ్డుపై బైఠాయించిన వైఎస్సార్‌సీపీ నేతలు 
ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగాయి. తమ పార్టీ నాయకులపై దాడి చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పార్టీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు రెండు గంటల పాటు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడికి పాల్పడ్డ ఆరుగురిని అరెస్టు చేసినట్లు రామగిరి సీఐ తేజోమూర్తి తెలిపారు. దాడికి పాల్పడిన మహేష్, పవన్‌కుమార్‌రెడ్డి, పోతలయ్య, సురేష్, రమణాచారి, ఫిరోజ్‌పై 143, 147, 148, 307, 324 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top